ఆ శాయికి ఈ చిన్నారి పాపకి ఏంటి సంబంధం ?
ఆ శాయికి ఈ చిన్నారి పాపకి ఏంటి సంబంధం ?
లక్ష్మీ రమణ
స్వాతిముత్యం సినిమాకోసం సి . నారాయణరెడ్డి రచించిన పాట గుర్తుందా ! ‘వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి అని సాగే ఈ పాట చాలా ఫేమస్ . ఇప్పటికీ ఎవరైనా పెద్దలు కాళ్ళమీద వేసుకొని చిన్నారి పాపాలకి నీళ్లు పోస్తుంటే మాత్రం , కూనిరాగంగా అయినా ఈ పాటనే పాడుతుంటారు. ఈ వటపత్రశాయి ఎవరు ? ఆ శాయికి ఈ చిన్నారి పాపకి ఏంటి సంబంధం ?
వటపత్ర శాయి అంటే, మర్రి ఆకు మీద శయనించిన భగవానుడు అని అర్థం. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో వటపత్రశాయి ఎవరనే విశేషం ఉంటుంది . మృకండ మహర్షి , మరుద్వతి మాహాసాధ్విల పుత్రుడే మార్కండేయుడు. ఆయన శివుని అనుగ్రహంతో చిరంజీవిగా వర్ధిల్లుతూ , ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు.
అపారమైన ఆయన తపోగ్నిని చూసి , ఏడో మన్వంతరములో ఇంద్రుడు ఆయన తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి అందచందాలకు నాట్యహొయలకు మార్కండేయుడు చలించలేదు. అటువంటి నిష్టతో తపస్సు చేస్తున్న మార్కండేయుడికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ' ఏం వరం కావాలో కోరుకో ' అని అనుగ్రహించాడు . అప్పుడాయన అశాశ్వతమైన వరాలని అడగలేదు.
‘స్వామీ ! నీ మాయను చూడాలని ఉంది ' అని మార్కండేయుడు మాహావిష్ణువుని కోరుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండమైన గాలీ, ధారపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్త జీవరాశి మునిగిపోయింది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతన్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు .
చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు . అతడే వటపత్రశాయి. అప్పుడు మార్కండేయుడు మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి గర్భంలోకెళ్ళి చూస్తాడు. ఆయన గర్భంలో నీట మునిగిన సమస్త భూమీ , ప్రాణి కోటి కనిపిస్తుంది . ప్రళయం సంభవించినప్పుడు సృష్టిని కాపాడి మళ్ళీ తిరిగి అదే సృష్టిని హరి స్వరూపుడైన ఆ శాయి మరోచోట ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు . శ్రీమహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను అర్థం చేసుకోగలుగుతారు.
ఇప్పటికీ ఆ వటపత్ర శాయి స్వరూపాలైన పసిపాపలు ఆయనలాగానే చ్చిరునగవులు ఒలికిస్తూ, చక్కగా ఆ కాలిని తీసి నోట్లో పెట్టుకొని బ్రొటనవేలిని చప్పరిస్తూ కనిపియిస్తూ ఉంటారు . అందుకే పిల్లలూ దేవుడూ ఒక్కటేనని మన పెద్దలు చెప్పేది మరి !