Online Puja Services

ఆనందమే పరబ్రహ్మ స్వరూపం

3.142.237.71
అమృత వాక్కులు
 
ఆనందమే పరబ్రహ్మ స్వరూపం 

"శీర్యతే ఇతి శరీర:" అంటే రోజు, రోజుకు క్షీణించి పోయేదే ఈ శరీరం అని. దహ్యతే ఇతి దేహః -దహింప బడేది దేహం.  భగవంతుడు -అంటే ప్రకాశించు వాడు అని అర్థం. దేవుడు అంటే దివ్యమైన శక్తులు కలవాడు అని అర్థం.  శివుడు -శుభమే తానైనవాడు అని అర్థం. శంభుడు -అంటే శుభాలకు ఆధారమైనవాడు. శంకరుడు - అంటే శుభాశుభాలను అందించేవాడు. రుద్రుడు -అంటే రోదనలను పోగొట్టే వాడు. ప్రాణం - అంటే హృదయ గుహలో పురీతత్ అనే నాడీ మండలంలో ఆత్మ నీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై జ్యోతి రూపంగా ఉంటుందంటాయి ఉపనిషత్తులు. పరమాత్మ - అంటే పరమాత్మ తన శరీరంలో ప్రతీ జీవాణువు సమైక్యతతో శుద్ధ చైతన్య సమన్వయంతో ఆనందించే వాడు. భగవంతుడు అంటే మనం నిర్వచనం చెప్పుకోవాలంటే, సత్యం, జ్ఞానం, అనంతం అని నిర్వచనం చెప్పుకోవచ్చు. పైన చెప్పినవన్నీ సూచనార్థం.

సంతోషం తాత్కాలికం. మానవుడికే పరిమితం. మానవుల చంచల స్వభావానికి సంతోషం ఆలంబన.  భగవంతుడు ఆనంద స్వరూపుడు. మానవులకు కలిగే ఆనందమే భగవంతుడి నిర్గుణ స్వరూప ఆనందం. సంతోషం నిత్యజీవితంలో కొద్ది భాగం మాత్రమే. ఆనందం వస్తే తొలగి పోదు. మరింత పెరుగుతుంది. ధనం వస్తుంది పోతుంది. నిజాయితి వస్తుంది. పెరుగుతుంది అనే సామెత సంతోషానికి, ఆనందానికి వర్తిస్తుంది. భగవంతుడి రూపమే ఆనందం. వారి వైభవం ఆనందామృతం.

అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండే వాడు దేవుడు. ఎమీ తెలియక పోయినా అన్నీ తెలిసినట్లుండే వాడు జీవుడు. తెలిసీ తెలియని జీవుడు సంతోషం కోసం ఆరాటపడతారు. శాశ్వతమైన ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తాడు.

సంతోషంతో తృప్తి చెందక భగవంతుడి ఆనంద స్వరూపాన్ని పొందడమే ఆధ్యాత్మికతత్వం, సంతోషం లౌకిక, భౌతిక విషయాల వల్ల లభిస్తుంది. ఆనందం ఆధ్యాత్మిక మార్గానికి మాత్రమే పరిమితం. మనలో ఉన్న అంతర్యామిని లోపలి చూపులతో దర్శించగలిగితే ఆనందం మన వశమవుతుంది. మార్కండేయ మహర్షి చివరకు ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని గ్రహించాడు.

- బిజ్జ నాగభూషణం 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba