వేదము - శాస్త్రము - ప్రమాణము ఒక అవగాహన .
వేదము - శాస్త్రము - ప్రమాణము ఒక అవగాహన .
సేకరణ
వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్కగుణాలు, లక్షణాలను వివరిస్తుంది. అదీకాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన (chemistry), భౌతిక (physics), గణిత (Mathematics), ఖగోళ (Astronomy), విశ్వోద్భవ (Cosmology) శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలోఅనుసరించవలసిన ధర్మాల గురించి, అనుగమించ వలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. సాయనాచార్యుడి మాటల్లో చెప్పాలంటే సమస్త భౌతిక (Physics), అధిభౌతిక (Meta Physics), ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది.
వేద విఙ్ఞానమును రెండు వర్గాలుగా విభజించవచ్చు. వాటిని శృతులు మరియు స్మృతులు అని అంటారు.
“శ్రుతి” అనగా “వినిపించినది”. అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. “మంత్రద్రష్ట” లైన ఋషులకు అవి “వినిపించినవి”. చతుర్వేదాలు – అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణవేదము – ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని “అపౌరుషేయములు” లేదా “నిత్యములు” అని కూడా అంటారు. ఇవి సనాతన ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, వేదవిభాగాలైన సంహితలు,బ్రాహ్మణాలు,అరణ్యకాలు మరియు వేదాంతాలైన ఉపనిషత్తులు మున్నగునవి శృతుల కిందకి వస్తాయి .
“స్మృతి” అనగా “స్మరించినది” అనగా “గుర్తు ఉంచుకొన్నది”. ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.
స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను, అత్రి, విష్ణు, హరిత, యాజ్ఞవల్క్య, ఉశాన, ఆంగిరస, యమ, ఆపస్తంబ, సంవర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖితా,దక్ష, గౌతమ, శాతాతప, వసిష్ట స్మృతులు (ధర్మశాస్త్రాలు). 20 ధర్మశాస్త్రాలు
ఇతిహాసములు – రామాయణము, మహాభారతము
18 పురాణాలు
ఆగమములు – దేవాలయముల నిర్మాణము, విగ్రహములను చేయుట, ఆలయ ప్రతిష్ట, పూజా విధానములు వంటి విషయములు ఆగమములలో ప్రస్తావించబడినవి. ఇవి రెండు ప్రధాన వర్గములు
శైవాగమములు – 28 కలవందురు.
వైష్ణవాగమములు – పాంచరాత్రము, వైఖానసము
దర్శనములు: దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు – మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్ష స్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇలా జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్విక సమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధతత్వవేత్త లచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనాలు అంటారు. అవి
సాంఖ్యము – కపిల మహర్షి
యోగము- పతంజలి మహర్షి
వైశేషికము – కణాద మహర్షి
న్యాయము – గౌతమ మహర్షి
పూర్వమీమాంస – జైమినీ మహర్షి
ఉత్తరమీమాంస – వీటినే వేదాంత దర్శనం, బ్రహ్మ సూత్రాలు అని అంటారు. మొదటగా వ్యాస మహర్షిచే రచించబడినది.
వేదాలు – ఋగ్వేదము:
వేదామంతా ఒక్కటే అయినా మంత్రపద్దతిని అనుసరించి వేదాలను నాలుగుగా చెప్తారు. అందులో మొదటిది ఋగ్ వేదం. ‘ఋచ్యతే స్తూయతే యయాసాఋక్’ – దేవతలను ఉద్దేశించి చేసే స్తుతులను ఋక్కులు అంటారు. దేవతలు అనగానే అనేకమంది అనుకోకూడదు. ఈశ్వరుడికి అనేక గుణములు, శక్తులు ఉంటాయి. ఆయా గుణాలను అనుసరించి చెప్పినప్పుడు, ఒకే ఈశ్వరుడిని వేర్వేరు దేవతలుగా అభివర్ణిస్తారు. ఈ వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్కగుణాలు, లక్షణాలను వివరిస్తుంది. అదీకాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన (chemistry), భౌతిక (physics), గణిత (Mathematics), ఖగోళ (Astronomy), విశ్వోద్భవ (Cosmology) శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలోఅనుసరించవలసిన ధర్మాల గురించి, అనుగమించ వలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. సాయానచార్యుడి మాటల్లో చెప్పాలంటే సమస్త భౌతిక (Physics), అధిభౌతిక (Meta Physics), ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది. వేదాలన్నిటిలో ఋగ్వేదమే పెద్దది. అందులో 10 మండలాలు, 1025 సూక్తాలు, 10581 ఋక్కులు ఉన్నాయి.
ఒకప్పుడు వేదంలో ఉండే ప్రతి శాఖకు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉండేవి. కానీ భారతదేశం మీద జరిగిన దండయాత్రల్లో అనేకమంది వేదపండితులు చంపబడ్డారు, గ్రంథాలయాలు, వైదిక గ్రంథాలు కాల్చబడ్డాయి. ఆ కారణం చేత ఇప్పుడు మనకు పూర్తి వేదభాగము లభ్యమవ్వడం లేదు. ఋగ్వేదంలో అన్ని మండలాలకు ఇప్పుడు బ్రాహ్మణాలు లభించడం లేదు. ఋగ్వేదానికి సంబంధించి ప్రస్తుతం ఐతరేయ, శాంఖ్యాయన,కౌస్తికీబ్రాహ్మణాలు మాత్రమే లభిస్తున్నాయి.
1008 ఉపనిషత్తులను ఋషులు మనకు అందించగా, ఇప్పుడు కేవలం 108 మాత్రమేలభ్యమవుతున్నాయివాటిలో కేవలం 11 మాత్రమే అందరికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఋగ్వేదానికి సంబంధించి ఐతరేయ ఉపనిషత్తు ఒక్కటే లభిస్తోంది. వైదిక ధర్మంలో యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది. యజ్ఞయాగాదుల్లో నాలుగు వేదాలు తెలిసిన నలుగురు పండితులు పాల్గొంటారు. అందులో ఎవరికి వారికే ప్రత్యేక స్థానం,మర్యాద, గౌరవం ఉన్నాయి. ఋగ్వేదం అధ్యయనం చేసి, యజ్ఞంలో పాల్గొనే ఋగ్వేద పండితుడిని ‘ఋత్విక్కు’ అని అంటారు.
పురుష సూక్తం ఋగ్వేదం లోనిదే!!
వేద విఙ్ఞానం మనకి జ్ఞానాన్ని పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి అని వివరిస్తోంది. అవి ఏమిటో తెలుసుకుందాం. అవి.
1. ప్రత్యక్షం
2. అనుమానం
3. ఆప్తవాక్యం (లేదా శబ్దం లేదా వేదం) మనకు ఎదుట కనిపించే వాటితో మొదలుకొని కనిపించని దాని వైపు అన్వేషణ సాగించడమే మనం చేయగలిగేది.
నేడు మొదటి మార్గమైన “ప్రత్యక్ష ప్రమాణం” గురించి అది ఎంతవరకు ప్రమాణం లాంటి విషయాలు తెలుసుకుందాం
‘ప్రత్యక్షం’ ఎంత వరకు ప్రమాణం?
వాస్తవాన్ని గుర్తించేందుకు మనం చేసే అన్వేషణకు ఒక ప్రమాణం ప్రత్యక్షం. కేవలం జ్ఞానేంద్రియాల ద్వారాజ్ఞానాన్ని పొందడం. మనం జ్ఞానేంద్రియా ల ద్వారా విషయాలనిగుర్తిస్తాం
జ్ఞానేంద్రియాలను సంస్కృతం లో అక్ష అని అంటారు, మనకు జ్ఞానాన్ని ప్రసరింపజేసే జ్ఞానేంద్రియాలను ప్రత్యక్షం అని అంటారు. లేక ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందినదాన్ని కూడా ప్రత్యక్షం అని అంటారు. అంతేకానీ కంటికి కనిపించేదాన్నే ప్రత్యక్షం అని అర్థం కాదు. కొందరు కంటితో చూస్తేనే నమ్ముతాం అని అంటుంటారు. ఒక పుష్పానికి వాసన ఉంటుంది, దాన్ని కంటితో చూడగలమా? ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందాలి తప్ప, కంటితోనే చూడాలని అనుకోం.
జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ఎదురుగా కనిపించిన దృశ్యం, వాసన మొదలైనవన్నింటినీ ప్రత్యక్షం అని అంటారు.
ఉదాహరణకి యుద్దం చేసే వాడిని యోధ అని అంటారు. యుద్దాన్ని ఎవరితోనైతే చేస్తాడో వాడిని ప్రతియోధ అని అంటారు. అట్లానే జ్ఞానేంద్రియాలకుఅభిముఖంగా ఉన్న వస్తువులు,వాసనలు, శబ్దాలు మొదలైన వాటిని కూడా ప్రత్యక్షం అని అంటారు. అంతే కాదు, మనం ఒక వస్తువును చూస్తున్నాం అంటే అది కంటికి ఆ వస్తువుకి మధ్య ఒక ప్రక్రియ జరుగుతుంది , మన జ్ఞానం ఆ వస్తువుదాకా వెళ్ళి దాని ఆకారాన్ని గుర్తించి తిరిగి మనవరకుతీసుకొస్తుంది
ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను కూడా ప్రత్యక్షం అని అంటారు. మనం ఒకరి ద్వారా సమాచారాన్ని ఎవరివరకైనా పంపితే వారిని ప్రతినిధి అని అంటాం, అట్లానే మన జ్ఞానేంద్రియాల వరకు జ్ఞానాన్ని అందించే ప్రక్రియను ప్రత్యక్షం అని అంటారు.
అయితే ఈ పద్దతిలో మనం కేవలం జ్ఞానేంద్రియాలని వాడుతాం.కేవలంజ్ఞానేంద్రియాల ద్వారా మనం మొత్తం జ్ఞానాన్ని పొందగలమా అనేది ప్రశ్నాత్మకం. అందులో కూడా లోపం ఉంది అనేది వాస్తవం. ఒక తాడును చూసి మనం పాము అను అనుకోవచ్చు (దీనినే రజ్జు సర్ప భ్రాంతి [Illusion] అని అంటారు ). ఒక బొమ్మను చూసిమనిషేమో అని అనుకోవచ్చు. మనం ఒక సినిమా చూస్తాం. తెరపైదృశ్యం నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. కానీ వెనకాతల ఒక్కో దృశ్యాన్ని కల్గిన రీలును అతివేగంగా తిప్పుతుంటారు. అది తిరిగే వేగం మన కంటికి అందనంతలా ఉంటుంది కాబట్టి మనకు నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. అంటే మనకంటికి లోపం ఉన్నటే తెలుస్తుంది. అంతే కాదు శబ్దాన్ని గ్రహించే చెవులు అన్నింటిని గ్రహించలేవు. ఒక నాడు 10 పాటలు కల్గి ఉంటే సి.డి లో 100 పాటలు చేర్చుతున్నారు. ఎందుకంటే మనకు వినిపించని ఎన్నో స్వరాలని తీసివేసి ఆపాట మనకు ఎంతవినిపిస్తుందో అంతకు తగ్గిస్తున్నారు కనక ఎక్కువ పాటలని ఒక సి.డిలో వ్రాయగల్గుతున్నారు. అంటే మన చెవులకి లోపం ఉంది అని తెలిస్తుంది.
జ్ఞానేంద్రియాలకు లోపం ఉంది అనే విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా తెలుపుతుంది అనేది స్పష్టం అవుతుంది.
కంటికి కనిపించడంలేదని మనం భగవంతుడు లేడు అని చెప్పడంలేదు, భగవంతుణ్ణి గుర్తించవల్సింది మనస్సుతో. అందుకే మనం మనస్సును శుద్ది చేసుకోవాలి. అప్పుడు మనం భగవంతుడిని స్పష్టంగా దర్శించగలం. మన కంటికి కనిపించేందుకు భగవంతుడు స్వీకరించిన రూపమే విగ్రహం. అయితే అది ఒక అచేతన వస్తువుగా కనిపించవచ్చు, స్పష్టంగా దర్శించాలి అంటే మనం కొంత సాధన చేయవలసి ఉంటుంది.
ఇంతవరకూ మనం వేద విఙ్ఞానానుసారం ఙ్ఞానాన్ని పొందడానికి 3 మార్గాలున్నాయని మరియు మొదటి మార్గమైన ప్రత్యక్ష ప్రమాణం మరియు రెండవ మార్గమైన “అనుమాన” ప్రమాణం గురించి తెలుసుకున్నాము. నేడు మూడవ మరియు చివర మార్గమైన ” ఆప్తవాక్యం” ప్రమాణం గురించి తెలుసుకుందాం.
ఆప్తవాక్యం లేక వేదం – లోపం లేని ప్రమాణం
మనం జ్ఞానాన్ని నేరుగా అంటే ప్రత్యక్షంగా కాక, ఊహించక మరొక పద్దతి ద్వారా గుర్తిస్తాం, దాన్నే ఆప్తవాక్యం అని అంటారు. ఆప్త వాక్యం అంటే మన అప్తుల ద్వారా అందే విషయం. ఆప్తులు అంటే ఎట్లాంటి స్వార్థం లేక మన మంచి కోరి చెప్పేవారు. మనం నేరుగా గుర్తించాల్సిన పని లేదు, ఊహించాల్సిన పనిలేదు, కానీ కొందరు చెప్పిన విషయాలను మనం నమ్ముతాం. వారు చెప్పిన మాటలనే ఆప్త వాక్యం అని అంటారు. మన పూర్వులు మనకు చెబుతారు, వారికి వారి పూర్వులు చెప్పారు, వారికి వారి ముందు వారు, ఇలా మన భారత జాతి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి జ్ఞాన సంపదను మనవరకూ తెచ్చి అందిస్తోంది. మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేకుండా అనుభవించే పిత్రార్జిత ధనం లాంటిది.
ఆప్తవాక్యాన్ని ఎట్లా నమ్మగలం ?
దీనికే మరొక పేరు ‘శబ్దం’. శబ్దం అంటే సహజమైనది అయ్యి ఉండవచ్చు లేక కృత్రిమమైనది అయ్యి ఉండవచ్చు. కృత్రిమ మైన శబ్దాలు మారుతూ ఉంటాయి. మనం తయారు చేసుకున్న భాషలు అన్నీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనం వాడే భాషల్లో కొన్ని పదాల అర్థాలు మనం ఏర్పాటు చేసుకున్నవి కనక అవి మనం మారిస్తే అవి మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉండవచ్చు. ఈ భాషలన్నీ మనం తయారుచేసుకున్నవి. మనం తయారు చేయని కొన్ని సహజమైన శబ్దాలుఉంటాయి, అవి ఎప్పటీకీ ఒకేలా ఉంటాయి. ప్రకృతిలో మనకు వినిపించే గాలి యొక్క శబ్దం, సాగరం యొక్క శబ్దం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. అయితే ఈ సహజ శబ్దాలలో కొన్ని అర్థం కలిగిన శబ్దాలు ఉన్నాయి వాటినే వేదం అని అంటారు. అవి ఎవరో తయారుచేసినవి కావు.
ప్రత్యక్షం, అనుమానం అనే ప్రమాణాలతో వాస్తవాన్ని గుర్తించడం అనేది కష్టం. తప్పులు జరిగే అవకాశం ఎంతో ఉంది. ఇలా మన పూర్వులు ఈ విషయాన్ని గమనించి, కేవలం భాహ్యమైన వాటితో గుర్తించడం సాధ్యం కాదు అని గమనించి, వారు తమ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి లోనివైపు కేంద్రీకరించడంప్రారంభించారు. అట్లా ఎంతోకాలంగా చేసిన ప్రయత్నానికి వారు ఎట్లాంటి లోపాలు లేని ప్రమాణంగా వేద శబ్దాన్ని గుర్తించారు. వేద శబ్దం ‘అపౌరుషేయం’. ఎవరో ఒకరు చెప్పినదో వ్రాసినదో కాదు. వేద శబ్దం అనేవి ప్రకృతిలో ఉండే సహజమైన శబ్దాలు. ఊహకు అందని సృష్టి రహస్యాలు మనకు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. వేదాన్ని మనం లోపం లేని ప్రమాణంగా గుర్తిస్తాం.
అట్లా ప్రత్యక్ష్యం, అనుమానం మరియూ శబ్దం (లేక ఆప్తవాక్యం లేక వేదం) అనే ఈ మూడింటిని మనం ప్రమాణాలుగా తీసుకుంటాం. ఈ మూడు ఎట్లావాడుకోవాలో తెలిపేవారే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అయితే ప్రత్యక్షం, అనుమానం లాంటి ప్రమాణాలలో ఎంత వరకు వీలు అవుతుందో అంతా అంగీకరిస్తాం. వేద మార్గాన్ని పూర్తిగా విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైధికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైధికమో ఏది అవైధికమో తెలిపాయి. అట్లాంటి వాటిని ఆధారంగా తీసుకొని వాస్తవ సందర్శన చేస్తాం.
మనం తయారుచేసిన వాటిలో లోపం ఉండే అవకాశం ఉంది. ఒక వస్తువుని చూసి మరొకటి అని అనిపించే అవకాశం ఉంది, దీన్నే భ్రాంతి అని అంటారు. అట్లా భ్రాంతితో చెప్పేవాటిలో లోపంఉంటుంది. మరొక కారణం, ఉన్నదాన్ని స్పష్టంగా చూడలేక పోతాం, దీనికి పరాక్కు లేదా ప్రమాదం అని అంటారు. మూడోది విప్రలిప్స, ఎదుటివారిని సంతోష పెట్టేందుకు కల్పించి చెప్పేవి. మన పురాణాల్లో కూడా ఈ దోషాలు ఉన్నాయి. ఏదో ఒక వ్యక్తి సంతోషపడుతా డని వ్రాసినవీ ఉన్నాయి. అట్లాంటివి మనకు ప్రమాణాలు కావు. నాలుగోది, మనలో అశక్తి, కొన్నింటిని మనం అనుభవిస్తుంటాం కానీ వ్యక్తపరచలేం.ఎన్నో అనుభవా లని మాటలో తెలుపలేం. అన్నింటిని తెలుపగలిగే వాంఙ్మయం అనేదిలేదు. మనం వ్యక్తం చేసే వైధికమైన శబ్దాలు కూడా వాంగ్మయ రూపంలోనే ఉండడం చేత, వాంఙ్మయ రూపంలో ఉన్న వేదం కూడా భగవత్ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే చెప్పడం నాకూ చేతకాదు అని ఒప్పుకుంది. “ఎతో వాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ ఆనందం బ్రహ్మణో విద్వాన్” అంటుంది తైత్తిరీయం అనే వేద శాఖ. కొంత వరకు చెప్పగలను, కొంత ఊహించు కొనేంతవరకు కల్పన చేసి చెప్పగలను, కానీ పూర్తిగా చెప్పడం నాకూ చేతకాదు అంటుంది. భ్రమ, ప్రమాదం, విప్రలిప్స, అశక్తి అనేది జీవ నిర్మితములైన వాటికి ఉంటాయి కానీ వేదానికి అట్లాంటి దోషాలు ఉండవు. దీన్నే శాస్త్రం అని అంటాం. అంటే మనల్ని శాసించగలదు అని అర్థం. మనం ఇది చేయవచ్చు, ఇది చేయ కూడదు అని కృత్యాకృత్యము లని, ఉన్న వస్తువులేమి, లేని వేమి అని నిరూపించ సామర్థ్యం కలది శాస్త్రం. శాస్త్రం అంటే మనకు కనిపించే సామాన్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, రసాయణ శాస్త్రం ఇలాంటివి కాదు. శాస్త్రం అన్నాం అంటే అది వేదం అని అర్థం
#vedam
Vedam