జీవనమార్గ సూత్రాలు
అమృత వాక్కులు
జీవనమార్గ సూత్రాలు
ఓర్పు మనిషి ఒడు దొడుకులు నివారిస్తుంది. నిగ్రహం మనిషిని నిలకడగా నడిపిస్తుంది. ధర్మం మనిషిని దైవం చెంత చేరుస్తుంది. సత్యం మనిషిని సత్పురుషుని చేస్తుంది. ప్రేమ మనిషికి అందరికి పంచినా తరగనని చెబుతుంది. నీతి మనిషిని పది మందిలో నిలబెడుతుంది. నిజాయితి మనిషిని నిబ్బరంగా వుంచుతుంది.కాలం మనిషికి కలకాలం వుండవని గుర్తుచేస్తుంది. ఇవి మనిషికి జీవన్మార్గ సూత్రాలని గమనించమంటుంది.
వినయాన్ని మించిన మిత్రుడు, వినయం కన్నా గొప్ప ఆభరణం మనిషికి మరొకటి ఉండదు. గురుభక్తి దైవం పట్ల విశ్వాసం వల్లనే ఇది అలవడుతుంది. సమ సందర్శనం, సంయమనం, సారూప్యం కలిగించేది జ్ఞానమార్గం. అవే పంచభూతాలు మనిషికి ప్రసాదించే జ్ఞానేంద్రియతత్వాలు. సామరస్యం, సౌభ్రాతృత్వం, సహకారం నమ్రత మనిషిని భగవంతుడి స్థాయికి చేర్చే సాధనాలు. అవి సామిక ధర్మాలు. దైవత్వంలో ఏదీ మిథ్యకాదు అన్నీ ఉన్నవే. పరమాత్మ ఎంత సత్యమో ఇటు జీవుడూ, అటు జడపదార్థమైన జగత్తు అంతే సత్యం. అన్నింటిలోనూ ఆనందస్వరూపమైన బ్రహ్మం మాత్రమే అత్యుత్తమం. మానవ మనుగడలో లౌకికంగా భిన్నత్వం సహజం. అలౌకికంగా ఏకత్వం సహజం, రెండింటి సమ్మేళనమే జీవితం. మానవ జీవితానికి ధర్మాచరణే ఒక భాద్యత. అందులోనే హక్కులు, ఆనందం ఇమిడి ఉంటాయి.
- బిజ్జ నాగభూషణం