శ్రీరామ లక్ష్మణుల దర్శనం చేసుకున్న బ్రిటీషు దొర !
తానీషా ప్రభువు మాదిరిగా , శ్రీరామ లక్ష్మణుల దర్శనం చేసుకున్న బ్రిటీషు దొర !
సేకరణ
తమిళనాడులో వెలసిఉన్నన్ని క్షేత్రాలు దేశంలో మారె ప్రాంతంలోనూ లేవేమో అనిపిస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి ఆలయాల రాస్ట్రమని పేరొచ్చిందేమో ! ప్రతి ఒక్క క్షేత్రానిదీ ఒక అద్భుతమైన కథ. భగవంతుని వ్యక్తిని రుజువుచేసే క్షేత్రాలివి . ఈ కేత్రాలలో శివ క్షేత్రాలతో పాటుగా , కేశవుని క్షేత్రాలు కూడా ఉన్నాయి . పైగా బ్రిటీషువారి కాలంలో వారికి కనిపించి , దర్శనం ఇచ్చి మరీ మార్గనిర్దేశనం చేసిన భగవంతుని లీలలు మనం ఈ క్షేత్రాలలో చూడొచ్చు . కంచి కామాక్షి దయకి పాత్రమైన బ్రిటీషుదొరగారు పీటర్ , ఆమెకి పాదరక్షలు సమర్పించాడు . మరో దొరగారి మాటకోసం శ్రీరామచంద్రుడు సేతురక్షణ చేశారు . ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం .
తానీషాకి శ్రీరామ చంద్రుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి , రామదాసుని ప్రాణమ నిలిపేందుకు రామమాడలు చెల్లించాడు . ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో వానకి తెగిపోయే కట్టని నిలపడం కోసం స్వయంగా ప్రకటమయ్యి , లక్ష్మణుని సహితంగా ఇక్కడ ధనుర్బాణాలు ధరించి నిలిచాడు. అలా ఒక తెల్లదొరగారికి దర్శనం కూడా అనుగ్రహించాడు . ఆ క్షేత్రం మరేదో కాదు , వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే మధురాంతకం. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.
150 సంవత్సరాల క్రితం అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వున్న ఈ ప్రాంతానికి (అప్పట్లో చెంగల్ పట్ జిల్లాలో వుండేది) లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా వున్నాడు. ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని, కేవలం క్రీస్తు రూపంలో చర్చ్ లో మాత్రమే లేడని నమ్మేవాడు. చాలాకాలంనుంచి ఆ ఆలయానికి ఎగువున వాన నీరు నిలువ చెయ్యటానికి ఒక పెద్ద చెరువు వుండేది. వాన నీరంతా ఈ చెరువులో చేరి అనేక వందల ఎకరాల సేద్యానికి వుపయోగపడేది. కానీ వాన ఎక్కువ కురిసినప్పుడు ప్రతి సంవత్సరం ఈ చెరువు గట్టు తెగి వరదలు వచ్చి పొలాలకి, ప్రజలకి, నష్టం జరిగేది.
లియనార్ ప్లేస్ ప్రజల శ్రేయస్సుగురించి ప్రతి సంవత్సరం ఎంతో ధనం వెచ్చించి ఆ చెరువుకట్టను మరమ్మత్తు చేయించేవాడు. మళ్ళీ వర్షాలతో అది కొట్టుకుపోయేది. 1798లో ఒకసారి ఆయన అక్కడ బసచేశాడు. ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు దేవాలయానికి వెళ్తున్న కొందరు బ్రాహ్మణులను కలుసుకున్నాడు. వారితో మాటల్లో వారు అమ్మవారికి ఒక ఆలయం, స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించాలనుకున్నారు కానీ ద్రవ్యలోపంవల్ల చెయ్యలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఆయన వాళ్ళతో ప్రతి ఏడూ తెగుతున్న చెరువుకట్టని రక్షించి మిమ్మల్ని ఆదుకోని దేవుడికోసం డబ్బు ఖర్చుపెట్టేబదులు, ఆ డబ్బు చెరువుకట్ట మరమ్మత్తుకుపయోగించవచ్చుగా అని అన్నాడు. వారు తమ దేవుడిమీద అచంచల విశ్వాసంతో, నిర్మల మనసుతో ప్రార్ధిస్తే తమ కోర్కె నెరవేరుతుందన్నారు. అప్పుడు ప్లేస్ నేను మీ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. నేను చెరువుకట్ట పునర్మిర్మిస్తున్నా. ఈ ఏడాది వర్షాలకి ఆ కట్ట తెగకుండావుంటే మీ అమ్మవారికి నేను గుడి నిర్మిస్తానన్నాడు.
ప్రతి సంవత్సరంకన్నా ఆ సంవత్సరం ఇంకా ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఏ క్షణమైనా కట్ట తెగవచ్చని తెలుసుకున్న ప్లేస్ మధురాంతకంవచ్చి అక్కడే విడిదిచేశాడు. రెండు రోజులు విపరీతమైన కుంభవృష్టితో ఎవరూ బయటకిరాలేదు. మూడోరోజు రాత్రి వర్షం తగ్గుముఖం పట్టటంతో తోటి ఉద్యోగస్తులతో చెరువుకట్టని తనిఖీ చెయ్యటానికి వెళ్ళాడు ప్లేస్. చెరువుకట్ట తెగి, వరదలతో భీభత్సంగా వున్న దృశ్యం చూస్తాననుకుని వెళ్ళిన ప్లేస్ అక్కడ ఒక అద్భుత దృశ్యం చూశాడు. అక్కడ ఆయనకి ధనుర్ధారులైన రామ లక్ష్మణుల దర్శనం లభించింది. కోదండరాముడు తన బాణాలతో చెరువుకి పడ్డ గండిని పూడుస్తూ కనిపించాడు.
ఆ మహాద్భుత దృశ్యం చూసిన ప్లేస్ మోకాళ్ళమీద కూలబడి ప్రార్ధనలు చేశాడు. ఆయన ఆనుచరులు, అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం బాగుండక అలా కూలబడ్డారని తలచి సహాయం చెయ్యటానికి వెళ్ళారు. ఆయన రామ లక్ష్మణులను చూసిన ఆనందంతో ఆ దృశ్యం వాళ్ళకీ చూపించబోయాడు. కానీ ఆ ఆదృష్టం అందరికీ కలుగలేదు. రామ లక్ష్మణుల దర్శనం అయిన ప్లేస్ అదృష్టవంతుడు. ప్లేస్ తన వాగ్దానం ప్రకారం స్వ పర్యవేక్షణలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు. దీనికి గుర్తుగా ఆ వూరి ప్రజల చేత శిలమీద చెక్కించబడ్డ ఈ గాధ తమిళ, తెలుగు భాషలలో ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది.
మార్గము చెన్నైకి 50 కి.మీ. ల దూరంలో, కాంచీపురం జిల్లాలో వున్న ఈ ఆలయాన్ని చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలు వున్నాయి. దర్శన సమయాలు దర్శన సమయాలు ఉదయం 7-30నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4-30 నుండి రాత్రి 8-30 వరకు.