Online Puja Services

నాలుగు భయాలు - నాలుగు సుడిగుండాలు.

18.219.15.146

నాలుగు భయాలు - నాలుగు సుడిగుండాలు.  
-లక్ష్మీ రమణ .  

బౌద్ధం మంచి ప్రాభవాన్ని చూస్తున్న రోజులవి.  గౌతమ బుద్ధుని ధర్మాచరణలో దేశం తరిస్తున్న సమయమది . గృహస్తులు బౌద్ధ భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఒక గృహస్తుకి సన్యాసాశ్రమాన్ని అనుసరించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదుకదా ! ఇలాంటివారి గురించి బుద్ధుడు ఒక సందర్భంలో ఇలా వివరించారు . 

సన్యాసాశ్రమాన్ని సముద్రంతో పోలుస్తూ , నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి అని బుద్ధుడు అభివర్ణించారు. ఇవి పూర్ణుడవ్వాలనుకునే వాడికి నాలుగు సుడిగుండాలవంటివి . వీటిని అధిగమిస్తేనే , వ్యక్తి పరిపూర్ణుడవుతాడని గౌతముడు బోధించారు . ఆ పరిపూర్ణుని బోధనలు సర్వమానవాళికీ అనుసరణీయాలు . 

అహంకారం:

మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది. ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా వ్యక్తిని వెనక్కి పడదోస్తుంది. ఉదాహరణకి ‘ఇతనా  నాకు చెప్పేవాడు ? లేదా  నాకంటే వయస్సులో చిన్నవాడు. నా కంటే వెనుక వచ్చినవాడు’ అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. 

చాపల్యాలు:

రెండవది నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేసే చందంగా , ఈ చాపల్యం కూడా మనిషిని లాగేస్తుంది. చాపల్యం నుండీ బయటపడడం అంత తేలికకాదు . సన్యాసాశ్రమంలో సంసారంలో ఉన్నప్పటి చాపల్యాలు పనికిరావుకదా ! కానీ సహజమైన మానసిక చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. 

గతం తాలూకు జ్ఞాపకాలు : 

ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ జ్ఞాపకాలుగా మారి మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి. వెంటాడతాయి. మనసుకి నిలకడ లేకుండా వేటాడతాయి . 

కామం:

నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.

వీటిని అధిగమించకుండా, ఆదర్శ మార్గంలో నడవాలనుకునే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి. వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు.  కాబట్టి ఆదిశగా మన సాధనని పరిపూర్ణం చేసుకొనే ప్రయత్నం చేద్దాం .

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba