Online Puja Services

ఎంతవారలైనా శిక్ష అనుభవించాల్సిందే!

18.216.219.130

ఎంతవారలైనా శిక్ష అనుభవించాల్సిందే!
సేకరణ 

కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. ‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు. కనీసం వీరినైనా వదిలిపెట్టాలని అనిపించలేదా? వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా? వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే! అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది.’’ అంటూ ప్రశ్నించింది.

శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘వారు చేసిన పాపం ఏమిటి’ రెట్టించింది రుక్మిణీ మాత . ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు.‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు. పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే, ఇంతటి ఉద్దండులూ , ధర్మ నిరతులూ కూడా నాశనమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని కాస్త ఆగారు కృష్ణ పరమాత్మ. 

వెంటనే , మరో ప్రశ్న సంధించింది రుక్మిణీ దేవి . “గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా కర్ణుడు . పైగా , ఆయన సహజ కవచకుండలాలు కూడా లేదనకుండా దానం చేశాడు .  ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా!” కడుపులో నుండీ ఆక్రోశం తన్నుకొచ్చింది ఆ మాతృదేవికి .  ‘నిజమే రుక్మిణీ! కానీ , యుద్ధరంగంలో యోధాను యోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. కానీ, దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు కూడా అభిమన్యుడి దాహం తీర్చలేదు.

ఆ తరవాత కర్ణుడి రథం, అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో రుక్మిణీ ! ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. ఆ కర్మకి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే !  ఇదే కర్మ సిద్ధాంతం. అందుకే మనం చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి’’ అని రుక్మిణీ దేవికి విపులంగా సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్మ.  

కాబట్టు మనం కూడా ఏదైనా పని చేసేప్పుడు కాస్త ముందూ వెనుకా ఆలోచించి ఆచరించడం మనచిదని గుర్తు పెట్టుకోవాలి . 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha