జీవిత సార్ధకత
అమృత వాక్కులు
జీవిత సార్ధకత
జీవితంలో ఏం కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు. దక్కక పోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కిన దాంట్లోనే ఆనందం వెతుక్కునే వారు మరో రకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం మూడింటిలోనూ ఆనందముంటుందని గ్రహించాలి.
మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ జీవితాలు ఆశ్చర్యాలు, సాహసాలు, చర్య, ప్రతిచర్యల సమాహారమే జీవితం. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించే వారు కొందరైతే, మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించే వారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామనేదే ముఖ్యం. అదే జీవిత సత్యం.
జీవితంలో సఫలీకృతం కాగోరేవారు వివిధ పనులను చేయరు. చేసే పనుల్లో వైవిధ్యం చుపిస్తారంటారు ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస వక్త శివభేరా. రోజు చేసే పని అయినా కాస్త వైవిధ్యం చూపెడితే కొత్తదనం గోచరిస్తుంది. మనిషిలో పనిపట్ల ఆసక్తి సన్నగిల్లదు. ఉత్సాహం ఉరకలేస్తుంది.
యాంత్రిక నిత్యపూజల భక్తి కన్నా, వైవిధ్య భక్తినే భగవంతుడు ఇష్టపడతాడని అన్నాడు. శబరి, పోకల దమ్మక్క వంటివారు నిరూపించారు. వైవిధ్య భరితమైన జీవన విధానమే మానవ జీవిత సార్ధకత అన్నది యదార్థం .
- బిజ్జ నాగభూషణం