అరిషడ్వర్గాలు
అమృత వాక్కులు
అరిషడ్వర్గాలు
ఎన్నో జ్ఞాపకాలు - అన్నీ మినుకు, మినుకు మంటూ దృశ్యాదృశ్యాల భావనా వీచికల్లో మటుమాయమవుతాయి. కొన్ని ఓ మార్మిక ముసుగు ధరించి మెదడు చేతనలో నిక్షేపంగా తిష్ఠ వేస్తాయి. ఉహాలు-అపోహలు, కలిమి-లేమి, ఆరోగ్యం -అనారోగ్యం , జయం ... అపజయం, తేజం-నిస్తేజం - సమస్తం కాలసింధువు గర్భంలో కలిసిపోతాయి. కాలపురుషుడైన మహాదేవుడి ఒడిలో తలదాచు కుంటాయి. శాశ్వతంగా సేద దీరుతాయి.
శరీరమంతా నిండివున్న విషయవాంఛలనే విషాన్ని హరించే వాడు ఆ శ్రీహరే అని తెలియగలరు. ఈ శరీరమనేది విషపు మడుగు. విషయభోగాలనేవి పడగలు. ఆ పడగలు వెదజల్లే కోరికలే విషపూరితమైన అరిషడ్వర్గాలు. నమ్మినవారికి అంతరంగంలోనూ, నమ్మని వారికి అందనంత దూరంలోనూ ఉంటాడు ఆ పరమాత్మ.
మనసు తాననుకున్నది కర్మేంద్రియాల ద్వారా నెరవేరుస్తుంది. పరిపక్వ బుద్ది సుశిక్షిత రౌతులా మనసు గుర్రాన్ని సరైన దిశలో, అనువైన వేగంతో ప్రయాణింపజేసి లక్ష్యాన్ని చేరుస్తుంది. బుద్ది, జ్ఞానాల అనుసంధానాన్ని పుష్పం సువాసనల సమన్వయంతో పోలుస్తారు. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాలకంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే ఆత్మ గొప్పదని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు.
మనసు ఆలోచనా శక్తి, చిత్తం చాంచల్య శక్తి, బుద్ది నిర్ణయాత్మక శక్తి అంటారు విజ్ఞులు. స్వచ్ఛమైన బుద్ధి మనసును ఆధీనంలో వుంచుకొని ఉత్తమోత్తమ కార్యాలవైపు మళ్ళిస్తుంది. బుద్ధి, మనసు శరీరావయవాల సమన్వయం దేహాన్ని మోక్షమార్గం వైపు నడిపిస్తుంది.
శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం అనే తత్వాలు కలిగిన వారిని ఉత్తములుగా పరిగణిస్తారు. అరిషడ్వర్గాలను మనకు అనుకూలమైన హితషడ్వర్గాలుగా మలుచుకోవచ్చు.
ఎప్పుడు ఎవర్ని కించపరచ రాదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ముఖే ముఖే సరస్వతి అని అన్నారు. అందరి ముఖాలలో సరస్వతి నిలయమై వుంటుంది.
- బిజ్జ నాగభూషణం