మౌనధారణ చాలా మంచిదన్న మహాభారతం
మౌనధారణ చాలా మంచిదన్న మహాభారతం .
సేకరణ : లక్ష్మి రమణ
సమయం చూసి మాట్లాడాలి. నోరుంది కదా అని అనవసరంగా అసందర్భంగా మాట్లాడకూడదు . మితభాషి మహా సంతోషి అనే నానుడి అందుకే వచ్చిందేమో మరి !సందర్భం లేకుండా మాట్లాడేవాడిని పండితులు అసందర్భ ప్రేలాపీ అని తిడుతూ ఉంటారు . మౌనంగా ఉండడం వలన భద్రత, శుభం కలుగుతాయని విదురుడు చెప్పినట్టు మహాభారతం చెబుతోంది.
కోకిల వసంతకాలంలో కమ్మగా పాడుతుంది. వర్షాకాలం రాగానే కోయిలపాట వినిపించదు . ఆ స్థానాన్ని కప్పలు ఆక్రమిస్తాయి . అవి బెకబెకమని కర్ణ కఠోరంగా అరుస్థాయి. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండటమే మంచిది.
మనుష్యులకైనా ఇదే సూత్రం వర్తిస్తుందని విదురుడు చెప్పాడు. అంతేకాదు కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో, ఏది చెడో అర్ధంకాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత,రక్షణ, శుభం కలుగుతాయని విజ్ఞులు గమనించాలని తెలిపాడు.
మనం మన కర్మేంద్రియాల ద్వారా మన కర్మలు నిర్వర్తిస్తున్నాం. ఏమీ మాట్లాడకుండా, ఏమీ ఆలోచించకుండా ఉండటం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కూడా కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. దాని చురుకుదనం పెరుగుతుంది.
మౌనం కూడా ఒకరకంగా ధ్యానమే ! కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికి కావలసిన నైపుణ్యం దొరుకుతుంది. ఆలోచనల పట్ల నియంత్రణ సాధించగలుగుతాం. ఒక స్పష్టత ఏర్పడుతుంది. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. పరిణతి కలిగిన ఆలోచలనకు ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మౌనం రాచమార్గమని గ్రహించాలి. మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనధారణ సంస్కారవంతమైన భూషణం. పరిణతి చెందిన మనస్తత్వానికి ఆలోచనాపరిధికి అది నిదర్శనం.
చలించే భావసముదాయం వాచకంగా పెదవులు ద్వారా బహిరంగమౌతుంది. సంభాషణ, లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుందని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన కథ ఇది . నేటి సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది.