మడి అంటే అసలు అర్ధమేంటి?
మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష
మడి అంటే అసలు అర్ధమేంటి?
ఎవరైనా మౌనంగా, ఉలుకుపలుకు లేకుండా ఒంటరిగా కూర్చుని ఉంటే "ఏరా! మడి కట్టుకుని కూర్చున్నావా" అంటారు. మొక్కలు నాటిన తర్వాత వాటి చుట్టు మడి కడతారు, సరిగ్గ నీరు అంది ఎదగడానికి. మడికి అర్ధం తనకు తాను కొన్ని పరిమితులు ఏర్పరుచుకుని, వాటికి బద్ధుడై ఉండటం. మడి చాలావరకు మానసికమే, అందులో బాహ్య అంశాం చాలా తక్కువ.
మనం పూజ మరియు వంట చేసే సమయంలో మడి కట్టుకుంటాము. దైవం తప్ప అన్య విషయాల వైపు మనస్సు పోనివ్వక, పూజా సమయం మొత్తాన్ని దైవం మీద లగ్నం చేయడం మడి ఉద్దేశం. వంట విషయంలో కూడా అంతే. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం మన మనస్సుగా మారుతుంది. మనం ఆహారం సిద్ధం చేసే సమయంలో మరియు తినే సమయంలో ఏ ఆలోచనలు చేస్తామో, ఏ దృశ్యాలు చూస్తామో అవి ఆహారంలోకి ప్రవేశించి, మనస్సుగా మారుతాయి. కనుకా ఆహారం వండే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం సిద్ధం చేసే సమయంలో, వంట చేసేవారు చికాకు, బాధ, కుంగుబాటు, కోపం మొదలైన వాటికి లోనైనా, లేకా అలాంటి మానసిక స్థితిలో వంట చేసినా, అది ఆహారంలోకి ప్రవేశించి, అది భుజించినవారికి ఆశాంతి కలిగుతుంది. అప్పుడు హింసాత్మక ఘటనలు చూస్తే, అవి కూడా తిన్నవారి మనస్సులోకి చేరి, వారు హింసావాదులౌతారు. ఆ ఆహారం విషమవుతుంది. అదే అప్పుడు సద్భావనలు చేస్తే, ఆ ఆహరం అమృతం, అది తిన్నవారికి సద్భావనలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది.
మడిలోని ప్రధాన అంశం కూడా ఇదే. దేన్నీ ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, భగవంతుని ధ్యానిస్తూ వంట చేయడం. మనం ఆస్తీకులం, నాస్తికులం కాదు, పైగా హిందువులము. ఇంట్లో విగ్రహము లేదా పటము (ఫోటో) ఉంటుంది. కానీ అక్కడ ఉన్నది బొమ్మ కాదు అమ్మ అన్న భావన. దైవాన్ని మీ అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, మిత్రుడు.... ఇలా ఏ విధంగానైనా భావన చేసే స్వేచ్ఛ కేవలం హిందూ ధర్మం మాత్రమే ఇచ్చింది. మనం వండే ఆహారం మన ఇంటి ఉన్న అమ్మాయి అయిన అమ్మవారి కోసం అనే భావంతో చేశారనుకోండి... అప్పుడు ఆ సమయంలో ఎంత దివ్య ప్రేమ కలుగుతుంది, ఆ అనుభూతి చెప్పలేనిది. ఆ భావన ఆహారం మీద కూడా పడుతుంది. అదేగాక వంట చేసే సమయంలో చాలామంది గృహిణిలు స్తోత్ర పారాయణ, నామస్మరణ, జపం చేస్తారు. ఇవన్నీ కూడా ఆ ఆహారం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అంతిమంగా మనం ఆ ఆహారాన్ని ప్రేమగా తీసుకెళ్ళి దైవానికి నివేదన చేస్తున్నాము. ఇలా వండిన ఆహారంలో మొత్తం దైవత్వం, దివ్యత్వం నిండి ఉంటుంది. అది తిన్నవారి మనస్సులోకి ఎంత దివ్యత్వం ప్రవేశిస్తుంది ? అలాంటి వాళ్ళు ఏనాడూ తప్పుద్రోవ పట్టరు, ఆపదలు కలగవు, అపమృత్యువు దగ్గరకు రాదు. జీవితాంతం ఆనందంగా ఉంటారు. అందుకే మనం మడి కట్టుకుని వంట చేస్తాము.