Online Puja Services

జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే

18.119.213.36

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya