Online Puja Services

అప్పుడు శ్రీనివాసుడురాసిన ప్రాంసరీనోటు

18.217.118.7

అప్పుడు శ్రీనివాసుడురాసిన ప్రాంసరీనోటు ఇప్పటికీ ఉంది . 
-లక్ష్మీ రమణ  

పెళ్ళిచేసికూడు ఇల్లుకట్టి చూడు అని సామెత . హిందూ సంప్రదాయంలో పెళ్లంటే, ఆడపిల్లవారికి పట్టపగలు చుక్కలే మరి . ఓవైపు అతిధి మర్యాదలు , మరోవైపు మగపెళ్ళివాళ్ళ గొంతెమ్మకోర్కెలు వాటికయ్యే ఖర్చులు ! ఎక్కడికక్కడ చిట్టాపద్దులు తేలక ఏంచెయ్యాలో తెలీక తలపట్టుకొనే పరిస్థితి ప్రతి ఇంటా అనుభవమే!! కానీ మన ఇతిహాసాల్లో పెళ్లిచేసుకోవడానికి అప్పుచేసిన మగపెళ్లివారున్నారు. ఆయన రాసిచ్చిన రాగిరేకు ప్రమాణమూ అది సత్యమనేందుకు ఆధారంగా ఇప్పటికీ ఉంది . ఆ కథ చూద్దాం పదండి . 

కలియుగప్రత్యక్షదైవం శ్రీనివాసుడి కథయిది . వలచి వలపించిన రమణిని చేపట్టేందుకు ఆ రమణుడికి ఎన్ని కష్టాలొచ్చాయో వర్ణించతరంగాదు. శ్రీహరి లక్ష్మి ఉన్నంతవరకూ శ్రీమంతుడే ! కానీ ఓ వైపు లక్ష్మీ దేవి స్వామిని వీడి కొల్హాపురం వెళ్ళిపోయింది . లక్ష్మిలేనిదగ్గర రూపాయి ఎక్కడిది ? 

మరోవైపు ఆడపెళ్ళివారు ఆగర్భ శ్రీమంతులు. ఆకాశరాజు తో వియ్యమంటే మాటలా ? ఆమాటకొస్తే, శ్రీనివాసుడుమాత్రం ఏం  తక్కువని? ఆయన ఆకాశరాజు, ఈయన బ్రహ్మాండ రాజు. దేవాది దేవులు , ఆదిదేవుడు , బ్రహ్మదేవుడూ , వారి భార్యలు , పరివారజనాలు , ఋషులు అందరూ శ్రీనివాసుణ్ణి కల్యాణమూర్తిగా చూడాలని ఉవ్విళ్ళూరుతూ విచ్చేశారు . కానీ , డబ్బుదగ్గర కొచ్చేసరికి , ఎక్కడైనా రాజేగానీ, రూపాయిదగ్గర కాదన్నది కాసులక్ష్మమ్మ . 

భోజనాలు పెట్టాలి నాన్నగారూ , కాసులు ఏర్పాటు చెయ్యండన్నారు బ్రహ్మగారు . ఏంచేయ్యాలా అని మదనపడుతున్న శ్రీనివాసుణ్ణి పక్కకి పిలిచి , ఆదివరాహ స్వామి క్షేత్రంలో అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకెళ్లాడు శివయ్య ( ఆ చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది). అందరిముందూ అప్పు గురించి మాట్లాడితే పరువు దక్కదని భయపడ్డారేమో మరి . అప్పుడు పరమ శివుడు ‘మనదగ్గర డబ్బులేకపోయినా ఫరవాలేదు కానీ , నాకు బాగా డబ్బుకల స్నేహితుడు ఉన్నాడు  అప్పు చెయ్యవయ్యా’ అని సలహా ఇచ్చారు . 
 
‘నా పక్కన ఎప్పుడూ కుబేరుడు ఉంటాడు . ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతా’నన్నారు . కుబేరుని పిలిచి శ్రీనివాసునికి అప్పు కావాలి ఇవ్వమని అడిగారు . అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు ఎంతటివాడైనా లోకువేకదా !

‘ఆయన ...మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది ? 
కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం . 
అది తప్పేమీ కాదు కదా’ అన్నాడు.
అందువల్ల వడ్డీ ఇస్తేనే అప్పు ఎంత కావాలన్న ఇస్తానని అన్నారు .

 “యుగధర్మానికి ఎవరైనా కట్టుపడవలసిందే ! అలాగే వడ్డీ ఇస్తాను ” అన్నాడు పెళ్ళికొడుకు.

అయితే తీసుకుంటున్న అప్పుకి హామీ పత్రం రాయాలి అన్నాడు కుబేరుడు.

" ఋణగ్రహీ శ్రీనివాసః , ఋణదాతా ధనేశ్వరః ' అని ప్రామిసరీ నోటు వ్రాశారు .

హేవిలంబీ నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి ఫలానావారంనాడు అశ్వత్థవృక్షం కింద నిలబడి పదునాలుగు లక్షల (14.14) రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారుకాసులను ,.ప్రతినూరు కాసులకి ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు , యుగాంతమయ్యేసరికి అసలు తీర్చేటట్లు నోటు వ్రాసి ఇచ్చి , " అయ్యా ! డబ్బు ఇమ్మని ” అడిగారు . 

నోటు వ్రాసి ఇచ్చినందుకు సంతోషమే కాని యుగధర్మం కనక సాక్షి సంతకం  ఉంటేనే డబ్బు ఇస్తాను అన్నాడు కుబేరుడు !  

శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూస్తే ఆయన నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు . 

ఒక సాక్షి , ఒక కొడుకు ఉన్నా , ఉండక పోయినా ఒకటే ! ఏమి అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అన్నాడు కుబేరుడు  . శ్రీ వేంకటేశ్వరస్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుని వంక చూస్తే తాను చేస్తాను- అన్నారు . మీరు పెడితే మాకేం , తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు - కుబేరుడు . 

పరమ శివుడు సాక్షిసంతకం పెట్టాడు .
 
అప్పుడు మెల్లగా కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంత బాగుండునో , అని బలంగా అన్నాడు . 

అప్పిచ్చేవాడు ఎంత నాటకీయంగా , అందంగా మాట్లాడతాడో చూడండి  . మూడోవారు ఎవరా ! అని తలపైకి ఎత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనపడింది . దానికన్నా ధర్మమూర్తి వేరొకరు ఉండరు .“ నేను చేస్తాను మహాప్రభో ” అని ఆ వృక్షం కూడా సంతకం చేసింది . 
ముగ్గురుసాక్షులు సంతకాలు చేశాకే  అప్పిచ్చాడు కుబేరుడు . 
 
అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. 'భవిషత్తులో నా భక్తులు , చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను' అంటాడు. డబ్బి మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు.
 
పెళ్లికి అప్పు దొరికింది కనుక అప్పుడు పెళ్లికి, విందు భోజనానికి కావలసిన సరుకులు తెప్పించారు. అలా శ్రీనివాసుడికి అప్పిచ్చారు కుబేరుడు.  

ఇప్పటికీ ఆ రాగిరేకు తిరుమలలో ఉంది మరి !! అందుకే ముక్కుపిండయినా సరే, మొక్కులు వసూలు చేసుకుంటాడా వడ్డికాసులవాడు ! పాపం మధ్యతరగతి బతుకులు పడే పెళ్ళిఖర్చుల బాధ ఆ పరాత్పరుడికైనా తప్పిందికాదు .

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda