సమయం
అమృత వాక్కులు
సమయం
సమయం అమూల్యమైనది. భగవత్ స్మరణలోనే అది ఫలప్రదమౌతుంది. శ్రీ మహావిష్ణువు త్రికాలాలకు అధిపతి. కృష్ణ పరమాత్మ అక్షయమైన కాలాన్ని తానేనంటూ తనను కాలస్వరూపుడిగా చెప్పుకున్నాడు. సమయం విలువను, భగవత్తత్వాన్ని మనిషి గుర్తిచేందుకు చేసిన బోధ అది.
కాలచక్రం తిరుగుతుంది. ఆయుష్షు ఆవిరవుతుంది. గోవిందుడిని భజించి జీవిత కాలాన్ని సఫలం చేసుకొమ్మని ఆదిశంకరులు సూచించారు. శ్రీమన్నారాయణుడికి కాలమూర్తి అనే పేరుంది. కాలం ఎవరికీ అనుకూలం కాదు, ప్రతికూలం కాదు. అందరికీ సమానం. సమయ ప్రణాలికను సిద్ధం చేసుకొని నిరంతరం శ్రమించేవాడే జగజ్జేతగా నిలుస్తాడు. కాలం పరాజితుడికీ యోగ్యుడిగా మారే అవకాశం ఇచ్చుకుంటూ వెళుతుంది. పరివర్తనుడై శ్రమించే ఆ వ్యక్తి భోగి నుంచి యోగిగా మారిన మరో వేమన అవుతాడు. మనిషి నుంచి మహాత్ముడి స్థాయికి, ఎదిగిన ఇంకో గాంధీజీ అవుతాడు.
జీవితం నిరంతర ప్రయాణం. గమ్యాన్ని కాలం నిర్ణయిస్తుంది. మనిషి మాత్రం సత్యం, ధర్మాలను రెండు పాదాల ముద్రలుగా మలచుకుంటూ సాగిపోవాలి.
- బిజ్జా నాగభూషణం