Online Puja Services

మురళీ గాన రసాస్వాదం

3.16.75.156

సలలిత రాగ సుధారస సారం- మురళీ గాన రసాస్వాదం
-లక్ష్మీ రమణ

కళ స్వయం ప్రకాశం. దానికున్న ఆకర్షణా శక్తి అమోఘం. కళా సరస్వతి సమ్మోహనాస్త్రాలైన అటువంటి ఎందరో కళామూర్తులు ఈ గడ్డ పై జన్మించారు. కీర్తి శిఖరాలను అధిరోహించారు.  అటువంటి  అజరామర చరితుల్లో డాక్టర్  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఒకరు .  

త్యాగరాజే మళ్ళీ పుట్టారో , ముత్తుస్వామి ఆవహించారో , శ్యామశాస్త్రి దీవించారో తెలీదుగానీ , ఆయన కర్ణాటకా సంగీత సంప్రదాయంలో మకుటంలేని చక్రవర్తిగా వెలుగొందారు  . వెండితెరపై నారదుడై విరాజిల్లిన బాలుడు , సరికొత్త  రాగాలకి ప్రాణం పోసి, తెరపై తాను  పోషించిన పాత్రకి  నిజజీవితంలో న్యాయం చేశారు . ఆ సంగీత కళానిధికి ముద్దుబిడ్డననిపించారు . సంగీత రసఝరి , వ్యక్తిత్వ మాధురీ కలగలిసిన కళాసరస్వతి శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ .  ‘మంగళం పల్లి వారు ’ అని ఇంటిపేరుతో అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ అపర తుంబురుని సంగీత ప్రస్తానం గురించి మాట్లాడుకోవడం అంటే, సంగీత సాగరాన్ని చిలికి , స్వరామృతాన్ని ఆస్వాదించడమే .  

గురుపరంపర :

స్వయంగా త్యాగరాజ స్వామితో మొదలై, సుసర్ల దక్షిణామూర్తి, పారుపల్లి రామకృష్ణయ్య వరకూ కొనసాగిన గురుపరంపరాదత్త సంగీత సంప్రదాయానికి వారసులు మురళీ  కృష్ణ  . ఎనిమిదేళ్ల చిన్నారిగా , లేతప్రాయంలోనే  తానం, పల్లవితో పూర్తిస్థాయి కచేరి చేసి, సంగీతజ్ఞులను మంత్రముగ్ధులను చేశారు .  ఆ తర్వాత వర్ణాలు, కృతులు, జావళీలు, తిల్లానాలు, కీర్తనలను తనదైన శైలిలో రాగసంపన్నం చేశారు. 15 ఏళ్లకే అపూర్వగానయోగిగా పేరొందారు .   16 ఏళ్ల వయసులో 72 మేళకర్త రాగాల్లో కృతులు రాసిన ప్రతిభాశీలి. ఎల్లలు లేని సృజన, సాహితీ పిపాస రెండూ కలిసి బాలమురళిని ప్రత్యేకంగా నిలిపాయి. సుసంపన్న సంప్రదాయ కర్ణాటక సంగీత స్ఫూర్తిని పదిలంగా కాపాడుతూనే సరికొత్త రాగాలకు వూపిరులూదారు.

సంప్రదాయ గాన లహరి :

జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు....అందరికీ వందనములంటూ సంగీత సరస్వతిని ‘శ్రీ’రాగంలో త్యాగరాజ పంచరత్నాలంకృతం చేసి...,

మదనకదన కుతూహలుడు రమ్మనే బిరాన...బిరాన..బిరాన రావే...అంటూ ‘కదనకుతూహలం’లో తనదైన ‘నాట్య’ఝరిని ప్రవహింపచేసి...,

‘మము బ్రోవమని చెప్పు నారీ శిరోమణి...జనకుని కూతుర జననీ జానకమ్మా’ అంటూ ‘కల్యాణి’ రాగంలో రామదాసు భక్తి రసార్ద్రతను జాలువార్చి...,

‘బ్రహ్మ కడిగిన పాదము...బ్రహ్మము తానెనీ పాదమూ’ అంటూ కలియుగ దైవానికి అన్నమయ్య గానాభిషేకం చేసి..,

‘ఏమి సేతురా లింగా...’ అంటూ సదాశివ బ్రహ్మేంద్ర తత్వంతో నిర్వేదాన్ని ఒలికించి...జీవన సత్యాన్ని పలికించినా , ఆ స్వరంలో రాగం , తానం  , పల్లవి అలవోకగా ఒదిగిపోయేవి . భావం రాగరంజితమై , స్వరరాగగంగాఝరిలో నిలువెల్లా తడిసి, తన్మయాన్ని పొందడం శ్రోతల వంతయ్యేది . అటువంటి  అమరస్వరం బాలమురళిది.

ఇటువంటివి ఎన్నని యెన్నగలం . ఆ పుంభావసరస్వతి చేసిన 25 వేల  పైచిలుకు కచేరీలలో , ఏ పదం ఆ నోటా పలికి వాణీ వీణా అంతరంగమై , సుస్వర సంగీతమై రవళించిందో ఎలా వర్ణించడం . రసగంగలో తానాలు చేయడమే కానీ , అందులోని నీటి బిందువులని లెక్కించగలవారెవ్వరు . అంతటి ప్రత్యేకతే ఈ మురళీ గానం .

చిత్రసీమలో ‘మురళీ’ గాన రవళి :

సినీ సంగీతంలోనూ తనదైన సంతకం చేశారు బాలమురళి . చిత్రసీమలో  గానగంధర్వుడని పేరొందిన బాలసుబ్రహ్మణ్యం ఎన్నోసార్లు, సంప్రదాయ సంగీత గీతాలాపన విషయంలో  , బాలమురళిగారి సలహాలు తీసుకున్నట్టు పలు సందర్భాలలో చెప్పుకున్నారు . నవరసాలనూ తన గళంలో స్వరపేటికలుగా మలుచుకున్నారేమో మంగళంపల్లి , చిత్రసీమలో స్వయంగా అటువంటి గీతాలని అజరామరమైన తన గళంలో ఒలికించారు .

  ‘సలలిత రాగ సుధారస సారం...సర్వకళామయ నాట్యవిలాసం’ అన్న కళాభినివేశం.. ‘మౌనమె నీభాష ఓ మూగ మనసా’ అంటూ ఎదను కదలించిన విషాదం…

‘నీవూ నేనూ వలచితిమి...నందనమే ఎదురుగా చూచితిమి’ అంటూ ప్రేమావేశం,

‘సిరిసిరి లాలి..చిన్నారి లాలి..నోముల పంటకు నూరేళ్లలాలీ’ అన్న మాతృ హృదయ మమకారం , ఇలా  సినీసంగీతంలో రంగరించిన నవరస గుళికలన్నీ...ఆ సంగీత గంధర్వుడి స్వర మధురాలే .

జుగల్‌బందీ’...,

‘జుగల్‌బందీ’లకూ బాలమురళీకృష్ణ పెట్టింది పేరు. ఉత్తరాది సంగీత స్రష్టలైన భీమ్‌సేన్‌ జోషి, పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, గానవిదుషీమణి కిశోరీ అమోన్‌కర్‌, తదితరులతో ఆయన జుగల్‌ బందీలు నిర్వహించారు. అమెరికా, కెనడా, యుకే, ఫ్రాన్స్‌, రష్యా, మలేసియా, శ్రీలంక, సిగపూర్‌, ఇలా....ఎన్నెన్నో దేశాల్లో ఆయన చేసిన సంగీత కచేరీలు భారతీయ సంగీత విశిష్టతకు మారుపేరైనాయి.

అభినయ దర్పణం:

రంగస్థలంపైన..., రేడియోలోనూ..త్యాగయ్య, అన్నమయ్య...క్షేత్రయ్య వంటి పాత్రలను సమర్ధంగా పోషించారు బాలమురళీ కృష్ణ. వెండితెరమీద  ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడిగా అద్భుత అభినయాన్ని ..గానకౌశలాన్ని చూపారు. ప్రేక్షకుల మెప్పు మెండుగా లభించడంతో ఆయనకు అదే పాత్ర పోషించే అవకాశం పదేపదే వచ్చింది. అయితే, అందుకాయన పెద్దగా సుముఖత చూపలేదు .  ‘‘నారదుడికి హీరోయిన్‌ ఉండదు. కాబట్టి నేనిక ఆ పాత్రను వేయను సుమా!’ అని సరదాగా చెప్పినా తన అనంగీకారాన్ని అప్పటి నిర్మాతలు, దర్శకులకు మృదువుగా తెలియజేసేవారు .

బహుముఖ ప్రజ్ఞాశాలి :

 గాత్ర సంగీతంలో తనకి తానే  సాటనిపించుకున్నరు  బాలమురళీకృష్ణ.  నడిచే సంగీత నిఘంటువుగా (డిక్షనరీ గా) ఆయన్ని సంగీతకారులు అభివర్ణిస్తుంటారు . గాత్రంతో పాటు  వీణ, వయోలిన్‌, మృదంగం, కంజీర తదితర  వాయిద్యాల్లో కూడా మంగళంపల్లి ప్రజ్ఞాశాలిగా భాసిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం , కంచి పీఠాలకు ఆయన ఆయాస్థాన విద్వాంసునిగా ఉన్నారు . ఇంతటి ప్రతిభా మూర్తి అయినప్పటికీ , సాధారణ వస్త్రధారణతో , నిగర్వంగా , నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా మెలిగేవారు .  

శంకరగుప్తం పై మమకారం :

తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930 జులై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఏడేళ్ల వయస్సులోనే కచేరీకి వేదికనెక్కి బాలమేధావిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నతనంలో ఆయనకు నామకరణం కూడా జరగలేదు. ఆయన జన్మించిన 15వరోజు తల్లి కన్నుమూశారు. మగపిల్లవాడు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నారు. అందరూ అలానే పిలిచారు. ఓ వేదికపై హరికథ భాగవతులు బాలమురళీకృష్ణ అని పేర్కొనడంతో ఆ పేరు స్థిరపడింది. గ్రామస్థులు తన పేరు మీదుగా శంకరగుప్తంలో ఏర్పాటుచేసిన సంగీత కళాద్వారాన్ని 2009లో ఆయన ఆవిష్కరించి 79వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ‘అమ్మా.. పుట్టగానే మురళీగానమిచ్చి..’ అంటూ రాగాలాపన చేసి కన్నతల్లి, కన్నవూరిపై ప్రేమను చాటారు.

నివాసం :

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరొందినప్పటికీ చెన్నైలోనే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నారు. రాయపేటలోని మ్యూజిక్‌ అకాడమీ పక్క వీధిలో స్వగృహం ఉంది. సంగీతాచార్యునిగా కూడా సేవలందించి ఎందరికో శిక్షణ ఇచ్చారు. సంగీతంలో ఎవరికి ఏ సందేహం వచ్చినా తీర్చగల ‘సంచార సంగీత విజ్ఞాన సర్వస్వం’గా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఉన్న ఇల్లు కూడా ఓ సంగీత క్షేత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. చెన్నైలో ఏటా జరిగే సంగీతోత్సవాల్లో బాలమురళీ తప్పకుండా పాల్గొనేవారు. ఆయన సంగీత కచేరీలంటే కళాభిమానులకు, కళాపోషకులకు మాత్రమే కాకుండా.. ఇతర కళాకారులు కూడా చెవి కోసుకునేవారు. హిందుస్థానీ సంగీత విద్వాంసులతో జుగల్బందీలు చేశారు. సంగీతానికి సంబంధించి పలు అంశాలపై ప్రసంగాలు కూడా చేశారు.

రాగసృజన :

పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులు  బాలమురళి తల్లిదండ్రులు  . బొడ్డుతాడు బంధాన్ని పదిహేను రోజులకే తెంపేసుకుని వెళ్లిపోయిన అమ్మప్రేమను, గోరుముద్దలను, లాలిపాటలనూ ఎరుగని ఆయన, తనకు జన్మనిచ్చిన తన తల్లి  పేరుతో ఆ తర్వాత ‘సూర్యకాంతి’ అనే  అపూర్వ రాగాన్ని సృజించారు. ‘విడువ విడువనింక...’ అనే అన్నమాచార్య కీర్తనకు ‘సూర్యకాంతి’ని అద్దారు. వేనవేల గొంతుకల్లో తన తల్లి రాగమై పలికేలా అజరామరం చేశారు.

అంతటితో ఆయన రాగసృజన ఆగలేదు. ‘సుముఖం’, ‘మహతి’, ‘చంద్రిక’, ‘పుష్కరగోదావరి’, ‘రోహిణి’, ‘మోహనాంగి’, ‘గురుప్రియ’, ‘లవంగి’ వంటి సుమధుర రాగాలను సృష్టించారు. వాడుకలో లేకుండా పోయిన ‘నర్తకి’, ‘సునాదవినోదిని’ రాగాలకు తిరిగి వూపిరులూదారు. కొత్త తాళపద్ధతులను సృష్టించారు. ముఖ్యంగా ఆభేరి రాగంలోని ‘ నగుమోము గనలేని’...త్యాగరాజ కృతిని ఆయన ఆద్యంతం ఆర్ద్రత ఉట్టిపడేలా పాడతారని సంగీతజ్ఞులు పలువురు పేర్కొంటారు.

