నిజమైన నారసింహ తత్త్వం ఇదే !

నిజమైన నారసింహ తత్త్వం ఇదే !
-సేకరణ : లక్ష్మి రమణ
నారసింహుడు - పేరులోనే సింహాన్ని గలవాడు . సింహం ఎప్పుడూ వీరత్వానికి , నాయకత్వానికి , దైవత్వానికి ప్రతీక . ఆ కథలోని రాక్షసుడు హిరణ్యకశిపుడు. ఆయన అవినీతికి ప్రతీక. హిరణ్యం అంటే హితమైనది, రమ్యమైనది, బంగారం అని అర్థాలున్నాయి . కశిప అంటే అన్నం (భోజనం , తినేది ), పరుపు అని కూడా అర్థం ఉంది. దీన్నిబట్టి హిరణ్యకశిపుడు అంటే బంగారాన్ని మింగేవాడు. భోగలాలసుడు, పరమ లోభి అని అర్థం.
ప్రపంచంలోని హిరణ్యమంతా తనకే కావాలని దేవతల రాజ్యాల్ని కూడా ఆక్రమించి వారి సంపదను దోచినవాడు హిరణ్యకశిపుడు. అక్రమంగా దాచుకున్న సొమ్మును బయటకు తీయడమే నరసింహ తత్వం.
రాక్షసులు , దేవతలు అన్నదమ్ములు . కశ్యప మునికున్న ఇద్దరు భార్యల్లో ఒకరి సంతానం దేవతలు, మరొకరి సంతానం అసురులు. అంటే, మంచి, చెడూ రెండూ ప్రజాపతి సంతానమే, రెండూ సృష్టిలో భాగమే అని అర్థం. సృష్టిలో సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలున్నాయి . ఈ మూడు గుణాల కలయిక వల్లే సృష్టిలో మంచి, చెడు, చేతనం, జడం అన్నీ ఏర్పడ్డాయి. గీతలో చెప్పిన దైవీ సంపత్తు, ఆసురీ సంపత్తు అనేవి చూస్తే దేవతలు, అసురులు మనమే అని కచ్చితంగా తెలుస్తుంది. శాస్త్రంతో సంస్కరింపబడిన ఆలోచనల్నే దేవతలు అన్నారు. అలా సంస్కరింపబడని దుర్మార్గ భావాల్నే అసురులన్నారు. దీన్నే కొంత జనరంజకంగా చెప్పడం కోసం ఒక కథ. అసురులు విజృంభించడం, దేవుడు వారితో తీవ్ర యుద్ధం చేయడం, ఆ కథలో కొంత నాటకీయత, ప్రతీకాత్మకమైన సందేశం, వీటన్నింటినీ చూస్తాం. ఇంతకీ మన హిరణ్యకశిపుడు కశ్యప ముని రెండో భార్య అయిన దితి కొడుకు.
అసురులు కూడా తపస్సు చేస్తారు. చేసినవాళ్లు ఎందరో మనకి పురాణాల్లో దర్శనమిస్తారు . నిజానికి ఇతరుల కంటే మరీ ఘోరంగా తపస్సు చేస్తారు. హిరణ్యకశిపుడు ఒంటికాలి బొటనవేలిపై నిలబడి కొన్ని వేల ఏళ్లు తపస్సు చేశాడట. ఈనాటి శాస్త్రజ్ఞులు తీవ్ర పరిశోధన చేసి అణుశక్తిని ఆవిష్కరించడం ఒక తపస్సు లాంటిదే. ఆ శక్తి ఒక సాత్వికమైన వ్యక్తి చేతిలో ఉంటే ప్రపంచానికి ఉపయోగపడుతుంది. రాజస, తామస వ్యక్తులు దాన్ని ప్రపంచ ఆధిపత్యానికో, వినాశనానికో వాడితే అది అసురశక్తి అవుతుంది. తపస్సు చేసినప్పుడు ఫలితం లభించడం ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మాన్నే మనం బ్రహ్మ లేదా సృష్టికర్త అన్నాం. అందుకే బ్రహ్మదేవుడు ఈ అసురులకు వరాలిస్తాడు. ఈ వరాలతో రెచ్చిపోయి ప్రపంచాన్ని బాధించడం అసుర లక్షణం. ఇదే హిరణ్యకశిపుడు చేశాడు.
ప్రత్యక్షమైన బ్రహ్మతో , హిరణ్యకశిపుడు చావులేకుండా వరం కావాలన్నాడు . అది తప్పదన్న బ్రహ్మతో, చావు తనని సమీపించేందుకు ,ఎంతో తెలివిగా ,ఎన్నెన్నో షరుతులు పెట్టాడు . దేవతల వల్ల గాని, రాక్షసుల వల్ల గాని, సృష్టిలో ఎన్నిరకాల జీవులు ఉంటే వాటిలో దేనిచేతా సంహరింపబడకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. ఇలా ముందే న్యాయవాదిని కలిసిన బూటకపు సాక్షిలా , నిపుణులతో సంప్రదించినట్లు ఎన్నెన్నో లొసుగుల్ని, వెసులుబాట్లను కనుక్కున్నాడు.
అయినా సృష్టిలో ఒక సూత్రం ఉంది. ఏదైనా మితిమీరితే దాన్ని అదుపులోకి తెప్పించడమే. అది అధికార మదం కావచ్చు, ధన మదం కావచ్చు, జాతి మదం కావచ్చు. అది ఏదైనా దానికి ఒక విరుగుడు ఉంటుంది. ఆ విరుగుడు పేరు విష్ణువు. సృష్టి, స్థితి, లయ అనే మూడు అంశాల్లో స్థితి, అనగా ప్రజలు సుఖశాంతులతో ఉండటం చాలా ముఖ్యం. విష్ణువు ఈ శాంతిభద్రతల విభాగం లాంటివాడు. ఎవడైనా అదుపు తప్పితే అదుపులోకి తేవడం అతని పని. అందుకే మాటిమాటికీ ఏదో ఒక అవతార రూపంలో వస్తూంటాడు.
సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల్లో ఏ ఒక్కటి మితిమీరినా సమతౌల్యం చెడుతుంది. ఎక్కువ మంచితనమున్నా అది నశించడం మనం చరిత్రలో చూస్తాం. ధర్మానికి తీవ్రమైన గ్లాని కలిగినపుడు ఏదో ఒక దైవీశక్తి ప్రజల్ని రక్షిస్తుంది. ఆ దైవీశక్తినే మనం అవతారం అన్నాం.
అనేక వరాల్ని పొందిన హిరణ్యకశిపుడు దేవతలందరి సంపదనూ లాక్కున్నాడట. భోగలాలసుడిగా ఉంటూ మత్తెక్కిన కన్నుల్ని గిరగిరా తిప్పుతుండగా దేవతలు ముడుపులు చేతిలో పట్టుకుని నిలబడేవారట. ఇదివరకు దేవేంద్రుణ్ణి పొగిడిన నారదుడు, తుంబురుడు, గంధర్వులు అందరూ హిరణ్యకశిపుణ్ణి పొగిడారట. అప్సరసలు అతడి ముందు నృత్యాలు చేసేవారట. అధికారంలో ఉన్న చెడ్డవాళ్లని మంచివాళ్లు పొగడడం సహజమే కదా అని వర్ణించారు ఆ సందర్భంలో. ఈ స్థితిలో దేవతలందరూ విష్ణువును ప్రార్థించారు. ప్రజలందరి సామూహిక వేదన, సామూహిక ప్రార్థన ఫలితంగా వచ్చే ఒకానొక రూపమే అవతారం. సామూహికంగా మనం మన పాలకులను ఎన్నుకున్నట్లు. మళ్లీ వీరు హిరణ్యకశిపులైతే వీరిని కాదని మరొకరిని ఎన్నుకుంటాం.
హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు తండ్రి కన్నా పూర్తిగా భిన్నమైన ప్రవృత్తి కలవాడు. హ్లాదం అంటే ఆనందం. ప్ర అనేది కలిపి ప్రహ్లాదుడు అంటే మిక్కిలి ఆనందం కలవాడని అర్థం. అన్నింటికన్నా ఎక్కువ ఆనందం భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ఆనందం. తన తండ్రి అనుభవిస్తున్న అన్ని భోగాలూ, అన్ని ఆనందాలూ అతనికి చాలా తుచ్ఛంగా కనిపిస్తాయి. అట్టి ఆనందాన్ని గూర్చి నారదుడు ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగానే అతనికి చెప్పాడట. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లినప్పుడు నారదుడికి ఈ అవకాశం దొరికింది. వివేకం వల్ల కల్గిన వైరాగ్యం, దానివల్ల కల్గిన జ్ఞానం ప్రహ్లాదుడికి అమితమైన ఆనందాన్ని ఇవ్వగా.. కేవలం బాహ్య వస్తువుల వల్ల కలిగే ఆనందం హిరణ్యకశిపుడిది. అందుకే ఈ రెండు ప్రవృత్తులకూ సహజమైన వైరం. దీన్నే కొంత నాటకీయత జోడించి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చిత్రహింసలకు గురిచేయడం మొదలైనవన్నీ వర్ణించారు.
ప్రహ్లాదుడి మరొక లక్షణం అభయం. భగవంతుడ్ని తెలుసుకున్నవాడు దేనికీ భయపడడు. అన్నింటినీ భగవంతుడిగానే చూస్తాడు. అతడ్ని హింసించేవారిని కూడా విష్ణు స్వరూపంగానే చూశాడు. దేవతలనందరినీ జయించిన హిరణ్యకశిపుడికి మాత్రం భయం, క్రోధం ఉన్నాయి. నేను, ఇతరులు అనే భేద దృష్టి భయాన్ని కలిగిస్తుందని ఉపనిషత్తు వాక్యం. ప్రతి చోటా శత్రువుని చూసేవాడికే భయం, క్రోధం ఉంటాయి. ప్రహ్లాదుడి గురువుల్ని కూడా విష్ణువు యొక్క గూఢచారులని ఆరోపించాడు హిరణ్యకశిపుడు. చివరకు నరసింహ రూపంలో ఉన్న భగవంతుడు హిరణ్యకశిపుడి షరతులన్నింటినీ తప్పించుకుని అతడ్ని సంహరించడమనేది కేవలం ఒక ప్రతీకాత్మకమైన సందేశం మాత్రమే.