Online Puja Services

రాములవారి ఆవలింతలు

3.145.164.47

రాములవారి ఆవలింతలు 
లక్ష్మీ రమణ 

ఆవలింతలు వస్తున్నాయి అంటే, ప్రాణాన్ని పరమాత్ముడు ఆవహించాడని అర్థం . మరి రాములోరి ప్రాణమేమో హనుమంతుడు . హనుమంతుని పరమాత్ముడేమో రాములోరు .  ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండరు , ఉండలేరు . వనవాసానికి వెళ్ళే నాడు సీతమ్మే ఆయన ప్రాణం. కానీ తిరిగి వచ్చేప్పుడు రాములవారి ప్రాణమై వెంటవచ్చారు హనుమ. ఈ నేపథ్యంలోనే సీతారాముల ఏకాంతానికి కూడా ఆటంకం కలిగిందట . అప్పుడే చోటుచేసుకుంది ఆవులింతల ఘట్టం. 
 
రాముడు -సీత, లక్ష్మణులు ఇద్దరితో కలిసి  అడవికి వెళ్ళాడు. కాని పధ్నాలుగేళ్ళు వనవాసం ముగించుకుని ముగ్గురుని తీసుకుని అయోధ్యకు మరలిచ్చాడు. ఆమూడో వ్యక్తి ఆంజనేయస్వామి! రామునికి హృదయం ఆంజనేయుడు. ఆంజనేయునికి హృదయం రాముడు. మనిషి నుంచి హృదయాన్ని ఎలా వేరుచేయలేమో, రాములవారిని , ఆంజనేయుని అలాగే వేరుచేయలేం.

సీతాదేవికి ఆంజనేయుడంటే ప్రాణమే. అతని మీద ఆమెకు పుత్రవాత్సల్యం. ఎందుకంటే, ఏడాదిపాటు లంకలో ఉండి, రామవియోగంతో కన్నీరు మున్నీరుగా గడిపిన తర్వాత, మండు వేసవిలో మలయమారుతం వీచినట్లుగా మొదటిసారి రాముని కబురు మోసుకొచ్చిన అప్తబంధువు ఆంజనేయుడే. ఆనంద భాష్పాలతో, మసకబారిన కళ్లతో అరచేతిలో ఉంచుకుని శ్రీరాముని అంగుళీయకాన్ని దర్శించిన ఆ క్షణాలు ఇప్పటికీ తీయని గుర్తులే. ఆ అంగుళీయకంలో ఆనాడు తను తన ప్రియరాముని ఆకౄతినే సీతమ్మ దర్శించింది. దానికి ప్రతిగా తన చూడామణిని రామునికిమ్మని ఆంజనేయుని చేతికిచ్చింది. ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ లేఖలు మొసినవారిమీద ఎవరికైనా ప్రత్యేక ప్రేమాదరాలు సహజంగానే ఉంటాయి కదా .

కాని, సీతమ్మ ఇప్పుడున్నది  అయోధ్యలో! అంత:పురంలో! ఆర్యపుత్రుల అనురాగభరిత సన్నిధిలో!కానీ అంజన్న అర్థం చేసుకోడే!  పగలనక, రాత్రనక ఎప్పుడూ ఆర్యపుత్రుని వెన్నంటే ఉంటాడు? ఆయనా అంతే, వారించరు సరికదా, క్షణకాలం ఆంజనేయుడు కనిపించకపోతే విలవిల లాడిపోతారు. ఏడాదిపాటు తన వియోగంలో కూడా అంతగా వేగిపోయి ఉండరేమో! ఇక స్వామివారితో ఏకాంతంగా ఆ కాంతామణి గడిపేదెలా ?ఒక వైపు మాట చెప్పలేని ప్రేమ నిండిన దైన్యం. మరోవైపు ఆపలేని భక్తి నిండిన అనుబంధం .  

ఒకనాడు మనసులోని తర్జనభర్జనలని పక్కకి పెట్టి ఆ రాములోరిని అడుగనే అడిగింది సీతమ్మ .  ’ స్వామీ , మీతో ఏకాంతమే దుర్లాభంగా ఉంది. ఇంత కన్న లంకలో ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది. అప్పుడు మీరు ఎదురుగా లేకపోయినా, మధురమైన మీ ఊహలతోనైనా బతికాను. ఇప్పుడు మీరు ఎదురుగా ఉండీ లేనట్లే ఉంటున్నారు. నాకు ఊహల తోనెనా ఆరాధించే అవకాశమే లేకుండా పోయింది అంది సీతమ్మ. ఉబికివచ్చే కన్నీటిని ఆపుకోడానికి సతమతమవుతూ.

రాముడు చలించిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. సీతకు దగ్గరకు తీసుకుని “దేవి! చెప్పు. నువ్వు ఏం చేయమంటే అదే చేస్తానూ’ అన్నారు .

‘మీరు నిత్యము కొంతసేపు కేవలం నాతోనే గడపాలి. మనిద్దరం తప్ప మూడో మనిషి ఉండకూడదు;’ అంది సీతమ్మ కొంత తెప్పరిల్లి.

రాముడి మదిలో క్షణకాలం పాటు ఏవేవో ఆలోచనలు మెదిలాయి. ‘తన ప్రాణమూ, తన హౄదయమూ అయిన ఆంజనేయుని విడిచి తను ఉండగలడా? ఆంజనేయుడు మాత్రం ఉండగలడా?అయినా అర్థాంగి మాటను శిరసా వహించడం తన కర్తవ్యం అనుకున్నడు. ‘సరే, అలాగే’ అన్నాడు.

ఆ మాటతో సీత ముఖంలో వేయిదీపాలకాంటి వరబూసింది. వర్షం మధ్యలో మబ్బుచాటునిండి చటుక్కున బయటపడే సూర్యకాంతిలా భర్త ముఖంలోకి తౄప్తిగా, ఆనందంగా చూసింది.

‘మందిరం అవతల అంతసేపూ కాలుగాలిన పిల్లిలా తిరిగిన ఆంజనేయుడు ఓసారి లోపలికి తొంగిచూసాడు. రాముడు అతణ్ణి లోపలికి పిలిచి, నాయనా! కాసేపు మన ఉద్యానవనంలో వహరించు. తోటనిండా పళ్ళు విరకాసి ఉన్నాయి. తౄప్తిగా ఆరగించు. మళ్ళీ కబురుచేసినప్పుడు వద్దువుగానీ అన్నాడు. ఆ గొంతులో ఎంత దాచుకున్న బాధ ధ్వనించనే ధ్వనించింది.

ఆంజనేయుడి ముఖం వాడిపోయింది. అయినా తన స్వామి అజ్ణ్జ! మారుమాట్లాడకుండా అమ్మకూ, అయ్యకూ మొక్కి, భారంగా అడుగులు వేస్తూ అక్కడినుంచి నిష్ర్కమించాడు.ఆంజనేయునికి రాముడొకటీ రామనామం ఒకటీ కాదుగా ! నేరుగా ఉద్యానవనానికి దారితీశాడు. అక్కడ శిలావేదికమీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ల ముందు రాముడు, ఆ పెదవులపై రామనామం. క్రమంగా ఆ వనమంతా రామనామంతో నిండిపోయింది. అక్కడి ప్రతిచెట్టూ, పుట్టా, పిట్టా రామనామ స్వరూపంగా మారిపోయాయి. జగమంతా రామమయం అయిపోయింది. ఆంజనేయుడు ఈ లోకంలో లేడు.

అక్కడ అంత:పురంలో తన అభ్యంతర మందిరంలో రాముడు ఆన హంసతూలికా తల్పంమీద కూర్చుని ఉన్నాడు. సీత ఏవేవో ముచ్చట్లు చెబుతోంది. కానీ రాములోరి వరుసగా ఆవులింతలు రావడం మొదలెట్టాయి . అవి ఆగట్లేదు . వరుసగా వస్తూనే ఉన్నాయి .  

సీతమ్మ మొదట్లో మామూలు ఆవులింతలే కదా అనుకుంది. కానీ అవి ఆగితేనా ? రాముడు ఆసౌకర్యంగా శయ్యమీద ఒకపక్కకు ఒరిగాడు. ఆవులింతలు ఆగలేదు. వరుసగా , రాజవైద్యులు , జ్యోతిష్కులూ అందరూ వచ్చారు .  అర్థరాత్రి సమీపించినా స్వామి పరిస్థితిలో మార్పు రాలేదు . చివరిగా లక్ష్మణ స్వామికి కబురు చేసింది.

లక్ష్మణస్వామి వచ్చాడు. చూశాడు. ఆయనకీ కారణం బోధపడలేదు. ఏం చేస్తే రాముని ఆవులింతలు తగ్గుతాయో ఉపాయం తోచలేదు. అలోచిస్తూ అంతలోనే ఏదొ గుర్తొచ్చినట్లు నలువైపులా పరికించి ‘ఆంజనేయుడేడి?’ అని అడిగాడు.

సీత ముఖం చిన్నబోయింది. కానీ, ఆ ప్రశ్నతో అక్కడున్నవారందరూ తెప్పరిల్లారు. ‘ఆవునవును మనం మరచిపోయాం. ఆంజనేయుడున్నాడుగా! అతడు మంచి బుద్దిశాలి. తప్పకుండా ఏదో చిట్కా చెబుతాడూ అన్నాడు.

పరుగు పరుగున సేవకులు ఉద్యానవనానికి వెళ్ళారు. ఓ మూల నుంచి రామభజన వారికి వినిపించింది. ఆ ధ్వని వచ్చినవైపు వెళ్ళారు. ఆంజనేయస్వామి పద్మాసనంలో నిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్నాడు. ‘ఆంజనేయా! ఆంజనేయా!’ పిలిచారు. పిలిచి పిలిచి అలసిపోయారు. ఆంజనేయడు కళ్ళు విప్పలేదు. భూమి కంపించినా సరే ఆంజనేయుడు ఆ సమాధ్యావస్థ నుంచి బయటకు రాడని వారికి అర్థమైంది. తిరిగివెళ్ళి లక్ష్మణస్వామికి వన్నవించుకున్నారు.

ఈసారి లక్ష్మణస్వామి స్వయంగా బయలుదేరాడు. వెళ్ళి ఆంజనేయుని ఎదుట నిలబడ్డాడు. ‘సేవకులు చెప్పింది నిజమే. ఈ స్థితిలో ఆంజనేయుని ధ్యానానికి ఎవరు భంగం కలిగించ లేరు. కానీ ఆంజనేయుడు రామకార్యదురంధరుడు! కనుక రామునికి ఆపద సంభవించిందంటే చటుక్కున కళ్ళు విప్పుతాడు!’ అనుకున్నాడు లక్ష్మణుడు.

‘ఆంజనేయా! రామునికి ఆపద వాటిల్లిందయ్యా!’ అన్నాడు.

పిడుగు పడ్డట్టుగా ఆంజనేయుడు చటుక్కున కళ్ళు విప్పాడు. ‘నా రామయ్యకు ఆపదా? నా రామయ్యకు ఆపదా?’ అంటూ ఒక్క ఉదుటున లేచి రాముని అభ్యంతర మందిరం వైపు పరుగు తీశాడు. ఒక్క అంగలో వెళ్ళి రాముని పాదాలమీద వాలాడు. ‘స్వామీ! మీకేమైంది?’ రాముని పాదాలను ఆంజనేయుని ఆశ్రువులు అభిషేకించాయి.

రాముడు రెండు చేతులతో ఆంజనేయుణ్ణి పైకి లేవదీసి, ‘నాకేమి కాలేదయ్యా హనుమా! నేను బాగానే ఉన్నానూ అన్నాడు నవ్వుతూ. అంతే ! ఆశ్చర్యం! రాముని ఆవులింతలు ఆగిపోయాయి. రాజవైద్యుడితో సహా అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆశ్చర్యపోనివారు ఇద్దరే…ఒకరు లక్ష్మణస్వామి, రెండు సీతమ్మ!

అప్పుడర్థమయ్యింది సీతమ్మకి రాముడూ , ఆంజనేయుడూ వేరు వేరుకాదు, శరీరాలు వేరైనా ఒక్కటైన ప్రాణాలు అని ! భక్తుడికీ భగవంతునికి ఉన్న అనుబంధం అది . అందుకే , పూజ చేసుకునేప్పుడు ఆవలింతలు వస్తున్నాయంటే, ప్రాణాన్ని పరమాత్ముడు ఆవహించాడని చెబుతుంటారు . 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda