సమున్నతం సనాతన ధర్మం .
సమున్నతం సనాతన ధర్మం .
- లక్ష్మి రమణ
ఒకసారి రామకృష్ణ మఠం సాధువుల గోష్ఠిలో ఓ స్వామీజీ ‘రేపటి నుంచి ఉపనిషత్తులపై తరగతులు తీసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నారు. ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామి ప్రేమానంద ‘సకల ఉపనిషత్తులకు సజీవభాష్యంగా విరాజిల్లుతున్న మన గురుదేవుడైన రామకృష్ణులు ఉండగా, మరి ఏ ఉపనిషత్తుల గురించి బోధిస్తారు? సకల శాస్ర్తాల సారమే వారి జీవితం’ అని ఉద్ఘాటించారు.
సనాతన ధర్మానికి తల్లి వేర్లు అయిన వేదాలు, ఉపనిషత్తులు ప్రబోధించిన సత్యాలకు పరమహంస ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు.
వాటిని కేవలం శిష్యులకు బోధించటం కాకుండా ఆయన తన జీవితంలో అడుగడుగునా ఆచరించి చూపారు. మనలో నిగూఢంగా ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరింపజేసుకోవడమే మానవ జీవిత లక్ష్యమని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమహంస కూడా మానవజీవిత పరమోన్నత లక్ష్యం భగవంతుడి దర్శనం అని ప్రబోధించారు. స్వయంగా ఆ పరమాత్మను కాళీమాత రూపంలో దర్శించారు. తన ప్రత్యక్ష శిష్యులకు దర్శింపజేశారు. ఆ అనుభూతిని పొందిన వారిలో స్వామి వివేకానంద అగ్రగణ్యులు! అందుకే తమ గురువరేణ్యులను శ్లాఘిస్తూ కాలాంతరంలో ‘వేదవేదాంతాలలో బోధించిన సత్యాలను నా గురుదేవులు తమ జీవితంలో అనుష్ఠించి, సకల శాస్త్రాలకూ సజీవభాష్యమై నిలిచారు. ఆ పరమహంసను అధ్యయనం చేయకుండా వేదాలు, ఉపనిషత్తులు, భాగవతాది పురాణాలను అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.
అన్ని మార్గాలు అనుసరించి:
పరమహంసలో ఉన్న మరో ప్రత్యేకత అన్ని మతాలను ఆమోదించటమే కాదు అనుష్ఠించటం కూడా! హిందూమతంలోని వైష్ణవ తాంత్రిక సాధనల్ని ఆచరించటంతోపాటు ఇతర మతసాధనలు కూడా అనుష్ఠించి, ‘భగవంతుడు ఒక్కడే! ఆయనను చేరుకునే మార్గాలు అనేకం’ అంటూ సర్వమత సమన్వయాన్ని చాటారు. అంతేకాదు ప్రత్యక్షంగా ఆనాడు, పరోక్షంగా ఈనాడు మతాలకు సంబంధం లేకుండా లక్షల మంది ఆయన ఆధ్యాత్మిక ఛత్రంలో సేదతీరుతున్నారు. తమ పారమార్థిక సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అందుకే ఆమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ‘పరమహంసను అర్థం చేసుకుంటే, అన్ని మతాలనూ అర్థం చేసుకున్నట్లే’ అని విస్పష్టం చేశారు.
జీవారాధనే శివారాధన:
ప్రతిజీవీ ఆ భగవంతుడి ప్రతిరూపమే అనే సత్యాన్ని ఏ మతాచార్యుడూ ధిక్కరించలేదు. పరమహంస ఈ సత్యాన్ని తమ జీవితంలో ఎన్నోమార్లు నిరూపించి చూపారు. స్వయంగా తీర్థయాత్రల్ని వాయిదా వేసుకొని, ఆ ఖర్చుతో దీనుల, అభాగ్యుల సేవలో నిమగ్నమయ్యారు. గుర్రపు బండిపై ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, బండి తోలే వ్యక్తి గుర్రాన్ని గట్టిగా కొడితే, తన దేహానికి గాయమైనంతగా చలించిపోయారు. అలా అన్ని ఆత్మల్ని తన ప్రతిరూపాలుగా చూసుకొని మమేకమైన మహనీయుడు ఆయన. ‘ఈ ప్రపంచం భగవన్మందిరం. అందులో ప్రతిజీవీ భగవత్ స్వరూపమని భావించి సేవించాలి. అప్పుడు జీవారాధనే శివారాధన అవుతుంది. ఇతరులను ఔదార్యం, సానుభూతి, ప్రేమతో నిస్వార్థంగా సేవించటం భగవంతుడిని ప్రాప్తించుకోవటానికి దోహదపడుతుంది’ అనేవారు రామకృష్ణులు.
పూర్వవైభవం:
రామకృష్ణ పరమహంస అవతరించేసరికి మత, వర్గ భేదాలతో అభాసుపాలవుతున్న భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రం, ఆయన అసాధారణమైన ఆధ్యాత్మిక బోధనలతో పూర్వవైభవాన్ని సంతరించుకుంది. శ్రీరామకృష్ణులు వేదాలను, సత్యాలను తాను అనుభూతి చెందడమే కాక, ఇతరులతో కూడా ఆ సత్యాలను ఆవిష్కరింపచేయగల ఆధ్యాత్మిక శక్తి సముద్రం. సంచార దేవాలయంగా భాసించిన ఆ జగద్గురువు సకల మతాల సారానికి నిలువెత్తు నిదర్శనం
మనోజ్ఞ , నమస్తే తెలంగాణా సౌజన్యంతో