తాత-మనవళ్ళ కోసం అవతారమెత్తిన భగవానుడు !
తాత-మనవళ్ళ కోసం రెండుసార్లు అవతారమెత్తిన భగవానుడు !
(భాద్రపద ఏకాదశి , ద్వాదశి విశిష్టతలు . )
లక్ష్మీరమణ
మనకి ప్రతి మాసంలోను రెండు పక్షాలు ఉంటాయి . ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి వస్తుంటుంది . ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అందుకే చాలామంది ఆ రోజు ఉపవాసముండి ఏకాదశీ వ్రతం చేస్తుంటారు. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి వీటిలో మరింత ప్రాముఖ్యమైనది . దీనినే ‘పరివర్తన ఏకాదశి’ గా పిలుస్తారు . ఆ తర్వాత వచ్చే ద్వాదశి కూడా అత్యంత విశిష్టమైనది . దీనిని వామన జయంతిగా పిలుస్తారు .
పరివర్తన ఏకాదశి
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు,
భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే, ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని శ్రుతులు స్పష్టం చేస్తున్నాయి.
పరివర్తన ఏకాదశిని మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. పరివర్తన అనే పదానికి అర్థంకూడా మార్పు అనేకదా! ఆ విధంగా కూడా ఇది ఒక మార్పుని సూచించే శుభదినం అని మనం అర్థం చేసుకోవచ్చు .
వామన జయంతి :
ఆ మరుసటి రోజే అంటే , ద్వాదశి నాడు శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించారట. అందుకే ఈ రోజును వామన జయంతిగా పిలుస్తారు . ఈ రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవిస్తే కలుగే ఫలం లభిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.
ఈ రోజుని శుక్ర ద్వాదశి , శ్రవణ ద్వాదశి , మహా ద్వాదశి , అనంత ద్వాదశి , కల్కి ద్వాదశి అనే పేర్లతో కూడా పేర్కొంటారు .
వామన అవతారం :
ప్రహ్లాదుని పౌత్రుడు (మనవడు) బలి. మిక్కిలి బలశాలి. గొప్ప యుద్దకళానిపుణుడు, యుద్ధనీతిజ్ఞుడు. దైత్యకులపతి. తన విశేష బలంతో ఇంద్రుని మీదకి వెళ్ళిన వాడు. ఆయన గురువు శుక్రాచార్యుని అండదండలతో,ఇంద్రుణ్ణి ఓడించి త్రిలోకాలకూ అధిపతి అయ్యాడు .
దేవతలు తలదాచుకునే నీడలేక అల్లాడిపోయారు . దేవమాత అదితి, బిడ్డల గోడు చూడలేకపోయింది . మహావిష్ణువుని ప్రార్ధించింది . ఆయన ఆమెకు కుమారుడై, వామనుడై , బ్రహ్మ తేజస్సుతో అలరారే ముద్దుల బాలుడిగా భువిపైకి వచ్చాడు .
ఆ సమయంలో బలి నర్మదానదీ తీరంలో భృగుకచ్ఛ అనే ప్రాంతంలో అశ్వమేథ యాగం చేస్తున్నాడు . అక్కడికి వెళ్ళాడు వామనుడు . బలిచక్రవర్తిని మూడడుగులనేల దానమియ్యమన్నాడు . దేవాది దేవతలకైనా వరాలిచ్చే చేతిని ఆ చక్రవర్తి ముందు చాపి , దానం అడిగి అతన్ని కటాక్షించారు . వచ్చినవాడు నారాయణుడని తెలిసిన దైత్యగురువు శుక్రాచార్యుడు, మహాదానకర్ణుడైన బలి చక్రవర్తికి ఆ విషయాన్ని చెప్పాడు. అన్నీ తానైన విశ్వపురుషుడే నాముందు దేహీ అంటే , నేను వెనకడుగువేయడం బావ్యంకాదన్నాడు బలి. గురువు తన ప్రయత్నం వీడలేదు . ఆఖరి ప్రయత్నంగా ధారబోస్తున్న బలిని అడ్డుకోపోయాడు . పుల్లతో కన్నుపొడిచి పక్కకి నెట్టాడు నటనసూత్రధారి .
ఆ మూడడుగులు కొలుచుకోమన్నాడు వటునితో బలి చక్రవర్తి .
అంతే , అప్పటివరకూ పొట్టి బ్రహ్మచారీగా ఉన్న వామనుడు ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆ స్వామీ ఒక్క అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గాన్నీ కొలిచేసి , మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావ్ అన్నాడు .
తన శిరస్సుని చూపాడా చక్రవర్తి . తన పాదాన్ని ఆయన శిరస్సున ఉంచి మూడో అడుగు దానం పుచ్చుకున్నారు. ఆవిధంగా పాతాళానికి పంపారు బలిచక్రవర్తిని వామన వటువు. ఆలోకానికి చక్రవర్తిగా ఉండమని ఆదేశించారు . అయితే, బలి దానశీలతకి సంతోషించి, సాపర్ణి మనువు కాలంలో ఇంద్రపదవిని చేపడతావని ఆశీర్వదించారు .
ఆవిధంగా తాతయిన ప్రహ్లాదుని కోసం నరసింహస్వామిగా వస్తే, మనవడైన బలి చక్రవర్తి కోసం వామనుడిగా అవతరించారు శ్రీహరి . ఈ కథని చదువుకొని , వామన మూర్తిని పూజించిన వారికి సకలశుభాలూ కలుగుతాయని శ్రుతివచనం .
కంచిపురంలోని కామాక్షి దేవాలయానికి దగ్గరగానే దశావతారాల్లో ఐదవదైన వామన మూర్తి దేవాలయం ఉంది. దీన్ని వామనకంచి అని పిలుస్తారు. ఈ వామనాలయం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా వామనుడు మరుగుజ్జు రూపంతో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ వామనుడు 30 అడుగుల ఎత్తుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతున్న ఘట్టాన్ని ప్రదర్శిస్తూ అద్భుతంగా ఉంటారు . ఈ దేవాలయాన్ని సందర్శిస్తే నరకలోక ప్రాప్తి తప్పుతుందని చెబుతారు.
శుభం .