భయంకరమైన మాయ
భయంకరమైన మాయ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని, జపతపాలు చేసేవారిని మాత్రమే పట్టుకుంటుంది. వీడు మోక్షానికి వెళ్ళడానికి అర్హుడేనా! వీడు ఎంతవరకు ఇంద్రియనిగ్రహం కలిగి ఉంటాడు అని మాయ వీరి వెంటపడి డబ్బు రూపంలోనో, అమ్మాయిల రూపంలోనూ, మరేదో రూపంలోనో పట్టుకుంటుంది. ఒక్కసారి లొంగి నిగ్రహం కోల్పోతే మోక్షానికి తనంతట తానే తలుపులు మూసుకున్నట్లే.
అందుకే కదా ఇంద్రుడు జపం తపస్సు చేసేవారి మీదకి అప్సరసలని పంపి భ్రష్ఠులని చేశాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఆ మాయ వలలో పడ్డారు.
కనుక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాం. మాకు కలిసి రాలేదు. ఆ దేవుడు మాకు కలిసి రాడు అనకండి. కష్టాలు వచ్చాయి అంటే ఆ దైవం మిమ్మల్ని పరీక్ష చేస్తుందని అర్థం. ఇంతోటి చిన్నచిన్న కష్టాలకే లొంగిపోతే మీరు చేసే పూజలు జపతపాలు ఏమి ఫలితాలని ఇస్తాయి?
తిని తిరిగేవాడిని, నాస్తికుడిని మాయ ఏమి చేయదు అండి. ఎందుకంటే వాడు మాయలో ఉన్నట్లు కూడా గమనించలేడు. ఎందుకంటే వాడు ఎప్పుడూ మాయలోనే ఉంటాడు. అందులో నుండి బయటికి రావాలంటే వాడి తరం కాదు. తాగుబోతుకి ప్రత్యేకంగా తాగుడు నేర్పాల్సినపనిలేదు కదా..
కానీ జపం చేసే వాడికి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవారికి అన్ని పరీక్షలు ఎదురౌతాయి. పడగొట్టాలి కదా. అది దాటి నిలదొక్కుకుంటే మాత్రం వాడంటే గొప్పవ్యక్తి మరొకరు ఉండరు. సాధకులని భగవంతుడు చిన్నిచిన్ని లోభాలు చూపించి ఆశపెడతాడు. కనుక వాటికి లొంగకుండా ముక్తి పొందేవరకు సాధన చేస్తూనే ఉండాలి.