Online Puja Services

లలాట లిఖితం

3.142.201.93

లలాట లిఖితం 

బ్రహ్మరాత... తలరాత  అంటూ ఎన్నో  సార్లు  మనమందరం అంటూ ఉంటాం...  దీని  వెనక కధనం విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన మీ  అందరకీ తెలిసినా మరొక్క మారు పునశ్చరణ... 

ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట.. దాని ‘#తలరాత’ ఆ పుర్రె మీద ఇంకా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూహలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చదివాడట.. పొడి పొడి మాటలలో..., 

‘జన్మ ప్రభృతి దారిద్య్రం, 
దశ వర్షాణి బంధనం, 
సముద్ర తీరే మరణం, 
కించిత్ భోగం భవిష్యతి’...

 (పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదేళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది. నారదుడికి ఆశ్చర్యం వేసింది..

 ‘జన్మంతా దరిద్రం, మధ్యలో కారాగార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమిటి..? మా నాన్న గారు పొరబడ్డారా..?’ అనుకొని సరాసరి బ్రహ్మ లోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు. 

‘ఇతగాడు నిష్ఠ దరిద్రుడే., దిక్కులేకుండా మరణించిన మాటా నిజమే,  కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా చేర్చాడంటే, కొద్దిపాటి మహాభాగ్యం లభించినట్టు కాదంటావా?’’ అన్నాడట బ్రహ్మ..!

 బ్రహ్మ రాత పొల్లు పోనిదనీ, దాన్ని ఎవరూ తప్పించుకోలేరనీ భారతీయ సంప్రదాయంలో అనాదిగా  ఓ నమ్మకం..

 ‘యత్ ధాత్రా నిజ పాల పట్ట లిఖితం, 
స్తోకం మహత్ వా ధనం/ తత్ ప్రాప్నోతి మరుస్థ లేపి నితరాం మేరౌ చ న అతోధికమ్’ ...


(విధాత, మనిషి ఫాల తలం మీద ఎంత రాశాడో అంత ధనం, అది కొంచెమైనా, అధికమైనా, ఆ మనిషికి ఎడారిలో ఉన్నా లభిస్తుంది.. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదు) అని చెప్పాడు భర్తృహరి.

మరి అంతా బ్రహ్మ రాతే అయితే ఇక మనిషి కర్మలకీ, ప్రయత్నాలకీ ఏ విలువా లేనట్టేనా? బోలెడంత ఉంది.. ఈ ప్రపంచంలో ప్రతి కర్మకూ దానికి తగిన ఫలం ఉండి తీరుతుంది అని కదా కర్మ సిద్ధాంతం... అంటే పాపానికి ఫలంగా దుఃఖం, పుణ్యానికి ఫలంగా సుఖం అనుభవించాల్సిందే. బ్రహ్మ రాత అంటే ప్రాణి ఈ జన్మలో అనుభవించబోతున్న పూర్వ జన్మ కర్మల ఫల శేషమే.

 దీనినే మరో విధంగా చెప్పుకోవాలంటే, మనిషి కర్మ ఫలాల శేషం ఎప్పటికప్పుడు అతని ఖాతాలో జమ గానో, అప్పుగానో భద్రంగా నిలువ ఉంటుంది. మనిషి పుట్టినదే ఆ నిల్వను వాడుకొనేందుకు, లేదా ఆ ఋణం తీర్చుకొని వెళ్లేందుకు.. 

బ్రహ్మ రాత అంటే ఈ కర్మఫల శేషం తాలూకు పద్దు అని మాత్రమే. ఇది బ్రహ్మ తన ఇచ్చానుసారం రాసేది కాదు.  మనిషి ప్రతి జన్మలో చేసుకొనే పాప పుణ్య కర్మల బాధ్యత అతనిదే.. బ్రహ్మ రాత చెరపలేనిదీ, అనుభవించక తప్పనిదీ, తప్పించు కోటానికి వీలు లేనిదీ అన్న మాటకు అర్థం కర్మ ఫలం అనుభవించక తప్పదు అని మాత్రమే....

పాత మహేష్

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya