గురుపౌర్ణమి
అమృత వాక్కులు
గురుపౌర్ణమి
కషాల్లో శ్రమలో నిరంతరం రాటుదేలిన మనిషి కొలిమిలో కాలిన బంగారంలా ప్రకాశిస్తాడు. ఆ తపన, సహనం లేని మనిషి ఏమి సాధించలేడు.
మౌనం వలన మనస్సు శుద్ధి అవుతుంది, స్నానం వలన దేహం శుద్ధి అవుతుంది. ధ్యానం వలన బుద్ది శుద్ధి అవుతుంది. ప్రార్థన వలన ఆత్మ శుద్ధి అవుతుంది. దానం వలన సంపద శుద్ధి అవుతుంది. ఉపవాసం వలన ఆరోగ్యం శుద్ధి అవుతుంది. క్షమాపణ వలన సంబంధం శుద్ధి అవుతుంది.
మనకు స్కూలులో, కాలేజీలో, గురుకులాలో, ఆశ్రమాలలో, ప్రవచనాలలో స్వాముల నిలయాలలో సత్పురుషుల సన్నిధిలో విద్య, జ్ఞానం ఇచ్చే వారు గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదాలలో చెప్పారు. అంటే తల్లి తండ్రి తర్వాత స్థానం మూడవ స్థానం గురువుదన్నమాట. గురువు పూజనీయుడు, వందనీయుడు, చిరస్మరణీయుడు, గౌరవనీయుడు, దైవస్వరూపుడు అసలు గురు పౌర్ణిమ వ్యాసమహర్షి అంటే వ్యాసభగవానుడు పుట్టినరోజు. వ్యాసున్ని స్మరించే రోజు దీన్ని వ్యాసపౌర్ణిమ అని కూడా అంటారు.
వ్యాసభగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడి అవతారమంటారు. వ్యాసుడు బాసరలో ఇసుకతో సరస్వతి విగ్రహం చేసి పూజించాడు. అందుకే బాసర చదువులతల్లి సరస్వతి నిలయంగా ఖ్యాతినార్జించింది. వ్యాసభగవానుడు ప్రపంచానికిచ్చిన గొప్ప గ్రంథరాజమే మహాభారతం. సంస్కృతంలో వ్రాసారు. శ్రీ వ్యాసభగవానుడు అనర్గళంగా నోటితో చెబుతుంటే విఘ్నేశ్వరుడు స్వతహాగా వ్రాసిన గ్రంథం మహాభారతం. ఇందులో ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునిద్వారా మనకు బోధించింది. జ్ఞానమార్గం, భక్తి మార్గం, కర్మమార్గం, చివరకు మోక్షమార్గం వున్న భగవద్గీత ఇది. సర్వజగత్తుకు సర్వమతాలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం. జపాన్లో కూడా దీన్ని బోధిస్తున్నారు. మానవాళికి ఇది భగవంతుడు చూపిన జీవన మార్గగమ్యం , మోక్ష మార్గం. ఇది వ్రాసిన వ్యాసభగవానుడి జన్మదిన గురుపౌర్ణిమ సదా ఆచరణీయం. స్మరణీయం. మానవాళి గురు ఋణం తీర్చుకునే భాగ్యం. ఇదే మనము ఈ రోజు గురువులందరికిచ్చే మన పాదాభివందనం గురు పౌర్ణిమ రోజు విశిష్టత. తస్మై శ్రీ గురవే నమః
- బిజ్జ నాగభూషణం