విశ్వవేదికపై సంగీత స్రష్ట :

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పాతికవేలకు పైగా కచేరీలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన గాయకుడు, సంగీతస్రష్ట, వాద్యకారుడు, నటుడు, స్వరకర్త, సాహితీవేత్త, సంగీతదర్శకుడు...ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు మూర్తిమంతమైన మహానుభావుడు. భావగీతాలకూ ఆయన పెట్టిందిపేరు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, తమిళ, మలయాళభాషల్లో ఎన్నో అద్భుతగీతాలను అందించారు. వయోలిన్‌, వీణ, వయోలా, మృదంగ వాదనలో ఆయన నిష్ణాతులు. ముఖ్యంగా వయోలాలో ఆయన ఎక్కడా శిక్షణ పొందకుండానే అద్భుత నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారని ఆయన సన్నిహితులు, శిష్యులు, అభిమానులు చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలతో బాలమురళి ఒకరకంగా విశ్వరూపాన్ని ప్రదర్శించారనే చెప్పవచ్చు.

ఫ్రెంచ్‌ భాషకు ‘మురళీ’ రవళి

ఎన్నో ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్‌లో కచేరి ఇవ్వడానికి వెళ్లిన ఆయనకు ఫ్రాన్స్‌కు చెందిన ఓ వయోలిన్‌ విద్వాంసుడు ఫ్రెంచ్‌ పాటను చెప్పి...దానిని ఆలపించి చూపాలంటూ బాలమురళిని అడిగారు. ఓ రకంగా చెప్పాలంటే సవాలు విసిరారు. బాలమురళి ఆ పాటను తీసుకుని...స్వరాలు రాసుకుని అరగంట సాధన చేశారంతే. ఆ తర్వాత వయోలిన్‌ సహకారంతో ఆ పాటను అద్భుతంగా ఆలపించారు. మంత్రముగ్ధులైన శ్రోతలంతా ఒక్కసారిగా లేచి నిలుచుని కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని ప్రకటించారు. సవాలు విసిరిన ఫ్రాన్స్‌ దేశస్తుడు తన వయోలిన్‌ను బాలమురళికి కానుకగా అందించారు. ఆతర్వాత ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ పురస్కారమైన ‘షెవాలియర్‌ అవార్డు’తో ఫ్రాన్స్‌ ఆయనను సత్కరించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి కర్ణాటక సంగీత విద్వాంసుడు ఆయనే.

రవీంద్రునికి ‘గీతాంజలి’

ఒకప్పుడాయన మద్రాసు దూరదర్శన్‌లో డాక్టర్‌. సరస్వతి బృందంతో కలిసి కొన్ని బెంగాలీ గీతాలను అద్భుతంగా పాడారు. కోల్‌కతా దూరదర్శన్‌ ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం బెంగాలీలను పరమానందభరితులను చేసింది. బాలమురళికి భారీగా బెంగాలీ అభిమానులను పెంచింది. చివరకు కోల్‌కతా దూరదర్శన్‌ వారు ఆయనతో విశ్వకవి రవీంద్రుని గీతాలను పాడించింది. ఆయన ఏకంగా 28 రవీంద్ర గీతాలను పాడారు. రవీంద్ర సంగీతంలో నిష్ణాతురాలైన నాటి విదుషీమణి సుచిత్రా మిత్రా కూడా ఆయనతో గళం కలిపారు.

కళానిధి కిరీటంలో  కలికి తురాయి :

సంగీత కళానిధి, గానకౌస్తుభ, గానకళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గానపద్మం, నాదజ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్‌, జ్ఞానసాగర ఇవన్నీ ఆయనను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలే.

నిర్యాణం :

 గోదారి తీరాన పుట్టిన ఆ సంగీత బ్రహ్మ.. తన స్వరధారతో పుడమి తల్లిని పులకింపజేశారు. అనంత గానామృతంతో అఖండ జనావళికి సొంపైన సంగీత  రసానుభూతిని కల్పించిన వైణికుడు ఆయన. సంగీతానికి పెద్ద దిక్కై , కర్ణాటక స్వర సాహిత్యంలో మకుటం లేని మారాజుగా,  బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 86 ఏళ్ళ వయసులో నవంబర్ 22-2016న  చెన్నైలో వాయులీనమయ్యారు .

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore