నేనేమిటి? జీవితం ఏమిటి?
అమృత వాక్కులు
నేనేమిటి? జీవితం ఏమిటి?
ప్రేమతో సేవలందించాలంటే భక్తి అవసరం. అది పెరగాలంటే ముఖ్యమైనది కృతజ్ఞతాభావం. పరిస్థితిని మొత్తంగా చూసే ప్రయత్నం చేసినప్పుడు "నేనేమిటి”, “జీవితం ఏమిటి” అన్న ఆలోచనలు వస్తేనే, ఆ ఉన్నత స్థితికి ఎదిగేందుకు అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. .
మనిషి ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఆలోచించాలని అరబిందో అనేవారు. తలుపులు పునాదిలాంటివి. మన పరిస్థితులు, వ్యక్తిత్వం వాటి పైనే నిర్మితమౌతాయి.
ఓటమి గెలుపునకు బాట అనేవారు ఆధ్యాత్మిక వేత్త జిడ్డు కృష్ణమూర్తి. భాషాపటిమ కన్నా ఉత్తమ భావ పటిమ గొప్పదని భజగోవిందంలో ఆదిశంకరాచార్య చెప్పారు. గొప్పగా ఆలోచించాలి, గొప్ప సాధనలు కొనసాగాలి. నేను అనే అల్పమైన ఆలోచనకన్నా మనం అనే భావన ఔన్నత్యానికి గుర్తు.
మొగ్గగా పుట్టి విచ్చుకొని పరిమళం ప్రసరించే పువ్వులాంటి జీవితం ధన్యమని అంటారు. అలాంటి బతుకుకోసం సాధన చేసేవాడే మాన్యుడు.
మనిషి అభ్యాసంకోసమే ఈ ప్రపంచం. చేయాల్సిన దాన్ని విసుగు లేకుండా సాధన చేయడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. కర్తవ్య నిర్వహణే వ్యక్తిత్వాలను నిర్మిస్తుంది. అదే మనిషికి పరిపూర్ణతను, ముక్తిని ప్రసాదిస్తుంది. కర్తవ్యం అవసరమైన క్రమశిక్షణను, ఒక సమస్థితిని నేర్పుతుంది మనిషికి. “అన్ని జీవుల పట్ల ప్రేమ కలవాడు. నిజాన్ని మాట్లాడేవాడు, సున్నిత మనస్కుడు, ఉన్నతభావాలు కలవాడు, అందరినీ ఆదరించేవాడు, అతిచనువు చూపనివాడు, మంచి మనసు ఉన్నవాడు, ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతాడని, కీర్తి మంతుడవుతాడ'ని విదురుడు స్పష్టం చేశాడు.
పెద్దలు చెప్పినట్లు, సత్సంగం కల్పవృక్షం లాంటిది. ఇది ఐహిక ఆముష్మికాభీష్టాలను సాధించి పెడుతుంది. అయితే వారు చెప్పింది చిత్తశుద్ధితో ఆచరించాలి. మహాత్ములు ఉపదేశించిన మంచి మాటలే అమృత వృష్టి, మనలోని పాపాలన్నింటినీ మటుమాయం చేస్తుంది.
- బిజ్జ నాగభూషణం