దానం చేయడం ఎందుకు ?
దానం చేయడం ఎందుకు ? చేయకపోతే ఏమవుతుంది ?
-సేకరణ
‘దానం చేయడం వలన అమితమైన ఫలం కలుగుతుంది’ అని ఒక రాజుగారికి చెప్పారు జైమినీ మహర్షి. ఆయన అన్నారు నేను వేదంలో చెప్పినటువంటి కార్యక్రమములు అన్ని చేశాను. యాగాలు చేశాను , యజ్ఞాలు చేశాను , దానాలు చేయడం వలన వాటికన్నా ఎక్కువ ఫలం కలుగుతుందా ? అయినా దానం చేయడం వలన కలిగే పాప పుణ్యాల వలన నాకు మరో జన్మ ఎత్తాల్సి అవసరం కలుగదా ? అని ప్రశ్నించారు . అప్పుడు జైమినీ మహర్షి ఇలా చెప్పారు . ఇవి మనందరమూ కూడా తెలుసుకొని ఆచరించదగిన విశేషాలు .
.జైమినిమహర్షి: దానం వలన స్వర్గము , సుఖము కలుగుతాయి
రాజు: స్వర్గం వస్తే ఏమిటి లాభం?
జైమినిమహర్షి: ఈ సుఖాలే అపరిమితంగా ఉంటాయి స్వర్గంలో.
రాజు: తరువాత ఏమవుతుంది?
జైమినిమహర్షి: తిరిగి ఇక్కడికే మరో జన్మరూపంలో వస్తారు.
రాజు: అలాంటప్పుడు ఎందుకు దానం చెయ్యాలి? పునర్హన్మ బంధనహేతువు కదా! జ్ఞాని అనేవాడు దానం చేయకూడదు కదా! యజ్ఞాలు చేసాను. వేదం చెప్పిన కర్మలు చేసాను. దానం చేయమమే ఎందుకు చేయాలి? నాకర్థంకాలేదు.
జైమినిమహర్షి: రాజా! స్వర్గానికి వెళతావు అని చెప్పాను. స్వర్గం నీకు వద్దంటావు. కానీ నువ్వు మోక్షాన్వేషివి కాదు కదా! మోక్షమార్గంలో బంధనం వద్దనేట్లయితే, స్వర్గంమీద వైరాగ్యంచేత నువ్వుదానం చేయలేదంటే బాగుంది. ఇన్ని కర్మలు చేసినప్పటికీ, ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు కదా ఎవరయినా! దానం చేయని వాడు అదానదోషం వలన వచ్చినటువంటి క్షుబ్బాధతో తీవ్రమైన వ్యధలకు గురవుతాడు. అందువలన దానం చేయటం నీ కర్తవ్యం.
ఈ జీవుడు ఏ జ్ఞానము, ఏ తపస్సు కొరకై జీవుస్తున్నాడో, మోక్షాన్వేషిగా జీవుస్తున్నాడో; ఆ జ్ఞానాన్ని-ఆ జ్ఞానాపేక్షను-కూడా మరిపింపచేయగలిగే వేదన, దానంచేయకపోతే జీవుడికి కలుగుతుంది. కాబట్టి నియత కర్మ. అది చేసితీరాలి. క్షేమంకోసమని దానంచేసితీరాలి. చాలామంది, దనం చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నావని అంటూవుంటారు. దానంచేసినవాడు తన కొసమే దానంచేసు కుంటున్నాడనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికోసమూ ఎవరూ దానంచేయరు. “ఒకరూపాయి ఎవరికో దానంచేసానంటే నాకోసమే చేస్తున్నాను, నా మంచికోసమే చేస్తున్నాను” అనుకోవాలి. ఒకరికిచ్చిన రూపాయి ఖర్చైపోతోంది, అతడివద్ద ఉండనే ఉండదు. పదిరూపాయలు ఉంటేకదా ఒక రూపాయి దానంచేసాం. దాంట్లో గొప్పఏముంది! అందుకని దానం నా కోసమే చేసాననుకోవాలి.అంటే నీకోసమే నువ్వు, నీ క్షేమాన్ని కోరే దానంచేయాలి. దానంచేయకపోతే ఆ జీవుడికి ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత తీవ్రమైన దాహం, ఆకలి, వేదన ఉంటాయి. అతడి ధ్యేయం మరచిపోతాడు. తనదైన ధనం ఏదైతే ఉన్నదో అందులోంచి దానం చెయ్యాలి. అది కర్తవ్యం.
అందుకనే భిక్షాటనము చేసుకునేటటువంటి విప్రుడు వేదం చదువుకునేటప్పుడు, వేదంచదువుకుంటూ మూడు ఇళ్ళల్లోనో, అయిదు ఇళ్ళల్లోనో, లేకపోతే ఎనిమిది ఇళ్ళల్లోనో “భవతీ భిక్షాందేహి” అని అడుగుతాడు. అలా సంపాదించినదాంట్లో మొత్తం నాలుగు భాగాలు చేస్తాడు. ఆశ్రమవాసులు కూడా అంతే! వాళ్ళుకూడా అలా భిక్షచేసి తెచ్చుకునేదే! మొదటిభాగాన్ని గోవుకు పెడతారు. రెండోభాగం, ప్రక్కన ఎవరయినా భిక్షాటనానికి వెళ్ళనివారు ఉంటే వాళ్ళకు పెడతారు. మూడోభాగాన్ని బ్రాహ్మణుడిని వెతుక్కుంటూవెళ్ళి ఆయన కాళ్ళమీదపడి ఆయన తీసుకొనేటట్లుగా ప్రార్థించి ఆయనకు ఆ భిక్షటనాన్నం ఇస్తారు. మిగిలిన నాలుగోభాగాన్ని వాళ్ళు తింటారు. తెలివితక్కువవారా వాళ్ళు? “వాళ్ళే భిక్షాటనంచేసి తెచ్చిన భిక్షను ఇతరులకు పెట్టి – దానంచేసి – మిగిలిన దానిని తాము తింటుంటే, రాజువైఉండి నువ్వు దానం చెయ్యక పోవటం ఏమిటి? అని అడిగాడు రాజును జైమిని మహర్షి.
“ఈ ఐశ్వర్యం నీదని ఎలా అనుకుంటున్నావు? ఈ ఐశ్వర్యమంతా ప్రజలది, దేశానిది. ప్రతీవాడూ ఈ ఐశ్వర్యంనాది అనుకోవటంవలన దానం అనే విషయం పుడుతున్నదక్కడ. ‘ఏదీ కూడా నాది కాదు’ అనుకోవడంచేత, దానంచేసే అహంభావంతోకాకుండా దానం ఇచ్చేస్తాడు. అడిగినవాడిదే ఇది. ‘ఈ పూట నాఇంట్లో ఇంత బియ్యము ఉందంటే, వచ్చి అడిగి భోజనంచేసే అతిథి ఎవరయితే వస్తారో, నా భాగ్యంచేత ఆ అతిథి తన భోజనం తాను చేసాడు. లేకపోతే ఏమయ్యేది? అతడి ధనం నేను దాచుకుని ఉండేవాణ్ణి!’ అని అనుకోవాలి. అలా ఉండాలి దృక్పథం. అంటే, పరధనం నా దగ్గర ఉన్నట్లు భావిస్తే, నాకు అహంకారం కలుగదు. సహజమైన ఈ విభూతితో – ఈ జ్ఞానంలో ఉన్నవారికి వాళ్ళల్లో దానాహంకారం ఉండదు.
ఆర్యధర్మంలో మామూలుగా గృహస్థుడు తన క్షేమంకోరే దానంచేస్తాడు. మోక్షంకోరేవాడు త్యాగంచేస్తాడు. త్యాగంవేరు, దానంవేరు. ఉన్నదాంట్లో ఒకభాగం ఇవ్వటం దానం. ఉన్నదంతా ఇచ్చివేస్తే అది త్యాగం. త్యాగం మోక్షహేతువవుతుంది. దానం పుణ్యహేతువవుతుంది. పుణ్యంవల్ల మోక్షంరాదు. ఈ జీవుడికి పుణ్యమే ఆవశ్యకత. ఎంతవాడైనాసరే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ ఆకలిదప్పులు – అంటే దుఃఖంతో మృత్యువాతపడ్డ తరువాత, అతడు పొందేటటువంటి బాధలు ఏవయితే ఉన్నాయో, అవి అదానదోషంవలనే కలుగుతాయి.
‘అదానదోషాత్ భవేద్దరిద్రః‘, అంటే దానం చేయకపోవటం వలననే దరిద్రుడవుతాడు. మామూలుగా ఈ శ్లోకాన్ని అందరం చదువుతాము. దానం చేయకపోవటంచేత మనుష్యుడు దరిద్రుడవుతున్నాడు. ‘పునరేవ దరిద్రః పునరేవ పాపీ‘. దానం చేయకపోతే దరిద్రుడు అవుతాడు. దారిద్య్రంవలన మళ్ళీ పాపంచేస్తాడు. ఇలా ఉన్నారు మనుష్యులు. అందుకే, ఉన్నవాడు దానం చేసుకోవాలి. దారిద్య్రంలో ఉన్నప్పుడు ఏం దానం చేయగలరు? అందువల్ల దానంచెయ్యాలనిచెప్పి హితబోధలు, హితవాక్యాలు మనకు చాలా ఉన్నాయి.