అసూయ వలన అనర్థాలు
అసూయ వలన అనర్థాలు
అన్ని దుర్గుణాలకు మూలం *అసూయ*. అసూయ అంటే తోటి వ్యక్తి ఆనందంగా, సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేకపోవడమే. అసూయ వల్లనే దుర్యోధనునికి పాండవులంటే గిట్టలేదు. పాండవులు సుఖంగా, సంతోషంగా ఉండటంతో దుర్యోధనునికి అన్నం సహించలేదు. ఈ అసూయే మహాభారత సంగ్రామానికి మూలకారణమైంది. అలజడులు, కక్షలు, కార్పణ్యాలు, కాఠిన్యాలు, కలహాలు జరగడానికి అసూయే కారణం.
అసూయ అనే దుర్గుణం అత్యంత ప్రమాదకరమైందని తెలుస్తోంది. ఎంతో పెద్ద మర్రివృక్షం సైతం క్షణాల్లో మాడిపోయేటట్లు చేయగల శక్తి అగ్నికణానికి, రోజుల్లోనే ఎండిపోయేటట్లు చేయగల శక్తి వేరుపురుగుకు ఉంది. అలాగే అసూయ అనే వేరుపురుగు ఒక మనిషిలో ప్రవేశిస్తే, ఆ వ్యక్తిని సర్వనాశనం చేస్తుంది, దహించి వేస్తుంది. అందుకే అందరూ అసూయ విషయంలో జాగ్రత్త వహించాలి.
ఒకానొక వ్యక్తి ఒక ముసలమ్మను *"అమ్మా, మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదా. అన్నీ దోచుకెళ్ళారు కదా. అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు కారణమేంటి?"* అని ప్రశ్నించాడు. దానికా ముసలమ్మ *"మా ఇంట్లో వస్తువులకంటే మా పక్కింట్లో వారి వస్తువులు ఎక్కువ మొత్తంలో దొంగతనం జరిగిపోయాయి. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది"* అని బదులిచ్చింది.
ఒక ధనికుడు తన ఇంట్లో ఒకసారి అన్నసమారాధన చేయించాడు. అయితే తిన్నవారంతా వాంతులు చేసుకున్నారు. ఏమైందా అని విచారించగా, పులుసు వండిన గిన్నెకు కళాయి లేదని తేలిందట. పాత్రకు కళాయి లేని ఒకే ఒక్క దోషంతో మంచి కందిపప్పు, చింతపండు, తదితర దినుసులు, పదార్థాలన్నీ వ్యర్థమైపోయాయి.
*అలాగే అసూయ అనేది మనిషిలోకి ప్రవేశిస్తే సకల సద్గుణాలను వ్యర్థం చేస్తుంది. అందుకే అసూయ, ద్వేషం, క్రోధం అనే దుర్గుణాలకు దూరంగా ఉండాలి. వాటిని అంటరానివిగా, తాకరానివిగా, ముట్టరానివిగా భావించి బహిష్కరించాలి. అప్పుడే ప్రతి మనిషి పురోగమించగలడు.
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి