జ్ఞాని
అమృత వాక్కులు
జ్ఞాని
ఎంత హోదాలో ఉన్నా, ధనవంతులైనా నలుగురితో వాత్సల్య పూరితంగా సంభాషించాలి. వ్యక్తిత్వాన్ని బట్టి మనిషికి ఆదరణ గుర్తింపు వస్తాయి.
ప్రతిదినం కొంత సమయం - ప్రార్థన, ధ్యానం, జపం, నిస్వార్థ సేవ, విచక్షణ,
జ్ఞానసాధనకు కేటాయించాలి. ముఖ్యంగా ఇతరుల విషయంలో అనవసర జోక్యం కలగజేసుకొనే ప్రయత్నాలు, ఎదుటివారిలో లోపాలు అన్వేషించే కార్యక్రమాలు కుసంస్కారిని చేసి మనిషిని ధర్మం బాటనుంచి దూరం చేస్తాయి. అందుకే ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నప్పటికి, సహనం వహించి మన్నించే గుణం కలిగి ఉంటే, అతడు నిర్దోషి.
ఈ లోకంలో ప్రతీరోజూ ఎందరో పుడుతూ, చస్తూ వుంటారు. అది చూస్తూ తనకు చావులేదని, రాదని, రాకూడదని అనుకునేవాడు అమాయకుడు, అజ్ఞాని. లోకంలో ఇంతకు మించిన ఆశ్యర్యకరమైనది, వింతైనది మరొకటి లేదని ధర్మరాజు యక్షుడి ప్రశ్నకు జవాబు చెప్పి “భళా" అని పించుకున్నాడు. చావు గురుంచిన బెంగ, భయం తొలగించుకోవటానికి మూడు దారులున్నాయి. తార్కిక, ప్రాణిక, మానసిక శక్తుల ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. మేధోమధనం చేసి చావు బతుకులు బొమ్మ బొరుసు లాంటివని జ్ఞాని తెలుసుకుంటాడు.
వివేకి మనోధైర్యంతో, యోగి ఆత్మబలంతో యదార్థం గ్రహిస్తాడు. చైతన్యం ఒక ఆగని ప్రవాహం. యదార్ధము ఎప్పటికి ఉండేది. మారేది పదార్థము. ప్రకృతి ప్రభావం వల్ల ఈ ప్రపంచం మారుతుంది. కాబట్టి శరీరాలు రాలినా చైతన్యం మనిషికి మరొ జన్మను సరికొత్త జీవితం ప్రసాదిస్తుంది. మరణాన్ని ఒక విరామం గానే చూడాలి. జీవిత రంగంలో నిర్విరామంగా శ్రమిస్తూ మున్ముందుకు సాగాలి. అదే లక్ష్యం. అదే మోక్షం .
- బిజ్జ నాగభూషణం