అంతః సౌందర్యం ప్రధానం
అంతః సౌందర్యం ప్రధానం....
పూర్వం ఒక ధనికుడు నూతన భవనం నిర్మించాలని అనుకున్నాడు. భవన నిర్మాణం కోసం.. గరుకు తనం లేకుండా, నున్నగా ఉన్న కొన్ని కొయ్య స్తంభాలు తీసుకు రమ్మని తన సేవకులను ఆదేశించాడు.. సేవకులంతా పరమానందయ్య శిష్యుల వంటి వారే.. కాని నమ్మకస్తులు కావున యజమాని వారిని పెట్టుకున్నాడు.
ఇక అసలు విషయానికి వెళ్తే... యజమాని ఆజ్ఞ ప్రకారం సేవకులు ఊరూరా గాలించారు. ఎక్కడ చూసినా.. కొయ్యలు ఒకింత గరుకుగా ఉండటంతో.. అవి పనికిరావని భావించారు. ఈ క్రమంలో టేకు కొయ్యలను కూడా వద్దనుకున్నారు.
ఇలా వెళ్తుండగా.. ఒక ఊరి చివరన ఉన్న అరటి తోటపై సేవకుల దృష్టి పడింది. అక్కడ అరటి బోదెలను చూసి ఎంత నునుపుగా ఉన్నాయో అని అనుకున్నారు... ఏ మాత్రం గరుకుతనం లేని అరటి బోదెలను కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నారు. వీరి అమాయకత్వాన్ని అవతలి వ్యక్తి వాడుకున్నాడు. భారీ ధర చెల్లించి వందలాది అరటి బోదెలను కొనుగోలు చేశారు. వాటన్నింటినీ బండ్లలో వేసుకుని యజమాని ఇంటికి చేరుకున్నారు..
‘అయ్యా! మీరు ఎన్నడూ చూడని నునుపైన, సౌందర్యమైన కొయ్యలను తెచ్చాము. చూడండి’ అని యజమానితో అన్నారు సేవకులు..
అరటి బోదెలను చూసిన యజమాని కోపంతో ఊగిపోయాడు.. ‘ఎంత పని చేశార్రా..! పైపై సౌందర్యం చూసి మోసపోయారు. ఇవి అరటి బోదెలు.. పైకి సౌందర్యంగా కనిపించినా.. వీటిలో సత్తువ ఉండదు. ఇవి గృహ నిర్మాణానికి పనికి రావు. అనవసరంగా డబ్బు తగలేశారు’ అని చీవాట్లు పెట్టి తానే స్వయంగా వెళ్లి మంచి టేకు కొయ్యలను కొనుగోలు చేశాడు..
ప్రాపంచిక విషయాలు కూడా ఇలా సౌందర్యం గానే గోచరిస్తాయి.. కానీ, అవి తాత్కాలికమైనవి అయితే శాశ్వతమైనదే సుందరమైనది...
అందుకే జీవుడు.. శాశ్వతుడైన పరమాత్ముని ఆశ్రయించాలి.. ప్రాపంచిక విషయాల్లో పడితే జీవిత లక్ష్యం సిద్ధించదనే విషయాన్ని గ్రహించాలి..
సర్వేజనా సుఖినోభవంతు..
- పాత మహేష్