Online Puja Services

ద్వారం వెంకట స్వామి నాయుడు

18.227.0.57

దృశ్యం కంటికి తెలియదు. కానీ, హృదయపు కన్ను అన్నీ చూడగలదు  - ద్వారం వెంకట స్వామి నాయుడు 
-లక్ష్మీ రమణ 

దీపావళి తారాజువ్వలు నింగికెగసే వెళ ఒక నక్షత్రం భువికి దిగివచ్చింది. కర్ణాటక సంగీత జగత్తులో ఒక కొత్త ద్వారం తెరుచుకోంది. విధి వింత నాటకం లో ఆ తార తన  చూపును కోల్పోయినా .. వాయులీనం తో దిగంతాల నందుకొనే నాదాన్ని సృజియించింది. కళా రత్నమై , భారతీయ కీర్తి పతాకని సరిగమల సాక్షిగా- ప్రపంచ వినువీధుల్లో సగర్వంగా ఎగరేసింది. ఆ కళారత్నమే  శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడు .   
 
ద్వారం వెంకట స్వామి నాయుడు వయొలిన్ వాద్య కచేరీలకు ఆద్యుడు .కర్నాటక సంగీతాన్ని వయొలిన్ పై పలికించవచ్చునని నిరూపించింది నాయుడే  నంటారు సంగీత కారులు. ఆయన కుటుంబ నేపధ్యమంతా .. సంగీతంతో అనుసంధానమై ఉండడం విశేషం.  వెంకటస్వామి నాయుడు తండ్రి వెంకటరాయుడు  , అన్నగారు వెంకట కృష్ణయ్య  కూడా ... వాయులీన విద్వాంసులే ! ఏ గూటి  చిలక ఆ పలుకే పలుకుతుందంటారు కదా ! అలా ... నాయుడుకి  వయొలిన్ తో అనుబంధం  పుట్టుకతోనే వచ్చ్చింది

 అది  1893వ సంవత్సరం ,  బెంగళురులో దీపావళి పర్వదినాన జన్మించారు వెంకట స్వామి నాయుడు.  సుమారు 10 ఏళ్ళ వయసులో ఒకరోజు బడిలో ... నల్ల బల్లపైన రాసిన అక్షరాలు అలుక్కు పోయినట్లు కనిపించసాగాయి  నాయుడికి . పలకపై అక్షరం ముక్క రాయని నాయుడిని "గుడ్డి వాడి కి చదువెట్లా అబ్బుతుంది" అంటూ పరుషమైన పదాలతో దూషించి, బడినుండి వెళ్ళగొట్టారు పంతులుగారు ! నాయుడు కళ్ళలో చూపు లేక పోయినా... పంతులుగారి ప్రవర్తనకి కళ్ళనిండా నీళ్ళు నింపుకొని బడి నుండి బయటకి వెళ్ళిపోయారు. కానీ ... పంతులుగారి ఈ పరుష ప్రవర్తనే ఆ తర్వాత నాయుడు కి ఆశీర్వచనం అయ్యింది . వాయులీన కళా నిధిని కర్ణాటకా సంగీత జగత్తుకి అందించింది . 
 
కంట కన్నీరొలుకుతూ ... ఇంటికి చేరిన నాయుడు అన్నగారి ఫిడేలందుకొని ... తన అంతరంగాన్ని వాయులీనం చేయడం ప్రారంభించారు. ఎక్కడి నుండో ... ఒక ఆర్ద్రమైన,  సంగీతపు తెమ్మెర ...సుతిమెత్తగా ... వాయులీన తరంగమై హృదయాన్ని తాకుతుంటే ... ఆగలేకపోయారు అన్నగారు . ఎవరా సంగీత తరంగమని ఆరా తీస్తే ... తన తమ్ముడు సాక్షాత్కరించాడు . అరె వీడెప్పుడు సంగీతం నేర్చుకొన్నాడు అని విస్తుపోయాడాయన. సందేహం లేదు ! తన తమ్ముడు తప్పి బుట్టిన తుంబురుడేనని నిర్ధారణకొచ్చాడు .
 
న పడితే గాని వజ్రం కాంతిని సంతరించుకోదు . తన తమ్ముడు మట్టిలో మాణిక్యం అని గుర్తించిన వెంకట క్రిష్నయ్య , ఆ మాణిక్యానికి మెరుగుపెట్టే గురువుకోసం వెతుకులాట మొదలు పెట్టాడు . మేటి గురువు, వీణా విద్వాంసులు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు సందీవనం వెంకన్న గారి దగ్గర తమ్మున్నిశిష్యుడిగా చేర్చాడు .   
    
ఇక అక్కడ మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడు సంగీత తపస్సు. వాయులీన తీగెలపై గురువుగారాడించే కమాను  దృశ్యం కంటికి తెలియదు. కానీ ... చీకటి కాన్వాసుపై చిత్తరువును గీసే హృదయపు కన్ను అన్నీ చూడగలదు . నాయుడికి వాయులీనమే ... ఆశ, శ్వాశ , నిరంతర ధ్యాస ! వాయులీన సాధనలో అపర రావాణాసురుడే .. మన నాయుడు . బ్రాహ్మి ముహూర్తంలో మొదలెడితే ... అపరాహ్ణం వరకు ... సరిగమల సాగర మధనమే ! సంధ్యవేళకి మళ్ళి వాయులీన సుధా సాధనం మొదలు ! పూర్వం ఏ మునో ... పరమాత్మ తపస్సులో మునిగినట్లు ... నాయుడి రాగాల తపస్సు ! కేవలం సాధన మాత్రమె కాదు , అన్నగారితో .. సంగీత సభలకు వెళ్లి , అక్కడికి విచ్చేసే సంగీత సామ్రాట్టులు అనదగిన మహానుభావులు .. తిరుకొడికావల్ కృష్ణయ్యర్ , మలై కోటై గోవింద స్వామి పిళ్ళై వంటి వయొలిన్ విద్వాంసులు , ఇతర వాద్య ,  గాత్ర , సంగీత మహాపాధ్యాయులు, హిందుస్తానీ సంగీతకారులని దగ్గరనుండి పరిశీలించేవారు . ఆ విధంగా సంగీతంలోని ఎన్నో మెలకువలను వంట పట్టించుకొన్నారాయన. 
 
నాయుడు పరిశీలన , పరిశోధన , ఆచరణ అనే ... ప్రక్రియ అలా నిరంతరాయంగా సాగుతూనే ఉంది . ఈ లోగా నాయుడు ఫిడేల్ కచేరికి వేదిక సిద్ధమైంది . మై ఫ్రెండ్స్ అనే సంగీతసభ . ఉద్దండ గండర గండ గాత్రాల సంగీత వాహిని తర్వాత నాయుడు వేదిక పైకి వచ్చారు . బక్కపలచగా .. నల్లకళ్ళద్దాలు పెట్టుకొని .. వేదికనెక్కి , వినమ్ర వందనం చేశారు . సున్నితంగా ... వాయులీన తంత్రులని మీటడం ప్రారంభించారు. ఆ నాదం గంగా తరంగమై ... ప్రేక్షకులని చుట్టుముట్టింది. తన సంగీత స్రవంతిలో కొట్టుకుపోయేలా చేసింది. సభ ముగిసింది. వెంటనే ... కవి మారీపల్లి రామచంద్ర శాస్త్రి గారు ఆనంద భాష్పాల నడుమ వేదిక నెక్కి నాయుడిని కౌగలించుకొని , తన వజ్రపుటుంగరాన్ని తీసి నాయుడు వేలికి తొడిగారు. 'ఆదరగోట్టేసావయ్యా !   ఫిడేల్ నాయుడు !" అన్నారు. అంతే ... ఇక అప్పటినుండి ..  ద్వారం వెంకట స్వామి నాయుడుకి ...  ఫిడేల్ నాయుడు అన్న పేరు స్థిరపడిపోయింది.

యెంత నేర్చుకొన్నా అనంత విజ్ఞానజలనిధి లో   మనకు తెలిసిందెంత ! అనుకోవడం , ఇంకా నేర్చుకోవాలని తపించడం ... జ్ఞానుల లక్షణం .  సంగీత సాగరంలో అటునుండి ఇటు అలవోకగా ఈదగలిగినా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన ఫిడేల్ నాయుడిని వీడలేదు . దాంతో విజయనగరం సంగీత కళాశాలకి పయనమయ్యారు .
 
విజయనగరం సంగీత కళాశాలలో  ప్రధానోపాధ్యాయులు హరికథా పితామహులు ఆదిభట్ల  నారాయణదాసు గారు. ఆయన్ని కలిసి" అయ్యా నన్ను శిష్యుడిగా చేర్చుకోమన్నారు" నాయుడు . నారాయణ దాసు గారు నాయుడి  ఫిడేల్  విన్నారు . తర్వాత "కోరుకొండ రాజా వారు ఆనంద గజపతి  గారి అనుమతి తీసుకోవాలి కనుక  రేపు సంస్తానానికి రమ్మని" ఆదేశించారు . ఇక ఆ తర్వాతి రోజు కోరుకొండ సంస్తానంలో ద్వారం వారి వాయులీన కచేరి ! ఫిడేల్ తంత్రులపై .. సరాగాలు పోతున్న రాగాలు ... అత్తరు వాసనలా పరుచుకొని .. షాన్ డ్లిఎర్ వెలుగుల్లో చేమక్కుమని .. మనసుని తాకి .. అమృతం కురిపించి వినమ్రంగా నిలిచింది . చప్పట్లు మార్మోగాయి . నాయుడుకి విజయనగరం సంగీత కళాశాలలో ... ప్రవేశం దక్కింది . కాని విద్యార్ధిగా కాదు , ఉపాధ్యాయుడుగా !!
  
ఒక ఋషి లా సంగీత సాధన చేసిన ద్వారం వెంకట స్వామీ నాయుడు  సంగీత ఆచార్యుడిగా మారాక  తన శిష్యులకు 'వినిపించే తపస్సే' సంగీతమని, ఒక్క రోజు కూడా సాధన మానకూడదని  బోధించే వారు  . అంతే కాదు, "ఒకరోజు సాధన మానితే ... మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్థాయి. రెండు రోజులు సాధన మానితే ... మీ సంగీతం లోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి " అనేవారు .సంగీత పాఠాలు చెప్పడమే కాదు, 'తంబురా విశిష్ట లక్షణాలు ' వంటి ఎన్నో ఎన్నదగిన  సంగీత వ్యాసాలు  రాశారాయన .నాయుడు దాదాపు భారత దేశం లోని అన్ని సభల్లో తన వయొలిన్ కచేరీ లు చేశారు . ఆయన నాదోపాసనకు ఎన్నో బిరుదులూ , పురస్కారాలు దాసోహమన్నాయి .  1940 లో మైసూర్  మహారాజావారు .. బంగారు రాజ ముద్రికతోపాటు' సంగీత రత్నాకర' అనే బిరుదు నిచ్చి గౌరవించారు. 1941 లో మద్రాస్ మ్యూజిక్ అకాడమి వారు సంగీత కళానిధి అని బిరుదునిచ్ఛి సత్కరించారు . ఆ తర్వాత ఆంద్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ , 1953 లో  రాష్ట్రపతి అవార్డ్ , 1957లో పద్మ శ్రీ పురస్కారం ఆయన్ని వరించాయి .

1964 లో  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నాయుడు గారిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది .ఆ సందర్భంగా నాయుడిగారికి  సన్మానం చేసారు సంగీత  నాటక అకాడమి వారు . ఆ రాత్రి నిగినున్న ఓ తార నేలరాలింది . ద్వారం వెంకట స్వామీ నాయుడికి గుండె పోటు  వచ్చింది. అప్పటిదాకా మూగబోయిన 'వాయులీనం' పై కర్నాటక సంప్రదాయ అమృత నాదాలు పలికించి, సంగీత లొకానికి సరికొత్త శ్రుతులు నేర్పిన 'ద్వారం' శాశ్వతంగా ... ముతపడిపోయింది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ద్వారం వెంకట స్వామీ నాయుడు మరనానతరం 1993లో ఆయన శత జయంతి సందర్భంగా తపాలా శాఖ వారు తపాలా బిళ్ళ ని విడుదల చేసారు . ఈ సంగీత కళా రత్నం పేరు మీద చన్నై లో శ్రీ ద్వారం వెంకట స్వామీ నాయుడు స్మారక ట్రస్ట్ , విశాఖ పట్నం లో ద్వారం వెంకటస్వామి నాయుడు కళా క్షేత్రం, ఆయన విగ్రహాలు  స్తాపించ బడ్డాయి .

 వాయులీనమై భువానికొచ్చిన ద్వారం వెంకట స్వామీ నాయుడు కర్నాటక సంప్రదాయ సంగీతానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వాయువులో లీనమై గగనానికేగినా ...  ఆయన పంచిన సుతిమెత్తని వాయులీన స్వరాలు శాశ్వతమైనవి. చిరస్తాయిగా.. భారతీయుల హృదయాలను పులకింప జేస్తూనే వుంటాయి .

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda