ఎదగాలంటే ?- ఒదగాలి .
అమృత వాక్కులు
ఎదగాలంటే ?- ఒదగాలి .
ఎదగడానికి ఓర్పు వుండాలి .ఒర్పంటే నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ ,నిరంతరం అంకిత భావనతో చేసే కృషి .
ఎదగాలనుకునే వానికి సప్త వ్యసనాలకు దూరంగా వుండాలి
1)పరస్త్రీ వ్యామోహం
2)జూదం
3)వేటాడి వన్య మృగాలను సంహరించడం
4)మద్యపానం
5)వాక్పారుష్యం
6)ఉగ్రదండనామ్ ((చేసిన తప్పిదానికి మించిన శిక్ష విధించడం )
7)అర్థ దుర్వినియోగం .
అలానే ఎదుగాలనుకునే వారు నవ గోప్యాలను గోప్యాలుగా వుంచాలి
1)ఆయువు
2)విత్తం
3)ఇంటిగుట్టు
4)మంత్రం
5)ఔషధం
6)సంగమం
7)దానం
8)మానం
9)అవమానం .
ఎదగాలనుకునే వారు వివిధ పనులను చేయరు .చేసే పనిలో వైవిధ్యం చూపిస్తారంటారు ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస వక్త శివ ఖేరా. రోజు చేసే పనిలో అయినా కాస్త వైవిధ్యం చూపెడితే కొత్తదనం గోచరిస్తుంది .మనిషిలో పనిపట్ల ఆసక్తి సన్నగిల్లదు .
ఎదగాలనుకువానికి సహాయం
1)కుటుంబ సభ్యులు ఎదిగే వానికి ఏమి ఆటంకాలు కలగచేయకూడదు .కుటుంబలో ఎన్నో సమస్యలు వుంటాయి ,వాటి నన్నింటిని ఎదగాలనుకునే వాని పైన వేయకుండ ,కుటుంబం లోని ప్రతి ఒక్కరు ఆసమస్యను పరిష్కరించడానికి తోడ్పడాలి . ఇంటిలోవారినందరిని ఎదగదలిచినవాడు ,వారికి నవ్వుతూ ,నవ్విస్తూ ,పొగుడుతూ సంతోషంగా వుంచితే వారే సమస్య పరిష్కారానికి సన్నద్దులవుతారు .ఎదిగేవానికి ఆటంకం వుండదు .
2)ఎదిగే వానికి ప్రజల సహాయం అవసరం అంటే లోకంలో కొందరు ఎదుగుదలను ఓర్వలేక ఎదిగేవానికి నీవు చేస్తున్నది సరిగ్గాలేదని ,అదే కాకుండా లేనిపోని నిందలు మోపి ఎదగాలనుకునే వాన్ని ముందుకు పోకుండా చేస్తారు .అందుకని ఎదగాలనుకునేవాడు "నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు సుమతి "అన్నది అనుసరించాలి .
మనిషి ఎదుగుదలకు వినయం ,అహంకారాలు విశేషంగా ప్రభావితం చేస్తాయి .అహంకారం అంతమొందిస్తే ఎదుగుదలకు అర్హుడవుతాడు .వినయం జ్ఞానం తోడు అవుతుంది .విధేయత వున్న వారికి లోకం జేజేలు కొడుతుంది .వినయ విధేయతలు ఎదగాలనుకునే
వానికి రెండు ఆయుధాలు .కోపతాపాలకు దూరమైతేనే ఎదిగేవానికి ఎదుటివారు సహకరిస్తారు .సత్యం ,ధర్మం తప్పని వానికి ఈ ప్రకృతే ఎదుగుదలకు సహకరిస్తుంది ..ఈ రెండు వున్న హారిశ్చంద్రుడు ,ధర్మరాజు ,కర్ణుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు . "ప్రియం భూయాత్ ,సత్యం భూయాత్ ,న భూయాత్ సత్య మప్రియం " అన్నారు మనువు తన మనుచరిత్రలో .అంటే ప్రియంగా మాట్లాడని ,సత్యం మాట్లాలాడే వారు ఎదుటి వారి హృదయాన్ని జయించి వారి మన్ననలతో ఎదుగుతాడు .
మనిషి ఎదుగుదలకు ఈ క్రమంలో వెళ్ళాలి
1)సంకల్పం
2)ప్రణాళిక
3)క్రమశిక్షణ
4)సమయ పాలన
5)కృషి .
1)సంకల్పం -నేను ఎదగాలని సంకల్పం చేసుకోవాలి .అది మనసులో గట్టిగా నివాసం ఏర్పరచుకోవాలి .
2)ప్రణాళిక -సంకల్పం చేసిన దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి . ప్రణాళిక లేకుంటే సంకల్పం అస్తవ్యస్తం అవుతుంది .
3)క్రమశిక్షణ -ఇదిలేనిదే పని సక్రమంగా జరగదు .
4)సమయపాలన -ఇది ఎంతైనా అవసరం .సమయం నిర్ధేశించుకోవాలి ప్రణాళిక పూర్తవడానికి ,
5)కృషి -కృషి వుంటే మనుషులు ఋషులవుతారు ,మహాపురుషులవుతారు అనే సినిమా పాట కూడా వుంది .కృషి లేనిదే ప్రణాళిక కార్యరూపం దాల్చదు .అందుకని కృషితో సంకల్పం సాధించుకోవాలి .ఎదగదలిచినవారు మంచి ఆలోచనలతో ,పట్టుదలతో కృషి చేయాలి .ఎందరో శాస్త్రవేత్తలు ,నాయకులు అంగవైకల్యాన్ని లెక్కచేయక ఎదిగి అద్భుతాలను సృష్టించారు .జీవన సాఫల్యం పొందారు .
ఎదగదలిచినవానికి కాలం ఒక అవకాశం ఇస్తుంది దాన్ని ఆసర చేసుకొని మనిషి ఉత్తుంగ శిఖరాలను అధిరోహించాలి ,అద్భుతాలను సృష్టించాలి ,ప్రజల మన్ననలు పొందాలి ,మాహాత్ముడు ,మాననీయుడు కావాలి .వారి జీవితం సాఫల్యం చేసుకోవాలి .
ఒక మాట -కర్తవ్యసాధకుడే లోకంలో ప్రయత్నం చేయని వారికి గుణపాఠం నేర్పుతాడు .
- బిజ్జ నాగభూషణం .