Online Puja Services

కర్మ ఫలం

18.217.208.220

పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళు ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు.

ఒక రోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా." అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు! ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది. 

శివుడు మళ్ళి నవ్వి దేవి! నీ కోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు. అన్నాడు. అయినా వినలేదు. పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక దేవి! నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు. అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి. భోళా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది. హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ వజ్రపు రాయిని చూసే సరికి మతి పోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మేలిగాయి. అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటికి గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు, చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు. నేను తాగాలి జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డువచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పోదిగాడు.

చూశావా! పార్వతీ! ఏమి జరిగిందో! ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో! ఎన్ని ప్రాణాలను బలిగొందో!

ఆపేదవాడు పూర్వం బ్రాహ్మణ వశంలో జన్మించి భార్యని పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈజన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. 

ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మనదగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి. 

పేదవాడు,మంచివాడు అనేది ఉండదు. గతజన్మలో భార్య
బిడ్డలని చంపాడు. భార్య గయ్యాళి అయింది. కొడుకు
వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను.

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda