మంచిని గ్రహించడం
మంచిని గ్రహించడం
1. మంచిని గ్రహించడం మానవ సంస్కారం. ఎదుటివారి హృదయాన్ని గెలవడం బుద్ధ జీవి లక్షణం. రెండు పెదవులు దాటివచ్చే ప్రతి మాటా మనసుల మధ్య బంధాన్ని దృఢతరం చేయాలి. మనిషి శక్తి సామర్థ్యాలు, అవి సాధించిన భౌతిక విజయాలు చరిత్రలో కనిపిస్తాయి. మనిషికి ఆనందం, భౌతిక వస్తువుల ద్వారా లభ్యమవుతుందని ఆరోగ్యం, ఆహారం, సంపద, ఆనందాన్ని ఇవ్వగలవని అనుకుంటున్నాం.
సామాజిక, నైతిక ఆధ్యాత్మిక అంశాలు ఆనందంలో అంతర్ధాతువులుగా నిలిచి విశ్వంలో శాశ్వతం అవుతాయి. మన ఆనందం అందరి ఆనందంతో లంకె వేసుకున్నదన్నమాట వాస్తవం. ఆధ్యాత్మిక జీవనం ద్వారా ఆనంద శిఖరం అధిరోహించవచ్చు. అనుక్షణం తారసిల్లె అనుభవాల్లో కొన్ని భేదాన్ని కలిగించగా, మరికొన్ని మోదాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని కాలం కౌగిలిలో కరిగి అదృశ్యం అవుతాయి.
రసరమ్య అనుభవాల గాఢత దృష్ట్యా అవి ఎప్పుడు తలపునకు వచ్చినా మనసును కవ్విస్తాయి.
-బిజ్జ నాగభూషణం