భగవంతుని ఉపాసన
అమృత వాక్కులు
భగవంతుని ఉపాసన
హైందవ సంప్రదాయంలో భగవంతుని ఉపాసన రెండు విధాలు.
1. సగుణోపాసన,
2. నిర్గుణోపాసన.
1. సగుణోపాసన - విగ్రహ పూజ లేదా మూర్తి పూజ సగుణోపాసనకు చెందినది. సగుణోపాసనలోను షోడశోపచార విధానాలు, అంటే పదహారు శాస్త్రీయ ఉపాసనా విధానాలున్నాయన్నమాట. ధ్యానం, ఆవాహనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోప వీతం, గంధం, పుష్పాక్షతలు, దూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ, నమస్కారాలనే పదహారు సగుణోపాసనలోని అంతర్భాగాలు. విగ్రహారాధన మూడాచారం కాదని, అది సాధకుడికి మొదటి పరీక్ష లాంటిదని విజ్ఞులు చెబుతారు. సేవాతత్పరత, ఏకాగ్రత, ఆత్మసమర్పణ భావన సగుణోపాసనలో ప్రాథమికంగా ఉండవలసినవి. ఒక్కో వ్యక్తికి ఒక్కో దేవుడంటే నమ్మకం. దాన్నెవరూ కాదనలేరు. దేనికైనా మూలం భక్తి, విశ్వాసమే. విగ్రహా రాధనలో దేహశుభ్రత, శుచికి, మనోనైర్మల్యానికి ప్రాధాన్యం వుంటుంది. నేత్రాలద్వార విగహాలలో భగవంతుని దర్శించడం, సంభావించడం, అలవాటు చేసుకుంటే, ఆధ్యాతిక అనుభూతి పొందగలిగితే అదే భగవంతుడి దగ్గరకు మనల్ని చేరుస్తుంది.
2) నిర్గుణోపాసన - అంటే భగవంతునికి రూపం లేదని అనుకొని పూజించడం. నిర్గుణోపాసన. పరమహంసలకు, పరమయోగులకు సాధ్యం. నిర్గుణోపాసన చేయాలంటే మొదట సగుణోపాసన అనే మెట్టు ఎక్కాలి. నిర్గుణోపాసన అంటే భగవంతుడు నిరాకారుడు, అంటే ఆకారం లేనివాడు. అంటే రూపం లేనివాడు. కానీ భగవంతుడు వున్నాడు అని భగవంతున్ని ఉపాసించడం అంటే పూజించడం.
- బిజ్జ నాగభూషణం