భీముని భాగ్యం పొందలేకపోయిన తొండమానుడు.
తిరుమల రాయునితో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా, భీముని భాగ్యం పొందలేకపోయిన తొండమానుడు.
- లక్ష్మి రమణ
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటనాథుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవి. వారిద్దరి జంటా భక్తులకి కన్నులపంట. శరణు వేడినవారికి వరముల పంట . అటువంటి పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజుకి స్వయంగా సోదరుడు తొండమానుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభషణలు చేసేవాడు! భక్తునికి అతని భక్తే శక్తి . కానీ అదే భక్తి అహంకారానికి దారితీస్తే, దానికి దండన కూడా అనుభవించాల్సిందే మరి ! అటువంటి పరాభవం అంతటి తొండమానుడికీ తప్పలేదు !!
తొండమానుడి భక్తి ప్రపత్తులని చూసి, అతనికి దక్కిన శ్రీనివాస సేవా భాగ్యాన్ని చూసి దేవతలు సైతం అసూయపడేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆకాశవాణి “ తొండమాన్ చక్రవర్తీ ! భాగ్యమన్న నీదే భాగ్యమయ్యా ! ఆలయ నిర్మాణం నుండీ , నిత్యారాధన వరకూ శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా!” అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప మారు ఆలోచనే మదిలో లేని తొండమానుడు ఆకాశవాణి మాటలకి పొంగిపోయాడు. “ ఆహా నిజమే కదా ! నా వంటి భక్తాగ్రేశ్వరుడు మారే లోకంలోనూ కానరాడు” అనుకున్నాడు.
భగవంతుని నిజమైన ఆనందనిలయం మన హృదయమే ! తొండమానుడి హృదయంలోని మాట ఆ స్వామికి వినిపించదా ? అలా మొలకెత్తిన అహంకారం ఆయనకీ కనిపించదా ! భక్తికి పరవశుడయ్యే పరమాత్మ అహంకారం తలెత్తితే దాన్ని తన వామన పాదంతో అణిచివేస్తాడు. అదే సమయంలో తన భక్తులపాలిటి కరుణాసముద్రుడన్న తన నామాన్ని సార్ధం చేసుకుంటాడు . సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని విషయంలోనూ తన ఈ స్వభావాన్ని చాటారు. సున్నితంగా అతనికి గుణపాఠం చెప్పేందుకు ఉద్యుక్తులయ్యారు.
ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ “దేవాధిదేవా! నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలోనే లేరనిపిస్తోంది ! నీకు అత్యంత ప్రియమైన నావంటి మరో భక్తుడు నీ ఎరుకలో ఉన్నాడంటావా? ” అని ప్రశ్నించాడు. తరుణం ఆసన్నమయ్యాక జగన్నాటకసూత్రధారి తన నాటకానికి ఇంకా నాంది పలుకకుండా ఉంటారా ! అయినా అప్పటికి తన సమ్మోహనమైన చిరునవ్వునే సమాధానంగా ఇచ్చి, తొండమానుడి భ్రమని అలాగే ఉండనిచ్చారు .
తరువాతి రోజున తొండమానుడు ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి, కలిదోషనివారణములైన శ్రీపాదలను సువర్ణ కమలాలతో అర్చించారు . కానీ, స్వామి పాదాల చుట్టూ కన్నులు మినుమిట్లు గొలిపే సర్యమండలంలా ప్రకాశించాల్సిన ఆ సువర్ణ కమలాల నడుమ, వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న, కమలాలు తులసీదళాలు కనిపించాయి . పైగా అవి అయన పాదాలని ఆశ్రయిస్తూ, స్వామి పాదపద్మాలకి అత్యంత సాన్నిహిత్యంగా దర్శనమిచ్చాయి. ఏ భక్తుడు తనని దాటుకొని ఈ మట్టి అంటిన పూలని ఉంచాడో ఆ మహారాజుకు అర్థం కాలేదు . ఎలా ఈ మట్టి పూలు ఆ ఏడుకొండలూ ఎక్కి స్వామిని చేరగలిగాయో అంతుపట్టలేదు . భ్రమలో ఉన్నవారికి పరమాత్ముని ప్రకాశం ఎలా కనిపిస్తుంది ? స్వామిని ప్రశ్నించిన తొండమానుడికి , ఆయన చిరు దరహాసంతో సమాధానమిచ్చారు .
“ భక్తా ! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. భీముడు నామీదున్న ప్రేమకొద్దీ కుటంబంతో కలిసి ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి, అందులో నా రూపుని ఉంచి పూజిస్తుంటాడు. ఆగూడు అతని హృదయంలో కూడా కట్టాడు. అందువల్ల అతను చేసే పూజలని నేను ఇక్కడి నుండే అందుకుంటున్నాను. మట్టి చేతులతో అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి.” అన్నారు. భగవాన్ సర్వాత్మకః అని అర్థం చేయించే ప్రయత్నం కాబోలు !!
కానీ భక్తుని ఆలోచన వేరు . తన పూజని మించిన పూజ. సువర్ణాన్ని మించిన మట్టి పుష్పాలు. ఎలా సాధ్యం ఇది ? నిష్కల్మషమైన మంచి హృదయం రాజుదైనా పేదదైనా, ఆ పరమాత్మునికి భేదం ఉంటుందా ! అహంకారంతో కూడిన అంబరం కన్నా , ప్రేమనిండిన గుడిసే సౌఖ్యం కాదా ! ఈ తత్త్వం లో ఈశ్వరత్వం బోధపడ్డాక, తొండమానుడి కళ్ళవెంట అశ్రువులు ధారలుకట్టాయి. చేసిన తప్పుని ఆయన హృదయం కన్నీళ్ళయి వ్యక్తీకరించింది. వెంటనే ఆ భక్తాగ్రేశ్వరుని దర్శనానికి వెళ్లాలనుకున్నాడు. తప్పు క్షమించమని , వేంకటేశ్వరుని వేడుకున్నాడు.
“జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు. తండ్రీ! వెంటనే వెళ్ళి భక్తాగ్రేశ్వరుడైన భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు. భీముని దర్శనం చేశాడు.
ఆ సమయంలో కుమ్మరి భీముడు, తన భార్యతో కలిసి తామర తూడులతో చేసిన నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తున్నారు. భక్తి పారవశ్యంతో ఆ స్వామిని అర్చిస్తున్నారు. తొండమానుడు చూస్తూండగానే, గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. ఆ పేద దంపతులు భక్తితో అర్పించిన ఆ తామరతూడుల పదార్థాన్ని ఇష్టంగా భుజించారు. భీముని కుటుంబానికి కలిగిన ఆ భాగ్యాన్ని చూసిన తొండమానుడికి లేశమాత్రంగా ఉన్న గర్వమంతా కూడా ఖర్వమైపోయింది.
అనుగ్రహించిన పరమాత్మ ఆ కుమ్మరి దంపతులకి వైకుంఠాన్ని అనుగ్రహించారు. తొండమానుడు చూస్తూండగానే వారిద్దరూ కూడా దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు “ప్రభూ! నాకు ఈ జన్మకి ముక్తి లేదా! ఈ అనుగ్రహం నాకు లభించదా ? స్వామీ, నిత్యం నీ సేవలోనే తరిస్తాను. నన్ను కూడా అనుగ్రహించవయ్యా ” అని ప్రాధేయపడ్డడు. అప్పుడు జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని దీవించారు .
అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. కనుక ఆ స్వామి పాదాలకి సర్వశ్యశరణాగతి చేసి నిజమైన స్వామి అనుగ్రహమనే అమృతాన్ని వరంగా పొందుదాం !
నమో వెంకటేశాయ !!