వైరాగ్యం
అమృత వాక్కులు
వైరాగ్యం
వైరాగ్యం వంటి ధనం, బ్రహ్మబోధకు సమానమైన సుఖం, సద్గురువును మించిన రక్షకుడు, సంసారం లాంటి శత్రువు లోకంలో లేడు. వైరాగ్యం అంటే అడవులకెళ్లి ఋషులలాగ తపస్సు చేయడం కాదు. సంసారంలో సమాజంలో వుంటూనే తామరాకు మీద నీటి బిందువులాగ తామరాకుకు నీటి బిందువు అంటకుంట వుంటుంది. అలానే మనము సంసారంతో సమాజంలో వుంటూనే వ్యామోహాన్ని అంటీ అంటనట్టుగా వుండడమన్నమాట. అదే వైరాగ్యం .
సృష్టి, స్థితి, లయలలో గోచరిస్తున్న లయ దశలో పూర్ణత్వం గోచరిస్తుంది. ఆ పూర్ణత్వమే శివత్వం. నది ప్రవహించి సముద్రంలో లయమై తాను సముద్రమైనట్లే జీవుడు పరమాత్మగా మోక్షస్థితి లయ. మోక్షస్థితిలో ఉన్న పరిపూర్ణతే లయ కారకుడైన రుద్రుడి తత్వం. శుభమే తానైనవాడు శివుడు. శుభాలకు ఆధారమైనవాడు శంభుడు. శభాశుభాలను అందించేవాడు శంకరుడు. రోధనలు పోగొట్టేవాడు రుద్రుడు. ఇన్ని రూపాల సదాశివుడికి నమో నమః.
నిండు మనసుతో కళాత్మకంగా కాలం గడపడాన్ని యోగవాసిష్ఠం "సజీవంగా జీవించడం” అని నిర్వచించింది. మనిషికి జీవితంలో సమయ సద్వినియోగమే, ప్రతిభకు కొలమానంగా, తార్కాణంగా నిలుస్తుంది.
- బిజ్జా నాగభూషణం