మహోన్నత వ్యక్తి
అమృత వాక్కులు
మహోన్నత వ్యక్తి
నీతి నిజాయితీ వున్నవాడు ప్రకాశిస్తాడు. సత్యం, ధర్మం పాటించేవాడు మహోన్నత వ్యక్తి అవుతాడు. నిస్వార్థంగా వున్నవాడు అందరి మన్ననలు అందుకుంటాడు. సేవే జీవిత లక్ష్యంగా గడిపేవాడు అందరి హృదయాలలో నిలిచిపోయి ఒక తారగా వెలుగుతాడు. జీవితాన్నే ప్రజలకు అంకితం చేసినవ్యక్తి. ఈ లోకంలోనే ధ్రువతారగా నిలిచి పోతాడు.
ఈ లోకంలో ప్రతిరోజు ఎందరో పుడుతూ, చస్తూ వుంటారు. అది చూస్తూ తనకు చావులేదని, రాదని, రాకూడదని అనుకునేవాడు అమాయకుడు, అజ్ఞాని. లోకంలో ఇంతకు మించిన ఆశ్చర్యకర మయినది, వింతయినది మరొకటిలేదని ధర్మరాజు యక్షుడికి చెప్పి “భళా” అనిపించుకున్నాడు. చావు గురించిన బెంగ, భయం తొలిగించు కోవడానికి మూడు దారులున్నాయి. తార్కిక, ప్రాణిక, మానసిక శక్తుల ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. మేధామథనం చేసి చావుబతుకులు బొమ్మా బొరుసు లాంటివని జ్ఞాని తెలుసుకుంటాడు. వివేకి మనోధైర్యంతో, యోగి ఆత్మబలంతో యదార్థం గ్రహిస్తారు. చేతనం ఒక ఆగని ప్రవాహం. యదార్థం ఎప్పటికి ఉండేది. మారేది పదార్థం. ప్రకృతి ప్రభావం వల్ల ఈ ప్రపంచం మారుతుంది. కాబట్టి శరీరాలు రాలినా చైతన్యం మనిషికి మరోజన్మను సరికొత్త జీవితం ప్రసాదిస్తుంది. మృత్యువు ఆవలితీరాన అమృతత్వం స్వాగతిస్తుందని అటువైపు అడుగువేయమని ఉపనిషత్తు ఆశ్వాశిస్తున్నది. జ్ఞానవంతుడు వివేకంతో జీవన్ముక్తుడై ఈ లోకంలోనే ఉంటాడు. మరణం ముక్తికి ముఖద్వారంగా గుర్తించినవాడు జ్ఞాని. జ్ఞాని అంటే తనకు బహుప్రీతి అని గీతాచార్యుడు చెప్పాడు భగవద్గీత లో. భవతరణోపాయం తెలుసుకున్నవాడే మృత్యుంజయుడు. మరణాన్ని ఒక విరామం గానే చూడాలి. జీవితరంగంలో నిర్విరామంగా శ్రమిస్తూ మున్ముందుకు సాగాలి. అదే లక్ష్యం. అదే మోక్షం.
- బిజ్జా నాగభూషణం