Online Puja Services

ఈ మహాపదార్థాలు రహస్యసాక్షులు

18.219.15.146

ఈ మహాపదార్థాలు రహస్యసాక్షులు 
-లక్ష్మీ రమణ 

పిల్లి కళ్ళుమూసుకొని పాలు త్రాగుతూ , దాన్ని ఎవ్వరూ చూడలేదనుకుంటుంది . కొన్నిసార్లు మానవుని ప్రవ్రుత్తి కూడా ఆ పిల్లిలాగే ఉంటుంది . తననెవరూ చూడలేదనుకొని విహితం కాని పనులకి తెగబడుతూ ఉంటాడు . మనసు సహజమైన ప్రవృత్తే అలాంటిది మరి . కానీ మనం ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగసాక్షులు పద్దెనిమిది ఉంటాయి అంటుంది శాస్త్రం . వీటినే అష్టాదశ మహాపదార్థాలని పిలుస్తారు .  

చివరికి మిగిలేది , మనవెంట వచ్చేది మనం చేసిన ధర్మాధర్మాలు , పాప పుణ్యాలు మాత్రమే. అందుకే వాటికి సాక్షీభూతాలైన  నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి  మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి . నీడలా మన ప్రవర్తనని కనిపెడుతుంటాయి . లెక్కల చిట్టాలు చిత్రగుప్తునికన్నా నిశితంగా పరిశీలించిమరీ రాసేస్తుంటాయి . మూగ సాక్షులై మన వెంటే వస్తాయి. ఈ విష్యం తెలిశాక ఎవరికివారు తస్మాత్ జాగ్రత్త అనుకోనుండా  ఉండలేం కదూ !

మనలోకంలోని న్యాయస్థానాల్లో సశరీరమై వచ్చి ఇవి సాక్ష్యం చెప్పక పోవచ్చును గాక, కానీ పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది. బొందితో స్వర్గానికి వెళ్ళాక కూడా ధర్మరాజు నరకద్వారాన్ని దర్శించక తప్పలేదు . ధర్మాచార వర్తనుడు , స్వయంగా యమధర్మరాజు పుత్రుడు , అసత్యం ఆది ఎరుగని వాడైన ధర్మారాజుకి కూడా, నరకకూపంలోని బాధ అనుభవం కాక తప్పలేదు . కాబట్టి , ఈ మౌనసాక్షుల   గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

ఈ ఎఱుకలేకపోతే, ఎరుకలేకపోతావు , ఎరగలేకపోతావు , అదినేనే , ఇదీనేనే అనే ఈ మౌన సాక్ష్యుల ఏరుకుని గమనించడం సాధ్యంకాని విషయమే . ఇవన్నీ జడ పదార్థాలేననే భ్రమ లోనే ఉండిపోవాల్సి వస్తుంది . 

ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
 
అందుకే మనిషికి మనస్సాక్షి ఒకటుంటుంది . ఈ అంతరాత్మ మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది . కానీ అరిషడ్వర్గాలకూ బానిసయిన మనిషి  అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోవడం ఎన్నో అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .

కొన్ని సార్లు  అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు, పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోలేము .  అంతరాత్మ అనేది మనకి ఈ విధంగా  అనుభవపూర్వకంగా తెలిసివస్తుంది . ఇదేవిధంగా మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
 
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం . నిజానికి అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, మనం చేసే పనిని ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ దారిలో నడిచేందుకు తెగించడు .

 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. శుభం 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba