నవ్వితే
అమృత వాక్కులు
నవ్వితే
నీరు నవ్వితే తొలకరి
నింగి నవ్వితే పులకింత
గాలి నవ్వితే పరిమళం
అగ్ని నవ్వితే చైతన్యం
మట్టి నవ్వితే పరమాన్నం
మనిషి నవ్వితే మానవత్వం
మందస్మితవదనారవిందంతో ఉన్న వ్యక్తిని చూస్తుంటే బాధలో వున్న వ్యక్తికి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. వసంతం పువ్వుల మయమైనట్లుగా జీవితం నవ్వులమయమైతే, ఈ జీవితమనే వసంతంలోని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఆ నవరతం ఆస్వాదిస్తూ ఉండవచ్చు. నవ్వే అమృతతుల్యం. నవ్వే నవపారిజాతం.
ప్రసన్నముగా ఉంటే ఆరోగ్యం, చక్కని దుస్తువులను ధరిస్తే తేజస్సు. ఒకరికి సహాయ పడితే క్షేమం, నవ్వుతూ ఉంటే దివ్య
సౌందర్యం, మధురంగా మాట్లాడితే మంగళకరం, సువర్ణాభరణాలను ధరిస్తే ఆయువృద్ది, ఎప్పుడు ఆనందంగా ఉంటే లక్ష్మీ ప్రదం, మితంగా భుజిస్తే చక్కని రూపం, తృప్తి ఉంటే నిత్య యవ్వనం, పట్టుదలతో పనిచేస్తే విజయం తథ్యం. పదుగురితోనే జీవితం, అదే పది అవతారాల పరమార్థం.
మనిషికి వ్యావహారిక శారీరం పారమార్థిక శరీరం అని రెండు దేహాలున్నాయి అని ప్రాజ్ఞులంటారు. వ్యవహారిక దేహం నిత్యకర్మల నిమిత్తమైతే, పారమార్థిక దేహం ముక్తి సాధనకు. పారమార్థిక దేహం, ఇది స్తూల శరీరంలో ఇమిడి ఉంది. అందులో పరబ్రహ్మ దివ్య తేజో రూపం కొలువై వుంటుంది.
విద్య రెండు రకాలు : పరవిద్య, అపరావిద్య. పరోపకారానికి వినియోగించే విద్యలు అపరావిద్యలు. కేవలం మన ఉదరపోషణకు మన సుఖాలకోసం నేర్పే విద్య పరవిద్య.
- బిజ్జ నాగభూషణం