శాంతి గుణం
అమృత వాక్కులు
శాంతి గుణం
శాంతి స్వభావం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. శ్వాసక్రియ ఒడుదుడుకులు లేకుండా క్రమానుగతిలో ఉంటుంది. శ్రేష్టకర్మలకే దోహదం చేస్తుంది. భయంలేని జీవితాన్నిస్తుంది. శాంతి గుణం హింసను ప్రేరేపించదు. సర్వజన అభ్యుదయాన్ని కోరుతుంది. శాంతగుణం మనసును, శరీరాన్ని పవిత్రంగా, నిశ్చల గుణతత్వంతో ఉండేలా చేస్తుంది. చుట్టూ వున్న పరిసరాలను ప్రశాంత తపోవాటికల్లా మారుస్తుంది.
సమదృష్టి, సమభావం ఈ రెండూ మనసులో శాంతిగుణం పెంపొందేందుకు మూలాలు. అన్ని అరిష్టాలకు, దుష్ఫలితాలకు మూలం కామక్రోధాలు. వాటిని అదుపుచేయగలిగేది ఒక్క శాంతిగుణం మాత్రమే. మనకు మానవులకు మాత్రం ప్రకృతి, పంచభూతాలు సృష్టి సర్వం గురువులే. ఇప్పుడు ప్రపంచమంతా ఆదరిస్తున్న, ఆచరిస్తున్న “యోగ "ఆసనాలు పక్షుల్ని జంతువుల్ని చూసి రూపకల్పన చేసినవే. జీవితం అంటే ప్రతిక్షణం ఒక అనుభవం. ప్రతి అనుభవం ఒక పాఠం. అనుభవాల సమాహారమే జీవితం. మనము నేర్చినది కేవలం ఆస్వాదనకు కాదు. అధ్యయనానికి కూడా. ఆ తర్వాతే ఆచరణకు.