దైవం మనలోనే
అమృత వాక్కులు
దైవం మనలోనే
దైవం మనలోనే
విశ్వంలో అన్నిటికన్నా సూక్ష్మమైంది. దైవకణం. అది అణువుకన్నా అణువు. అంటే పరమ అణువు. అదే అనంతం. దానికన్నా బలమైంది ఏదీ లేదు. మనిషి అహంకారిగా ఉన్నంత కాలం ఇతరులకు అనుకూలంగా ఉండలేడు. అందుచేత, అతడు కఠినత్వం నుంచి మృదుస్వభావం వైపు మరలాలి. అప్పుడే హృదయ స్పందనలు వినగలుగుతుంది. ఆ వినడం శ్రవణం స్థాయికి చేరితే ధ్యానం అవుతుంది. అలాంటి ధ్యానంలో ఆలోచనలు ఆగి ఆత్మానందం కలుగుతుంది. అదే సూక్ష్మంలో మోక్షం. ధర్మ శాస్త్రాలూ “సూక్ష్మ ధర్మాల పరమార్థాన్ని చాలా వివరించాయి. వాటిని ఆకళింపు చేసుకొని ఆచరించినవారే ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహిస్తారు”.
వాస్తవమేమిటంటే మన నమ్మకాలు అపనమ్మకాలతో పని లేకుండా, మనం వెదుక్కునే అవసరం కూడా లేకుండా, ఆ అద్భుత, అజ్ఞాత వ్యక్తి మన ప్రక్కనే, మన ఎదురుగానే, ముందు వెనకా, పైనా కిందా, ఉహు-మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే, ఉన్నాడు.
మన అర్హతానర్హతలు ఆయనకు అవసరం లేదు. మన స్థితి గతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరిచిపోయినా అసలు గుర్తించక పోయినా, అయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన వున్నాడు, ఉంటాడు, అంతే.
జీవాత్మలో పరమాత్మ స్వయంభువుగ వుండి, ఆత్మలో జ్యోతిగ వెలిగి తేజస్సయి మన అవయవాలలో మరియు నాడులలో ఆ తేజస్సు ప్రసరించి వాటిలో చైతన్యం కలిగించి చలనం కలుగుతుంది, అదే తేజస్సు శరీరంలోని సూక్ష్మ రంద్రాల ద్వార శక్తి రూపంగా బహిర్గతమై మనిషిలో చలనం కలిగించి మనిషికి ఆ శక్తి అన్ని పనులు చేసేలా పురమాయిస్తుంది. పరమాత్మే మన ఆత్మలో వున్నాడు.
అందుకే “దేహో దేవాలయ ప్రోక్తః, జీవో దేవ సనాతన" అని వుంది ఉపనిషత్తులో. గీతార్థం జీవితార్ధం గా అందించిన శ్రీకృష్ణ పరమాత్మ విశ్వయక భావన జీవులకు అనుసరణీయం.
- బిజ్జ నాగభూషణం