ఉత్తమ పురుష గురించి ఏమైనా చెప్పారా ?
ఉత్తమ ఇల్లాలి గురించి చాలా చెప్తారుగా ! మరి ఉత్తమ పురుష గురించి ఏమైనా చెప్పారా ?
ఇళ్లాలంటే అలా ఉండాలి . ఇలా ఉండాలి అని మన శాస్త్రాలు ఎన్నో విషయాలు చెబుతాయి . మరి అలాగే ఉత్తమమైన పురుషుడు ఎలా ఉండాలి ? ఉత్తమమైన భర్త ఎలా ఉండాలి అనే వివరాలు ఏవైనా చెప్పారా అసలు ? అని బాగా కోపం తెచ్చుకోకండి . అలాంటి వివరాలని అందించాలనే ఉద్దేశ్యంతోటె, ఈరోజు మీముందుకొచ్చాం . మరింక చదవండి .
ఉత్తమ ఇల్లాలికి ఉండవలసి లక్షణాలను ‘కార్యేషు దాసీ , కరణేషు మంత్రి,అని శ్లోకంగా చెప్పినట్లే, ఉత్తమ పురుషులకు ఉండవలసిన లక్షణాలను ‘కామందక’ శతక శ్లోకంలో వివరించారు . అందులో ఇల్లాలిని ‘రూపేచ లక్ష్మీ’ అని పోలిస్తే, ఈ శతకంలో భర్తను ‘రూపేచ కృష్ణ:’ అని అభివర్ణించడాన్ని బట్టి శ్రీకృష్ణుని మోహనరూపం అని అవగతమవుతుంది.
‘కార్యేషు దక్షః కరణేషు యోగీన
రూపేచ కృష్ణః క్షమయాత రామే
భోజ్యేషు తృప్తః సుఖ దుఃఖ మిత్రమ్
షట్కర్మయుక్తాః కుల ప్రాణనాథః’
ఇలాంటి లక్షణాలున్న వాడినే భర్తగా ప్రతి ఆడపిల్లకూడా కోరుకుంటుంది కదా ! అందుకే ఆ లక్షణాలని ఇలా వర్ణించారు . ఇక ,ఈ లక్షణాలన్నీ కూడా పోతపోసినవాడే కృష్ణుడు. అందుకనే కదా ! రేపల్లెకి రేపల్లె ఆ కృష్ణుణ్ణి భర్తగా కోరుకుంది . అసలు కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించే వాడని అర్థం. అందుకే ఆయన ముగ్ధమోహన రూపాన్ని
‘మధురం మధురం అధరం మధురం
అధరము సోకిన వేణువు మధురం
నామం మధురం రూపం మధురం
పిలుపే మధురం తలపే మధరం
నీవే మధుర’ అని ఎంతగానో కీర్తిస్తారు మధుర భక్తి తత్పరులు.
జన్మిస్తూనే తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు నిజరూప సందర్శన భాగ్యాన్ని కలిగించిన మోహనాకారుడు కృష్ణుడు . కృష్ణభక్తుల నుంచి ‘కృష్ణవైరుల’ దాకా ఆయన రసరమ్య రూపాన్ని పొదవి పట్టాలని ప్రయత్నించినవారే. ఆయనను చేరాలని, ఆయన కావాలని కోరడం అంటే వారి జీవనంలోకి కృష్ణతత్వాన్ని ఆహ్వానించడంగానే భావించాలి.
పూతన జీవితాపహరణం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు సంఘటనలను పరిశీలిస్తే అనేక కోణాలు అవిష్కృతమవుతాయి. శిశుప్రాయం నుంచి అడుగడున గండాలెదురైనా ఎదిరీది నిలిచాడు. కష్టసుఖాలు, సుఖదు:ఖాలు, ఎగుడుదిగుడులు జీవనంలో భాగమంటూ, వాటిని ఎలా అధిగమించాలి. ఎలా ఆనందమయం చేసుకోవాలో చాటిచెప్పిన చైతన్యమూర్తి. అందువల్లే రూపేషు కృష్ణ: అన్న భావాన్ని, అర్థాన్ని బాగా గుర్తు పేట్టుకోండి అమ్మాయిలూ !