మేఘసందేశం(ద--ద--ద)

మేఘసందేశం(ద--ద--ద)
వర్షాకాలపు మేఘం ద-ద-ద అంటూ మేఘసందేశం పలుకుతుంది.
దామ్యత - దత్త - దయధ్యం
ఇది చాలా చాలా పురాతన కాలం నాటి సంఘటన.
దేవ దానవ మానవులందరూ కలసి తన వద్దకు రావడాన్ని చూసిన బ్రహ్మదేవుడు మీకు ఏమి కావాలి?” అని అడిగాడు.
దానికి వారందరూ వారి మధ్య సంఘర్షణలను తొలగించుకొని, సుఖశాంతులతో జీవించాలని
దానికి తగిన ఉపాయాన్ని బోధించమని ప్రార్ధించారు.
వారి మాటలు విన్న బ్రహ్మదేవుడు సంతోషించి,
మీ అందరి మనఃస్థితి సమానమైనది కాదు.
భిన్న మానసిక స్థితులవారికి ఒకే సమయంలో బోధించరాదు.
కనుక, ఉచిత సమయంలో ఒక్కొక్కరికి ఉపదేశించి పంపుతాను" అన్నాడు.
కొంతకాలం గడిచింది.
ఒక శుభసమయంలో దేవతల ప్రతినిధులను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో పలకరించారు.
మేఘ గంభీర స్వరంతో "ద" అని ఉచ్ఛరించి, మౌనం వహించాడు.
దేవతలు తమకు బ్రహ్మదేవుడు ‘ద’ అనగా ఇంద్రియ దమము గలవారులకండు (దామ్యత) అని బోధించినాడని తెలుసుకున్నారు.
దేవతలు తమ లోకానికి చేరుకున్నారు.
తమ వారందరికి ఇంద్రియ దమము ప్రాధాన్యాన్ని బోధించి, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ సుఖ శాంతులతో జీవిస్తున్నారు.
కొంతకాలం గడిచింది. దేవతలు వెళ్ళిన తర్వాత మానవ వృద్ధులను చూచి, మేఘ గంభీర స్వరంతో "ద" అని ఉచ్చరించి, మౌనం పాటించాడు.
వారు పితామహుడు ‘ద’ అనగా దత్త - దానం చేయండని ఉపదేశమిచ్చినాడు అని తలంచారు.
మానవులు తమ లోకానికి వెళ్ళి దాన గుణం పాటిస్తూ సుఖశాంతులతో జీవించసాగారు.
ఆవిధంగా దేవతలు, మానవులు వెళ్ళిపోయిన తర్వాత రాక్షసులను చూచి బ్రహ్మ దేవుడు మేఘగర్జన సదృశ గంభీర ధ్వనితో "ద" అని పలికి మౌనం దాల్చాడు.
వారు పితామహుడు ‘ద’ అనగా దయధ్యం- ప్రాణుల యెడ దయగలిగి ఉండమని ఉపదేశించాడు అని భావించారు.
దానవ వృద్ధులు తమ లోకానికి వెళ్ళి దయా గుణ విశిష్టతను తమ వారికి భోదించి, అందరూ దయా గుణమును పాటించి సుఖశాంతులతో జీవిస్తున్నారు.
బ్రహ్మదేవుడు ఉపదేశించిన ‘ద ద ద’ దకార త్రయం
దేవతలకు దామ్యత–ఇంద్రియనిగ్రహంగా
మానవులకు దత్త – దానంగా,
దానవులకు దయధ్యం – దయగా అర్థమయింది.
అప్పటినుండి వర్షాకాలపు మేఘం ద-ద-ద అంటూ బ్రహ్మవాక్కునే పలుకుతుంది.
ఇది దైవ వాక్కు.
ఈ మేఘసందేశం జనులకు ‘దామ్యత-దయ-దయధ్యం’ – అని హితం బోధిస్తుంది.
మానవులకంటే వేరుగా దేవ దానవులు లేరు. వారు మానవులలోనే ఉన్నారు.
కనుక, మనుష్యుల లోనే సమస్త గుణాలు గలిగి
ఇంద్రియనిగ్రహం లేని దేవతలవంటివారిని ఇంద్రియనిగ్రహం కలిగి ఉండమని,
దాన గుణం లేక లోభ గుణం గల మానవులకు దానం చేయండని,
రాక్షస ప్రవృత్తిగల దానవులకు ప్రాణులయందు దయ గలిగి ఉండమని,
వర్షాకాలపు మేఘగర్జన ద-ద-ద అని బ్రహ్మదేవుని ఉపదేశాన్ని మరలా మరల వినిపిస్తోంది.
ఇదే మేఘసందేశం
ఆ బ్రహ్మదేవుని ఉపదేశాన్ని అర్ధం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం.
హర హర మహాదేవ శంభో శంకర
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి