చిరునవ్వు, మౌనం
అమృత వాక్కులు
చిరునవ్వు, మౌనం
విషుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, అయ్యప్ప కీర్తన ప్రియుడు. “ఆర్య” “పితా” అనే ఆర్య శబ్దాలకు దేశీయ రూపాలైన పదాలు “అయ్య”. “అప్ప”. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. అయ్యప్ప. అయ్యప్పకు “ధర్మ శాస్త్ర" అనే పేరుంది. శాస్త్ర అంటే గురువు. ధర్మాన్ని రక్షిస్తున్న గురువు కాబట్టి ధర్మశాస్త్ర అనే పేరు వచ్చింది. “శాస్తారం ప్రణమామ్యహం" అంటూ స్వామిని స్తుతించారు. శబరి మలలో 18 వాద్యాలు మోగిస్తారు. 18 మెట్లకు ఇవి ప్రతీకలు.
చిరునవ్వు, మౌనం రెండు మంచి ఆయుధాలు. మనిషికి చిరునవ్వు వల్ల, వచ్చిన సమస్యలు అవలీలగా పరిష్కరించుకోవచ్చు. మౌనం వల్ల అసలు సమస్యలే ఉత్పన్నం కాకుండా చేసుకోవచ్చు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జీవితాంతం సేవచేయాలి. విద్య నిచ్చిన గురువులకు జీవితాంతం విధేయంగా వుండాలి.
క్షమాగుణం మించిన గుణం లేదు. పశ్చాత్తాపాన్ని మించిన నిష్కృతిలేదు.
ఇతరుల విషయంలో అనవసరంగా కలగచేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇతరులలోని లోపాలను వెతికే ప్రయత్నం చేయకూడదు.
నిన్ను నీవు సంస్కరించుకోవాలి. అప్పుడు నీకు జగమంతా సంస్కరించబడినట్టు కనిపిస్తుంది.
ధనం వస్తుంది .... పోతుంది .... నిజాయితీ వస్తుంది పెరుగుతుంది.
అందరికి మేలు చేయాలి. అందరిని ప్రేమించాలి... అందరి మన్ననలను పొందాలి. అందరికీ తలమానికంగా వుండాలి.
ధర్మంతో నడిస్తే దైవస్వరూపుడు ... అధర్మంతో నడిస్తే అసుర స్వరూపుడు.
ఏ కొరివి నిప్పు ఆ కొరివినే కాలుస్తుంది ... అన్నట్లు ఏవరి అసూయాద్వేషాలు వారినే కాలుస్తాయి.
- బిజ్జ నాగభూషణం