Online Puja Services

ఉత్తమ యోగి

18.119.129.162
మన ఆలోచనలు మంచిగా ఉంటే మన పనులు మంచిగా వుంటాయి. మన భావాలు గొప్పగా వుంటే మన ఆచరణ దివ్యంగా వుంటుంది. లోక కళ్యాణం - నరుడి రూపంలో మాత్రమే చెయ్యగలడు. మనిషి భగవంతుడికి ప్రతిరూపం. భగవంతుడిలో వున్నవే మనిషిలో కనిపించాలి. తనలో దైవత్వం వుందని మనిషి తెలుసుకోవాలి. దాన్ని నిరూపించాలి. స్వార్థానికి మించిన అస్వస్థత లేదు. కలిసి వుండటంలో, మంచిని కోరుకోవడంలో మాత్రమే నిజమైన ఏకత్వం ఏర్పడుతుంది. అందరిలోకి నదిలా ప్రవహించి, సముద్రంగా బ్రతికిన వాళ్లే దివ్య పురుషులుగా మిగిలిపోతారు.

అందరూ బావుండాలి అని అందరూ అనరు. కాని అలా అనేవాడు మాత్రం మనిషికాడు, మహనీయుడే. దీనులు, హీనుల దారిలో పూలను చల్లి అక్కున చేర్చుకోలేక పోయినా, ముళ్ళను తొలిగిస్తే చాలు అటువంటి వాడికి మించిన యోగి ఉండడు. ఉత్తమ యోగి అతడే.

ఎదగాలనుకున్న మనిషి మాత్రమే మారతాడు.  మారిన మనిషి ధర్మం వైపు అడుగులు వేస్తాడు. జ్ఞానామృతం పంచే గురువుగా మారి  శాశ్వత కీర్తిని పొందుతాడు.

మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి తప్పకుండా మారాలి ... మార్పు అందరికీ ఆమోదయోగ్యాంగా వుండాలి. అప్పుడే ఆ మనిషి ఆదర్శమూర్తిగా ఈ భూమ్మీద నిలిచిపోతాడు.

పరమాత్మ ఉనికి రెండు విధాలంటారు పండితులు. ఒకటి జగదాత్మకం అయితే మరొకటి జగన్నియామకం. పరమాత్మ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. దీన్ని జగదాత్మకం (నిర్గుణం)అంటారు. సగుణ సాకారరూపమే జగన్నియామకం. దీన్ని శైవులు ఈశ్వరుడని, వైష్ణవులు నారాయణుడని, శాక్తేయులు అంబిక అని, ఇలా ఎవరి ఇచ్ఛానుసారం వారు పిలుస్తారు.

సృష్టి నియతి కోసం జగన్నియామక పరమాత్మ అనేక రూపాలు, అవతారాలు దాల్చాడు. ఇవే విష్ణు దశావతారాలు, ఏకాదశ రుద్ర రూపాలు, అష్టమాతృకలు, ఇంద్ర, స్కంద, వినాయక, హనుమ లాంటి దివ్యావతారాలు. ఈ రూపాలన్నింటిలోను “ఉన్నది ఒకటే పరమాత్మ". వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది.

మహర్షి సందేశం వీరు రాసిన అన్ని పురాణాల లక్ష్యం ఒక్కటే “ఏకమై ప్రకాశించే పరమాత్మ ఉనికిని ప్రతిపాదించటం, భక్తిని ప్రబోధించటం, మానవ ధర్మాన్ని భోదించటం". వేద పురాణ ఇతిహాసాలు మానవాభ్యుదయాన్నే బోధించాయి. వీటి సారాన్ని గ్రహిస్తే, పరమాత్మ సత్య స్వరూపం బోధ పడుతుంది.

- బిజ్జ నాగభూషణం 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba