హనుమంతుడికి ఒంటె ఎలా వాహనమయ్యింది?
హనుమంతుడికి ఒంటె ఎలా వాహనమయ్యింది?
లక్ష్మీ రమణ
హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు. స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ ! సూర్యుణ్ణే పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా ! అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా ! అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ !
ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి . కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహం ఉంటుంది . ఒంటె, ఆంజనేయ స్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాఢ ఉంది .
రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది. మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని తానూ తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.
ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం.