శ్రీ రమణులు ఉపదేశించిన చక్కని మార్గం
భగవత్ చింతన కలవారికి శ్రీ రమణులు ఉపదేశించిన చక్కని మార్గం .
సేకరణ
”యజ్ఞానాం జప యజ్ఞోస్మి” యజ్ఞములలో జపయజ్ఞం ఉత్తమమైనదని శ్రీ కృష్ణ భగవానుడు ఉపదేశించాడు. ముఖ్యంగా ఈ కలియుగంలో నామ జపమే ముక్తి మార్గమని యోగుల ఉవాచ. నామ జపానికి మొదట మూర్తి అవసరమయినా తదుపరి అభ్యాసంతో ఆ మూర్తి స్వరూపాన్ని మనసులో స్థిరపరచవచ్చు. అప్పుడు నామజపం ఉపాసన అవుతుంది. ఉపాసనే ధ్యానమవు తుంది. కనుక ధర్మ బద్ధమైన జీవనానికి ఉత్తమమైన కర్మలు అవసరం. అటువంటి ఫలాపేక్ష రహిత కర్మకు శుద్ధమైన మనో సంకల్పం చేయాలి. సంకల్పం పవిత్రమయితే సాధన సులభతరమవుతుంది.
త్రికరణ శుద్ధితో చేసే కర్మల వల్ల పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోనేత్రం విప్పారుతుంది. అటువంటి వారు జ్ఞానసిద్ధిని పొంది బ్రహ్మ పథాన్ని తెలుసుకుంటారు. పూజకన్నా జపము, జపము కన్నా ధ్యానము శ్రేష్టమని విజ్ఞులు తెలియజేస్తున్నారు. శరీరంతో చేసేది పూజ. వాక్కుతో చేసేది జపం. ఈ రెంటినీ నియంత్రించేది మనసు. అయితే సగుణో పాసనతోనే నిర్గుణోపాసన సాధ్యం.
సహజంగా సాధకునికి దేవుడు గుడిలోనే ఉన్నాడనే భావన ఉంటుంది. గుడికి దూరంగా ఉన్నప్పుడు మనసు ఆ దైవమూర్తి మీద లగ్నమై తాను గుడిలోనే ఉన్నాడను భావన కలుగుతుంది. సాధన పరిపక్వమైనప్పుడు ఆ మూర్తి తనలోనే ఉన్నాడను కటాక్ష భావం కలుగుతుంది. అందువలననే శ్రీ రామకృష్ణ పరమహంసలాంటి మహాయోగులు అనుక్షణం ధ్యానమగ్నులై ఉండేవారు. వారి అంతరంగం ఒక దేవాలయం. అయితే ఆధ్యాత్మిక జీవనాభిలాషులు, భగవత్ చింతన కలవారికి శ్రీ రమణులు చక్కని మార్గం చూపించారు.
జగత్ ఈశధీయుక్త సేవనమ్|
అష్టమూర్తి భృద్దేవ పూజనమ్||
పంచ భూతములు, సూర్యచంద్రులు, జీవుడు ఈ ఎనిమిది భగవంతుని ప్రతి రూపములు. ఈ ప్రకృతి అష్టమూర్తులతో నిండి ఉంది. భగవంతుని స్వరూపమే నీకు కనబడేదంతా!
ఈ అష్టమూర్తులకు ఆధారం పరమాత్ముడు. ఆయన ఒక్క డే! సాధకునికి అంతిమంగా బోధపడేది బాహ్యాంతరాలలో ఉన్న ది, విశ్వాంతరాళంలో నున్నది ఒకటేనని భావన స్థిరపడి అంతర్ముఖుడై ఆత్మను దర్శిస్తాడని శ్రీ రమణులు తెలియజేసారు. అందుకే ప్రకృతిలోని అష్టమూర్తులను పూజించి సాధనతో అద్వైత జ్ఞానం పొందగలరని మహర్షి ఉపదేశసారం .
#ramanamaharshi
Tags: Ramana Maharshi