Online Puja Services

పిచ్చుకలు చెప్పిన సాక్ష్యం !

18.116.36.23

పిచ్చుకలు చెప్పిన సాక్ష్యం !
-సేకరణ 

పూర్వము జాజిలి అనే తపస్వి వుండేవాడు. అతను చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. ఎండనక వాననక కదలక మెదలక కూచుని తపస్సు చేశాడు. అతను చెట్టు అనుకొని పక్షులు ఆయన జడలలో గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టడం కూడా ప్రారంభించాయి. గుడ్లు పిల్లలై యెగిరి పొతుండేవి. పిచ్చుకలు తన తలపై గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నా తాను నిశ్చలంగా తపస్సు చేసుకో గలుగుతున్నానని, తనది గొప్ప తపస్సు అనే అహంకారం అతనిలో కలగసాగింది.

ఒకనాడు అతనికి ఇలా ఆకాశవాణి వినిపించింది. "నీవేమో గొప్ప తపస్వినని గర్వపడుతున్నావు. కాశీ పట్నం లో తులాధారుడు అనే సామాన్య వ్యాపారి నీ కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు జ్ఞాన వృద్ధుడు. అతన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు". అని..జాజిలికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన తపశ్శక్తి తో ఆకాశమార్గాన కాశీ పట్నం చేరి తులాధారుడు ఇంటికి బయల్దేరాడు. జాజిలి అంత దూరం లో ఉండగానే తులాధారుడు ఎదురుగా వచ్చి అతనికి స్వాగతం చెప్పి మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. పిచ్చుకలు మీ జడలలో నివాసం ఏర్పరుచు కున్నంత మాత్రాన మీరు ఎంతో గొప్పవాడినని గర్వించి చిత్త వికారాన్ని పొందారు. ఇంత చిన్న సంఘటనకే మీకు చిత్తచాంచల్యం కలిగితే మీరు ఏమి తపస్సు చేసినట్లు? అని అడిగాడు తులాధారుడు.

గర్వము మటుమాయం కాగా జాజిలి నమ్రభావం తో తులాదారునికి నమస్కరించి, “మహాత్మా! సామాన్య సంసారి అయిన మీకు యింతటి తపశ్శక్తి ఎలా కలిగింది? తెలియజేయండి”. అని ప్రార్థించాడు. తులాధారుడు జాజిలికి యిలా జ్ఞానబోధ చేశాడు. “నేను చేసే వృత్తిలో  కేవలం నా కుటుంబ పోషణకు చాలినంత మాత్రమే సంపాదిస్తాను. నేను అమ్మినా కొన్నా తూనికల్లో గానీ, ధరల్లో గానీ మోసం చెయ్యను న్యాయంగా సంపాదిస్తాను. ఎక్కువ లాభాలు తీసుకొను.

అహంకార మమకారాలకు అతీతంగా వుంటూ తామరాకు పైన నీటి బిందువు వలె అసంగుడనై తృప్తి తో ధర్మయుక్తంగానా మనస్సును స్వాధీనం లో వుంచుకొని జీవిస్తున్నాను. ఇదే నా తపస్సు. నేను చేసే సాధనలో మీకు ఏమైనా సందేహముంటే మీ జడల్లో కాపురముంటున్న పిచ్చుకలను అడగండి”. అని అన్నాడు. పిచ్చుకలు “తులాధారుడు చెప్పింది నిజము. గర్వము, మాత్సర్యము వున్న మనసులో హింస వుంటుంది. హింస అంటేనే అధర్మం”. అంటూ యెగిరి పోయాయి.

తులాదారుని ఉపదేశం తో గర్వాన్ని త్యజించి సవినయుడై అతనికి నమస్కరించి నిజమైన తపస్సు ఏదో. నిజమైన యోగి అంటే ఎవరో తెలుసుకొని వెళ్ళిపోయాడు.

"జ్నేయస్సనిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి"

అని గీత బోధిస్తున్నది. ఎవరిలోనైతె ద్వేషము, కాంక్ష వుండదో, ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తాడో అతనే నిజమైన సన్యాసి యోగి అని భగవద్గీత వుద్ఘాటిస్తుంది. కాషాయ వస్త్రాలు ధరించి, జడలు పెంచి అడవుల్లో తపస్సు చేసినంత మాత్రాన యోగి కాలేడు. ఎవరిలో ద్వేషభావము వుండదో, ఎవరు కరుణా పూరిత హృదయులో, ఎవరు మమకార, అహంకారములు లేకుండా వుంటారో సుఖ దుఃఖముల యెడ సమభావంతో మెలుగుదురో, ఎవరు క్షమాగుణ సంపన్నులో వారే నిజమైన యోగులు, సన్యాసులు.

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba