సృష్టి కర్త
సృష్టి కర్త..
అనగనగా ఒకానొక గ్రామంలో ఒక స్వర్ణకారుడు వున్నాడు. అతను అత్యంత నైపుణ్యంతో బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు. అతడు తన పనిలో ప్రదర్నిస్తున్న కౌశల్యం కారణంగా... అతని ద్వారా తయారైన ఆభరణాలు చాలా సుందరంగా, ఆకర్షణీయంగా వుండేవి. అంచేత ఆ ఊరి చుట్టు ప్రక్కల ఊళ్ళవారంతా కూడా అతని వద్దనే తమ పిల్లల పెళ్ళిళ్ళకు బంగారు ఆభరణాలు చేయించుకునేవారు.
కాగా అతను ఒకనాడు మరింత దీక్షాదక్షుడై, పట్టుదలగా, మిక్కలి శ్రద్ధ కనపరచి ఒక బంగారు ముక్కుపుడకను అత్యంత రమణీయంగా తయారు చేశాడు. అతనికున్న ప్రజ్ఞాపాటవాలను అన్నింటినీ ఉపయోగించి, నిష్ఠగా దానిని చేయడంతో... అది అత్యంత అపురూప వస్తువుగా తయారైంది. అటువంటి డిజైన్ లో ముక్కుపుడకను అక్కడి వారెవ్వరూ కూడా అంతకు మునుపు చూసి ఎరుగరు. అంచేత ఆనోట ఈనోట ఆ వార్త పలు గ్రామాలకు పాకింది. అంచేత ఆ ముక్కుపుడక గొప్పతనం ఏంటో కనులారా చూసి తెలుసుకునేందుకు ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళ నుంచీ జనాలు తండోపతండాలుగా ఈ స్వర్ణకారుడి వద్దకు రాసాగారు.
అలా ఆ స్వర్ణకారుడి వల్ల ఆ ఊరి ఖ్యాతి బాగా పెరగడంతో, అతని ప్రతిభకు తగ్గా సత్కరించాలని ఆ గ్రామ పెద్దలు నిర్ణయించి... ఒక చక్కని రథాన్ని తయారు చేసి... అతనిని దానిపై ఊరంతా ఊరేగించడానికి ఆహ్వానిస్తారు. అప్పుడా స్వర్ణకారుడు కేవలం నేను చేసిన చిన్న ముక్కు పుడకకే మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు కదా... మరి ప్రాణ సంచారానికి అనువుగా ముక్కును తయారుచేసిన భగవంతుడికి ఎలా కృతజ్ఞతలు తెలపాలి?
ఆయన చేసినదాని ముందు నేను చేసినది ఏపాటిది?
అసలు ముక్కు అనునది లేకుంటే ముక్కుపుడకకు ఏం విలువ వుంటుంది?
అని అతను అడిగిన ప్రశ్నలలోని అంతరార్థాన్ని గ్రహించి... అందరూ భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ, సృష్టి కర్త వైభవాన్ని వేనోళ్ళ కీర్తిస్తూ... శ్రద్ధా భక్తులతో మెలగ సాగారు.
అంచేత... సృష్టి కర్త చేత సృష్టింప బడిన ఈ చరాచర సృష్టిలో ప్రతీదీ అపురూపమే...!! ఆయన కౌశలాన్ని, విభూతిని గుర్తిస్తూ... అహం లేకుండా వుండడమే మన కర్తవ్యమైవున్నది.
- చాగంటి కనకయ్య