Online Puja Services

ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం

18.226.226.164

ఒక్క పది నిమిషాలు ఇవి మర్చిపోయారంటే, ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది . 
- లక్ష్మి రమణ 

నాలికొకటి చెబుతుంటే నొసలు ఇంకొకటి వెక్కిరించిందని వెనకటికి ఒక సామెత! త్రికరణాలు చేసేది ఒక్కటై ఉండకపోతే సమస్యలే మరి ! చెప్పే మాటొకటి చేసే పని ఇంకొకటిగా  ప్రవర్తించే రాజకీయ నాయకులని ఉద్దేశ్యించి తరచుగా వార్తాపత్రికలు ఫలానా నాయకుడు త్రికరణ శుద్దితో ఆ వాగ్దానం చేసుంటే , దాన్ని నిలబెట్టుకోవాలని ప్రజల తరఫున సవాళ్ళు విసురుతుంటాయి . ఇంతకీ అసలు త్రికరణశుద్ధి అంటే ఏమిటి ? 
   

మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌!
మనస్యన్యత్‌ వచస్యన్యత్‌ కర్మణ్యన్యత్‌ దురాత్మనామ్‌!!

మనసు, మాట, చేత ఒక్కటిగా ఉండాలి . మనసులో సంకల్పించినది మాట రూపంలో ప్రకటిస్తూ, దానిని కార్య రూపంలో చేసి చూపే అటువంటి వారు మహాత్ములు. అందుకు విరుద్ధంగా , ఇందాక మనం చెప్పుకున్న సామెతలోలాగా ప్రవర్తించేవారు  దురాత్ములు.  ఈ విధంగా మనసా, వాచా, కర్మణా ఏకత్వం లోపించినవారు అథోయోనులలో జన్మలెత్తాల్సిందేనని శాస్త్రం. 

ధ్యానముకయినా, జపముకయినా మనసు ప్రధానం. అంతదాకా ఎందుకు ఏ పూజ చేసినా దానికి మనసు ఆ కృత్యముపైన, పరమాత్ముని పైన నిలపడం చాలా అవసరం. ధ్యానములో, జపములో ఉపదేశము పొందిన మంత్రమును ఏకాగ్రతతో జపించాలి. ఇక్కడ కూడా మనసును ఆ నామము పైన లగ్నం చేయాలి కదా ! ఆయా సందర్భాలలోను చిత్తశుద్ధి చాలా అవసరం. 

జప,ధ్యాన, పూజాదికములైన ఆధ్యాత్మిక సాధనలకి పరికరాలు మూడు. మనస్సు, వాక్కు, కాయము లేక శరీరము వీటి నే త్రికరణాలు అంటారు. త్రికరణ శుద్ధిగా చేసే కర్మలేవయినా ఉత్తమంగా నిలుస్తాయి. అందుకే శ్రీ రమణ మహర్షి ఇలా అంటారు. 

కాయ వాఙ్మన: కార్యముత్తమమ్‌|
పూజనం జపశ్చింతనం క్రమాత్‌||

శరీరం, వాక్కు ఈ రెండూ మనసుపై ఆధారపడి పనిచేస్తాయి. షోడశోపచారాలను నిర్వర్తించేది శరీరం. స్తోత్ర పారాయణ చేసేది వాక్కు. దేవీ దేవతల బీజాక్షర మంత్రాలను గురువు వద్ద స్వీకరించి చిత్తశుద్ధితో జపించాలి. దీనికి శరీర శుద్ధి, వాక్సుద్ధి రెండూ అవసరం. శరీర శుద్ధి భౌతికమయితే వాక్కు మనస్సు చేత శుద్ధి చేయబడుతుంది. జప సాధనలో వాక్కు మనసుతో ఏకమవ్వాలి.

కాబట్టి పూజ ఎలా చేస్తున్నాం, ఏమేమి అర్పిస్తున్నాం, ఎలా అర్పిస్తున్నాం అనేవి విధి విధాయకంగా , శాస్త్ర యుక్తంగా చేసినా కూడా ఈ త్రికరణాలు శుద్ధిని పాటించకుండా చేస్తే, అన్ని పూజలూ నిరర్థకమే . పూజావిధి తెలియని కుమ్మరిదాసుడు ఆ కలియుగ ప్రత్యెక్షదైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందాడు . ఏ పూజా విధానమూ ఎరుగని భక్త కన్నప్ప తన మనసు నిండిన భక్తి చేత పరమేశ్వరుని ప్రత్యక్షంగా పొందగలిగాడు . పసితనపు అమాయకత్వంతో త్రికరణశుద్ధిగా ఈశ్వరుని అర్చించిన గుడగూచి ఆయనలోనే లీనమయ్యింది . త్రికరణ శుద్ధిగా ఆ రంగనాథుని సేవించిన అమ్మ గోదాదేవి ఆ దేవదేవుని పతిగా పొందే భాగ్యాన్ని పొందింది . ఇటువంటి మహానుభావులు ఎందరో ఎందరో ఎందరెందరో ఆదర్శమూర్తులై , త్రికరణ శుద్ధిగా పూజని చేయమని చెబుతున్నారు .  

కాబట్టి, పూజాగదిలో ఉన్న పది నిమిషాలూ ఫోనునీ , ఆఫీసునీ, ఇతర వ్యాపకాలని మర్చిపోదాం . ఐయిస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టు, మనసుని అటువంటి విష్యవాసనలు ఆ పదినిమిషాలూ కూడా లాగుతూనే ఉంటాయి . అయినా, దానిని నియంత్రించుకొని సరైనదారిలో పెట్టాలి . మన మనసనే పద్మాన్ని ఆపరమాత్ముని పాదపద్మాల వద్ద ఆ స్వామీ నామ స్మరణ మనస్ఫూర్తిగా చేస్తూ, కాయసాయంతో అర్పిద్దాం . త్రికరణ శుద్ధిగా పూజిస్తే, ఆ దేవదేవుని అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది .  శుభం !!

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba