ఆకాశగంగ ఎలా ఏర్పడింది?
తిరుమల పుణ్య క్షేత్రం యందు ఆకాశ గంగ ఎలా..ఎందుకు ఏర్పడింది..!!
తిరుమలనంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం స్వామి వారి కైంకర్యమే మహాదానందం తో పాపనాశనానికి వెళ్లి అక్కడ నుండి నీటికుండ నెత్తికి ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు.
పరమభాగవతోత్తముడైన తిరుమలనంబి శ్రమకు అలసట.. తిరుమలనంబి శ్రమను తీర్చదలిచి స్వామీ వేటబాలుడై ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి తీర్థం తెచ్చే దారిలో చెట్టునీడన. కూర్చున్నాడు.
స్వామివారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు స్వామి. నంబిని.. దాహంగా ఉంది గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అన్నాడు. అందులకు నంబి" బాలకా ! ఇది దివ్యజలం, స్వామి అభిషేకపు జలమిది. నీవు అడగరాదు, నేనివ్వరాదు అన్నాడు. అయిననూ వేటగాడు గా వున్న స్వామి తాతా ! నీరు పోసి ప్రాణం రక్షించవా ? అన్నాడు.
నీ దాహం తీర్చాల్సినవాడు భగవంతుడు బాలకా. కావున భగవంతుని ప్రార్థించు. అతడే రక్షకుడు, ప్రాణరక్షకుడు అని చెప్పి, స్వామి అభిషేకంనకు నాకు సమయాతీతం అవుతున్నదని వేగంగా అడుగు సాగించాడు నంబి.
స్వామి నంభి తీసుకెళుతున్న కుండకు బాణం కొట్టాడు. దానికి చిల్లు పడింది. నీటి ధార సాగింది. స్వామి దోసిటితో నీరు త్రాగసాగాడు. కుండ తేలిక అయింది, ఎందులకు అని తిరుమల నంబి తిరిగి చూచాడు. బాలుడు చేత బాణం చే కుండకు ఏర్పడిన రంధ్రం నుండి ధారగా పడుచున్న స్వామి వారికి అభిషేకం చివరి నీటిబొట్టుతో పూర్తిగా ఖాళి అయినది అంతటితో నంబి హతాశుడైనాడు. కూలబడ్డాడు.
శ్రీస్వామికి ఏదో అపచారం చేసాను అని గొల్లుమన్నాడు, కన్నీరు కాలువ కట్టింది, అది చూచి స్వామి నివ్వెరపోయాడు. ఎంతటి భక్తి ? భక్తుని కన్నీరు భగవంతుని భాష్పమైంది.
తాతా లే, నీకు పవిత్రజలం చూపుతాను, నాతొ రా అని నంబి చేయిపట్టుకొని లేపి రెండేరెండు అడుగుల్లో కొండచరియకు చేరాడు. అక్కడ నుండి స్వామి బాణం ఎక్కుపెట్టి, కొండకు కొట్టాడు మిరమిట్లు మెరుపుతో కొండనుంచి జలధార. అదే ఆకాశగంగ.
తిరుమలనంబికి తెలివి వచ్చింది, జలధార, బంగారుబిందె. మరొకరు వినలేదు, కనలేదు. అంతటితో నంబి కాలాతీతం కాకూడదు అని ఆ ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకున్నాడు. అంతా చకితులయ్యారు, దానిని నంబి గమనించలేదు.
నాటి నుంచి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థంతోనే శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం జరుగుతుంది.