వివేకానందునికి అమ్మ ఇచ్చిన దర్శన వైభవం
దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దేవతనీ ధ్వంసం చేసినట్టేనా? స్వామీ వివేకానందునికి అమ్మ ఇచ్చిన దర్శన వైభవం .
- లక్ష్మి రమణ
ప్రతి సనాతన అనునూయి ప్రశ్నించుకోవాల్సిన సమయం, సందర్భము ఇది. ఆలయాలలో ఉన్న ఈశ్వరుడి లింగాన్ని, ఆలయాన్ని పగలగొట్టేశారు. అందువల్ల ఆయన ఆ ప్రదేశంలో ఉండకుండా అవుతారా ? భగవంతుణ్ణి ‘పరమాత్మ’ అంటున్నాం . అంటే అన్నింటిలోనూ, సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నవాడని కదా అర్థం. అటువంటి పరమాత్మ దేవాలయం లేకపోతే ఉండకుండా పోతాడా ? అటువంటప్పుడు ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏముంది?
కరెంటు స్విచ్ ఉంది. దానికి కనెక్షన్ ఉన్నంత వరకూ దాన్ని వేసినప్పుడు లైటు వెలుగుతుంది. దాన్ని పీకేస్తే, మళ్ళీ కనెక్షన్ ఇచ్చేంతవరకూ ఆ స్విచ్ పనిచేయదు . కానీ కరెంట్ అలాగే ఉందిగా ! ముట్టుకుంటే, షాక్ కూడా కొడుతుంది . సరిగా వినియోగించుకొనేవాడొచ్చి, ఇంకొక స్విచ్ పెడితే చక్కగా పని కూడా చేస్తుంది . సరిగ్గా భగవంతుని ఆలయాలు కూడా అలాంటివే !!
ఆలయంలో ఒక మూర్తిని నిలిపేటప్పుడు, అక్కడ యోగులైనవారు ద్రష్టలైనవారు వారివారి తపస్సులని ధారపోస్తారు . ఆ శక్తి అక్కడ ఉంటుంది . అటువంటి పరమ శక్తినే మనం తరించడం కోసం ప్రత్యేకంగా గుడి కట్టుకొని ఆరాధిస్తాం . ఆ గుడి పరమాత్మ శక్తికి సంబంధించిన ఉనికిని మనకి తెలియజేడం కోసం ఉద్దేశ్యించినది. అంతే కానీ, ఆయన గుడిలేకపోతే ఉండలేడని కాదు . పంచభూతాలూ తానె అయిన వాడికి, కాలస్వరూపము తానే అయిన వాడికీ వాటినుండీ రక్షణ కల్పించుకొనే గూటి అవసరం ఏముంది?
ప్రత్యేకించి విశేషమైన శక్తి నిలయాలయిన ఆలయాలని ఈ భరతఖండములో శక్తి పీఠములు అంటాము. ఆయా ప్రదేశాలలో శక్తి ఉన్నది , సహజంగా పీఠస్థానంలో ఉన్న (భూమిలోనే ఉన్న ) ప్రక్రుతి శక్తిని గుర్తించి అటువంటి ప్రదేశాలలో ఆలయాలని నిర్మింపజేశారు . అక్కడ ఉపాసన చేయడం వలన సాధకుడు తొందరగా భగవంతుని కృపాని పొందగలరని దర్శనం చేసిన మహా ఋషులు చేసిన గొప్ప సంకల్పం , మన ఆధ్యాత్మిక సంపద ఆ ఆలయాలు . అటువంటి ప్రదేశాలపైన కూడా అనేకసార్లు దండయాత్రలు జరిగాయి . వాటిని నాశనం చేసే యత్నం జరిగింది. అయినా విద్యుత్ ఎప్పటికీ నిలిచి ఉన్నట్టే అక్కడ దైవికమైన శక్తి నిలిచే ఉన్నది . కొలిచిన వారికి కొంగుబంగారమై అనుగ్రహం ఇస్తోంది . సాధకులకు ఆధ్యాత్మిక ఉన్నతికి కారణం అవుతోంది . అందువల్ల కాశ్మీరంలో సరస్వతీదేవి ఆలయం ప్రస్తుతం లేదని బాధ అవసరం లేదు . అక్కడ అమ్మ ఉనికి ఎప్పుడూ సహజంగా ఉంది . తెలుసుకోగలిగితే ఆ శారదా దేవి ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది .
ఆలయానికి కట్టిన గోడలు గుడి కాదు. ఆ లోపల ఉన్న దివ్య చైతన్యం దేవత. చూడండి, మనిషి కూడా అంతే కదా ! అతనిలో చైతన్యం ఉన్నంత వరకూ అతను ఒక మనిషి . ఆ చైతన్యం శరీరాన్ని వదిలేశాక, శవం . అది పనికిరాని కేవల శరీరం . ఆ ప్రాణమనే పరమాత్మ దాన్ని ఉపయోగించుకున్నత వరకే అది నిలయం. అలాగే ఆలయం కూడా ! కాబట్టి నిరాకారుడైన ఆ పరమ చైతన్యానికి ఒక గుడి కట్టి ఆరాధించామంటే, అది మనం తరించడం కోసం కానీ, ఆయనకీ ఇల్లుకట్టి పెట్టడం కాదు . ఆయనకీ ఆ అవసరమే లేదు . బ్రహ్మానందమే ఆయనలో ఒదిగి వుండగా మనం ఏ ఆలయాన్ని ఆయనకీ నిర్మించగలం?
మరి ఆలయాలు ఎందుకు అంటే, ఆ పరమాత్ముని ఒక రూపంలో ధ్యానిస్తే, మనసు ఆయన మీద త్వరగా లగ్నం అవుతుందని . ముందరే మనసనేది ఒక కోతి. దానికి నిలకడ చాలా తక్కువ . ఒక సెకనులో వెయ్యి ఆలోచనలు , లక్ష లంపటాలు తెచ్చి మన దృష్టిని కకావికలం చేయగల గొప్ప ఆల్కెమీ తెలుసు దానికి. అందుకే కదా ‘చిత్తవృత్తి నిరోధం చాలా కష్టం . అలా చేశావా, నీకు భగవంతుని దర్శనం అయినట్టే’ అంటారు పతంజలి మహాత్ములు. అందు వలన పెద్దలు , మహాత్ములు దేవాలయాలు నిర్మించారు . అందులోనూ శక్తిని కలిగిన ప్రదేశాల్లో , మంచి చైతన్య శక్తి, దైవీ శక్తి (పాజిటివ్ ఎనర్జీ) ఉన్న ప్రదేశాల్లో ఆలయాలని నిర్మాణం చేశారు . అవి క్షేత్రాలు . అందుకే క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు విహార యాత్రకి వెళ్లినట్టు ప్రవర్తించకూడదు . దైవ ధ్యానంలో గడపాలి . వీలైనంత ప్రశాంతంగా ఆ చైతన్య శక్తిని అనుభూతి చెందుతూ, పరమాత్మునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి .
గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఒక ప్రవచనంలో, ఆలయాలని ధ్వంసం చేసేస్తున్నారన్న ఆర్తితో స్వామీ వివేకానందులు అమ్మవారిని ప్రార్ధించినప్పుడు, ఆ అమ్మ స్పందనని ఇలా చెబుతారు. వివేకానందులు అలా ఆర్తితో అమ్మని ప్రార్ధించగానే ఆవిడ స్వయంగా పలికింది . ఆలయాన్ని విధ్వంసం చేస్తే, నన్ను విధ్వసం చేయగలరా ? చూడు , నీకు నా ఆలయాన్ని చూపిస్తాను. అని తానున్న ఆలయాన్ని ఆయన దివ్య చక్షువులకి కనపడేలా అనుగ్రహించారు. దివ్యమైన బంగారు మందిరం అది. ఆ మణిద్వీపమే ఆమె కోవెల. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు వివేకానందుల వారు. ఆ తర్వాత తిరిగి ఆవిడే, నాయనా , చూశావా నా కోవెల ఇదీ ! ఇది నా ఇల్లు. ఇక్కడ నుండీ నన్ను తొలగించడం సాధ్యం అయ్యే విషయం కాదు. కాబట్టి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారట !!
ఈ ఉదంతం వింటుంటేనే, అమ్మ కరుణ మనపై జల్లులా వర్షించినట్టు అనిపిస్తే చాలు ! జన్మ సార్థకం అయినట్టే ! కాబట్టి ఈ నేలమీద , ఈ భారత ఖండం మీద ఆర్ష సంస్కృతిని నాశనం చేయాలనుకునేవాడే నాశనం అవుతాడు తప్ప , శుద్ధ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మ ప్రకాశం కాదు . ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆ శారదాదేవి నిలయంలో కూడా స్విచ్ కనెక్షన్ ఇచ్చి అక్కడ అమ్మ అనుగ్రహాన్ని సారూప్యంగా లభించేలా చేయాలని, అలా జరుగుతుందని ఆశిస్తూ సుఖినోభవంతు !!